Aug 20,2022 07:09

భయంకరమైన మత విభజనల పెరుగుదలతో పాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగుతున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు...కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభిప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను 'దేశద్రోహం' గానే పరిగణిస్తున్నారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ''ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌''గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్‌, సిల్క్‌ కానటువంటి పాలిస్టర్‌ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్‌ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్‌ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలను పొందే అవకాశాలను ఇది సమకూర్చుతుంది.
            అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యేంతవరకు, ఆరెస్సెస్‌, బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రోద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్‌ ఇంటిలిజెన్స్‌ నివేదికలు ధృవీకరించిన నిజం.
కమ్యూనిస్టుల మహోన్నతమైన పాత్ర
                 దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థాపక పొలిట్‌ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌ లోని సెల్యులార్‌ జైల్‌ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలా పేర్లు కమ్యూనిస్ట్‌ విప్లవోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్‌, 15 నాటికి కన్ననూర్‌ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్‌ ఎ.కె. గోపాలన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించాడు. 1932 హోషియార్‌పూర్‌ కలెక్టరేట్‌లో యూనియన్‌ జెండాను కిందకు లాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ను బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశభక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.
            1920లో దాని పుట్టుక నుండే కమ్యూనిస్ట్‌ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌలానా హస్రత్‌ మోహాని, స్వామీ కుమారానంద బ్రిటిష్‌ వారి నుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు ('సంపూర్ణ స్వరాజ్యం' పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆ తర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో కూడా ఇది కొనసాగింది.
             జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు. 1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి. కేరళ లోని పున్నప్ర వాయలార్‌, బెంగాల్‌ లోని తెభాగ పోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.
            భారతదేశంలోని భాషాపరమైన భిన్నత్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరాటంతో ఐక్యం చేయడంతో, స్వతంత్ర భారతదేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదం పట్ల కమ్యూనిస్టులకుండే అచంచలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి, నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
                కానీ, నేడు తమను తాము స్వాతంత్య్రోద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీలు చరిత్రను వక్రీకరించి, చరిత్రను తిరగ రాసే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్‌ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారంలో ఉదహరించబడిన వారిలో వీడీ సావర్కర్‌ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల 'హిందూత్వ' అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్‌. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయకత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. దానిని బ్రిటిష్‌ వారు ప్రోత్సహించాడు. ఆ తర్వాత విషాదకరంగా దేశ విభజన జరిగింది. హిందూత్వ అనుకూల చరిత్రకారుల ప్రకారం, సెల్యులార్‌ జైల్లో ఖైదీగా ఉన్న సావర్కర్‌ తన విడుదల కోసం బ్రిటిష్‌ వారికి క్షమాభిక్ష పిటిషన్లను పంపాడు. బ్రిటిష్‌ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్‌, తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం, కాంగ్రెస్‌, వామపక్షాల నేతృత్వంలోని ఉద్యమాలకు వ్యతిరేకంగానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్‌ ఇండియా లాంటి ఉద్యమాలలో హిందూ మహాసభ, ఆరెస్సెస్‌ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు.
                   ఈ వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారాలలో జవహర్‌లాల్‌ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒక ఆధునిక లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మానాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసుకొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
             ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి...మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవుతున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్‌ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టాలను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగిపోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన నేరానికి గతంలో ఏనాడూలేని విధంగా 27 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పని చేయని పార్లమెంట్‌ చాలా ప్రమాదకరం. అంటే భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌమత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం. పార్లమెంట్‌ను బలహీనపర్చడమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.
              దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికల బాండ్లు మన రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీంకోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పాక్షికత, స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు, ప్రజాస్వామిక హక్కుల హామీలు, పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.
              అదేవిధంగా, ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయాలను ప్రతిబింబించవు.
             సీబీఐ, ఇ.డి మోడీ ప్రభుత్వ రాజకీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనాలుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం, ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
           ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశనం చేయడంతో పాటు భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరితమైన ద్వేషం, భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున 'బుల్డోజర్‌ రాజకీయాల' వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్‌ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సందర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారత రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని హిందూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.
నిరంకుశ దాడులు
             ఇలాంటి భయంకరమైన మత విభజనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగుతున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు...కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభిప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను 'దేశద్రోహం' గానే పరిగణిస్తున్నారు.
హేతుబద్ధతపై దాడి
           ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే, ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనారహిత ఆలోచనలను ప్రచారం చేస్తున్నారు. హేతుబద్ధత స్థానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్డి విశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయతను కాదని పురాణాలను ప్రచారం చేస్తున్నారు. చరిత్ర స్థానంలో హిందూ పురాణాలను, తత్వశాస్త్రం స్థానంలో హిందూ ధర్మ శాస్త్రాన్ని తీసుకొని రావడం ద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు.
ప్రజాప్రతిఘటన పెరగాలి
                 ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరాటాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారతదేశం యొక్క లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసుకోవాలి. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటాలను ఉధృతం చేయాలి.
             బలమైన ప్రజా పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతోన్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని రక్షించుకోగలం. ఈ లక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్‌ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, మన రాజ్యాంగంలోని పీఠికపై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.
            ఈ ఉన్మాద పూరిత, ఫాసిస్టు ప్రయత్నాల నుండి స్వేచ్ఛ కోసం, మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ను కాపాడుకోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచుకుందాం!
                                 భయంకరమైన మత విభజనల పెరుగుదలతో పాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగుతున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు...కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభిప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను 'దేశద్రోహం' గానే పరిగణిస్తున్నారు.          

                        సీతారాం ఏచూరి / వ్యాసకర్త : సిపిఎం ప్రధాన కార్యదర్శి /