Jul 26,2022 06:49

ఇటీవల ఇద్దరు మహిళలపై తమ భర్తలు చేసిన పాశవిక దాడులు చూసి, ప్రపంచం నిర్ఘాంతపోయింది. నర్సు ఉద్యోగంలో చేరిందనే కారణంతో, పశ్చిమ బెంగాల్‌ బర్ద్వాన్‌ జిల్లాకు చెందిన రేణు కతూన్‌ కుడి చెయ్యి నరికేశాడామె భర్త. ఇది మన దేశంలో జరిగిన సంఘటన అయితే, మరొకటి రష్యా లోని పీటర్స్‌బర్గ్‌లో చోటుచేసుకుంది. భర్త కోపంలో తన రెండు చేతులు నరికేయగా, కృత్రిమ చేతులతో టి.వి యాంకర్‌గా పనిచేస్తోంది మార్గరెట్‌ గ్రెచెల్‌. ఎంత దారుణం ? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 'మహిళలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ హింస మహిళలు శారీరక మానసిక అనారోగ్యాలకు మూలం'. ఈ రెండు సంవత్సరాలగా కోవిడ్‌ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 85.2 కోట్ల మంది మహిళలు (ప్రతీ ముగ్గురులో ఒక్కరు) తమ భర్తల చేతిలో హింసకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రాంతాల వారీగా విశ్లేషణ చేస్తే, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో 20 శాతం, యూరప్‌ లో 22 శాతం, అమెరికా లో 25 శాతం, ఆఫ్రికా లో 33 శాతం, మన భారతదేశంలో 33 శాతం నుంచి 41 శాతం మంది మహిళలు గృహ హింస, లైంగిక వేధింపులకు గురైనట్లు సమాచారం.
     ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఈ కోవిడ్‌ సమయంలోనే 24.3 కోట్ల మంది మహిళలు, బాలికలు లైంగిక దాడులకు గురైనారు. 2021 సర్వే ప్రకారం సుమారు 13 దేశాల్లో ప్రతీ నలుగురు మహిళల్లో ఒకరు తమ ఇంటి వద్ద కూడా సురక్షితంగా లేరని, ప్రతీ ఇద్దరులో ఒకరు లైంగిక దాడులకు గురయ్యారని తెలుస్తోంది. ఈ పరిస్థితి వివిధ దేశాల వారీగా పరిశీలన చేస్తే అమెరికా లో 8.1 శాతం, ఆస్ట్రేలియా అర్జెంటీనా, మెక్సికో, ఇండియా, ఇటలీ, స్వీడన్‌ వంటి దేశాల్లో సగటున 7.8 శాతం ఉన్నదని నివేదికల సారాంశం. 2013 డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక ప్రకారం, 42 శాతం మహిళలు గృహ హింస వలన గాయాలపాలవుతున్నారు. 1.5 శాతం మంది సుఖవ్యాధుల (యస్‌.టి.డి) బారిన పడుతున్నారు. ఎక్కువగా గర్భస్రావాలు జరుగుతున్నాయి. 41 శాతం ముందస్తు ప్రసవాలు జరుగుతున్నాయి. మరికొందరు మానసిక ఒత్తిడి, నిద్ర లేమితో బాధపడుతున్నారు. దీనికంతటికీ కారణం గృహ హింస. ముఖ్యంగా భర్త, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులని తెలుస్తోంది.
     గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజెస్‌-2020 రిపోర్ట్‌ ప్రకారం గృహహింస వలన అనేకమంది మహిళలు అనారోగ్యాలకు గురవుతున్నారు. 11 శాతం మంది డిప్రెషన్‌ కు, 13.9 శాతం మంది మహిళలు హెచ్‌.ఐ.వి బారిన పడుతున్నారు. మద్యం, చెడు స్నేహాలు, మత్తు, ఒత్తిళ్లు, ధనదాహం, సామాజిక మాధ్యమాల ప్రభావం, అశ్లీల మెసేజులు, వెబ్‌సైట్లు, జీవన విధానాలు అన్నీ మహిళల పట్ల వివక్షత, దోపిడీ, హింసలకు ప్రధాన కారణం అవుతున్నాయి. అంతే కాకుండా, 151 దేశాల్లో జరిపిన సర్వే ప్రకారం, వాస్తవంగా మహిళలపై జరిగే అనేక అఘాయిత్యాలు, దోపిడీలు బయటకు రావడం లేదు. అందుచేతనే నిర్దిష్టమైన సమాచారం, లోతైన వివరాలు తెలియటం లేదు. సగటున ప్రపంచ వ్యాప్తంగా మహిళ తన జీవిత కాలంలో 4.1 సంవత్సరం గృహహింస బారిన పడుతుంది. ఇక ప్రాంతాల వారీగా విశ్లేషణ చేస్తే, ఆఫ్రికా లో 6 సంవత్సరాలు, ఆసియా లో4.3, ఓషియానియా లో 2.6, అమెరికా, యురప్‌ ప్రాంతాల్లో 1.7 సంవత్సరాలు, మన దేశంలో 6.2 సంవత్సరాల పాటు మహిళలు తమ జీవిత కాలంలో గృహ హింస ఎదుర్కొంటున్నారు. 2021 డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక ప్రకారం, 34 నుంచి 79 శాతం మహిళలు తమ భర్తల నోటి దురుసుకు బలైపోతున్నారు. మరి కొందరు చేతి దెబ్బలు తింటున్నారు. ఇక ఇటువంటి వివరాలు మన భారతదేశంలో ఊహకు అందడం లేదు. సరైన గణాంకాలు, సర్వే సంస్థలు, పరిశీలన బృందాలు, తనిఖీ అధికారులు లేకపోవడం ప్రధాన కారణం. కొన్ని సామాజిక అంశాలు కూడా కారణంగా వున్నాయి. పితృస్వామిక కుటుంబ ఆధిపత్యం ఇంకా చాలా కుటుంబాల్లో కొనసాగుతోంది. ఇతర యూరోపియన్‌ దేశాల్లో కూడా మహిళలు వేదనలకు, వేధింపులకు అతీతంగా లేరు.
    ఇక మన దేశంలో ఇటీవల విడుదలైన ''నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే'' నివేదిక ప్రకారం 30 శాతం మహిళలు ఆరోగ్యంగా, తృప్తికరమైన జీవితం గడపటం లేదు. అనారోగ్యం, తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిడితో జీవితం గడుపుతున్నారు. 2019 యన్‌.సి.ఆర్‌.బి నివేదిక ప్రకారం మన దేశంలో 4,05,861 కేసులు నమోదయ్యాయి. భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆయా మహిళలపై చేసిన అఘాయిత్యాలు, గృహహింస, దాడులకు సంబంధించినవే.
    భార్యాభర్తలు బండికి రెండు చక్రాల వంటి వారంటారు. కానీ ఆడపిల్లలంటే చులకన. ఆస్తిలో, చదువులో, సమాజంలో ఇలా అన్నింట మగవారితో పోలిస్తే తక్కువ అనేది వాస్తవం. సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం లేకపోవడం, మానసిక ఒత్తిడి, విడాకుల పర్వాల సంగతి సరేసరి. ఇక రాజకీయ భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటోంది. నేటికీ పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందక పోవడం తాజా ఉదాహరణ. మన దేశంలో అనేక కుటుంబాల్లో మహిళలు శారీరక మానసిక ఒత్తిడికి గురికావడం జరుగుతున్నది. వరకట్న వేధింపులు, సామాజిక మాధ్యమాల్లో చులకన భావం, అశ్లీలతతో కూడిన వికృత పోకడలు, ర్యాగింగ్‌, వివక్షత కొనసాగుతూనే ఉంది.
     మన దేశానికి వచ్చేసరికి...మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు, నియమ నిబంధనలు రూపొందించారు. జాతీయ మహిళా కమిషన్‌ ఏర్పాటు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, బాలికల అభివృద్ధి కోసం జాతీయ ప్రణాళిక, మహిళా సాధికారత కోసం జాతీయ ప్రణాళిక, మహిళా సాధికారత మిషన్‌ ఏర్పాటు, వీరి సమస్యల సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు, దిశా చట్టం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో షీ టీమ్‌లు, మహిళా పోలీస్‌ స్టేషన్లు, దిశా యాప్‌, మహిళా కమిషన్‌ ఏర్పాటు వంటివి ఏర్పాటు చేశారు.
    మహిళలు తమ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా బాలికలు, మహిళలు చదువుకోవాలి. సమాజాన్ని అర్థం చేసుకోవాలి. తమ హక్కులు గుర్తించాలి. ప్రభుత్వాలు అందచేస్తున్న, అమలు చేస్తున్న పథకాలు అవగాహన చేసుకోవాలి. స్వయంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని, సాధికారత సాధించడం ద్వారానే మహిళలు వెలుగొందుతారు.
 

- ఐ. ప్రసాదరావు,
సెల్‌ : 6305682733