- రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇంటర్మీడియట్ విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి
ప్రజాశక్తి-కాకినాడ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఇంటర్మీడియట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి పేద, మధ్య తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని, ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికి జూనియర్ కళాశాల ప్రారంభించి సుమారుగా రెండు నెలలు కావస్తున్న నేటికీ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలను ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటని ప్రతి విద్యార్థి కేజీ టు పీజీ చదివించే బాధ్యత నాదే అని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు అధికారం లోకి వచ్చిన తర్వాత విద్యార్థులను గాలికి వదిలేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల పక్షాన నిలబడాలని ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నాణ్యమైన విద్యను అందించాలని కోరేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులపై అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం వంటిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే మరింత ఎక్కువగా విద్యార్థులు పోరాడుతామని అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో కాకినాడ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి 14 మంది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగిందని అనంతరం విడుదల చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.










