Sep 22,2023 16:50

ప్రజాశక్తి-కాకినాడ : భారత  విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన కాకినాడ కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని, ఈ కలెక్టరేట్ కార్యక్రమానికి జయప్రదం చేయాలని  కోరుతూ శుక్రవారం స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో గల పి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. వరహాలు, ఎం. గంగా సూరిబాబు  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి  రాకముందు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి నేడు ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలేశాయన్నారు.  దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకువచ్చి విద్యను మొత్తం కార్పరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయికరణ  చేస్తుందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోని అమలు చేయని నూతన జాతీయ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గమన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఇప్పటికే మూడు, నాలుగు, ఐదు తరగతులు విలీనం అవుతున్నాయని దీని ద్వారా పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేజీ టు పీజీ విద్య అందరికీ ఉచితంగా అందిస్తామని చెప్పి, నేడు అధికారులోకీ  వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగం మొత్తాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమయ్యి  మూడు నెలలు గడుస్తున్న నేటికీ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లస్ వన్, ప్లస్ టు ను మహిళా జూనియర్ కళాశాలలను  మండలానికి ఒకచోట ప్రభుత్వ హై స్కూల్లో కేటాయించడంతో గత రెండు సంవత్సరాలు నుంచి  ప్లస్ వన్, ప్లస్ టు ప్రారంభించిన నేటికీ పూర్తిస్థాయిలో భవనాలు నిర్మించడం లేదని, అధ్యాపకులను నియమించడం లేదని, ల్యాబ్, లేబరేటరీ సౌకర్యం కల్పించడం లేదని విమర్శించారు .ఇవేమీ లేకుండా మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్లో భవనాలు పూర్తిస్థాయిలో శిథిలమయ్యి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని సంక్షేమ హాస్టల్ నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8 నుంచి 14 వరకు చేసిన సైకిల్ యాత్రలో ఎస్ఎఫ్ఐ బృందం గుర్తించిన సమస్యలన్నిటిని కలెక్టరేట్ వద్ద నిర్వహించే  ధర్నాలో కలెక్టర్ కి విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు.  పరిష్కరించలేని పక్షంలో విద్యార్థులందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న చలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమానికి విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్, సిద్దు, లోవరాజు, వెంకటేష్, గోపాల్, సాయిత్, సంజయ్, చిన్ని, పవన్ తదితరులు పాల్గొన్నారు.