
ఇంటింటికీ తిరిగి ప్రజలకు వైద్య సేవలందించే ఆశా వర్కర్ నీలావతి పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో దుండగుల చేతుల్లో సామూహిక అత్యాచారానికి, ఆపై దారుణ హత్యకు గురైంది. బొబ్బిలి ప్రాంతానికి చెందిన దుర్గమ్మ భర్తతో కలిసి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌కు వలస వచ్చి కూలి పనులు చేసుకొని బతుకీడుస్తుండగా, కామాంధుడి చేతిలో రేప్‌కు, ఆపై మర్డర్‌కు గురైంది. మృగాళ్ల చేతుల్లో మహిళలు బలైన ఈ రెండు ఘోరాలూ ఒకే రోజు చోటు చేసుకోవడం, ఆలస్యంగా వెలుగు చూడటం, బాధితలిద్దరూ గిరిజనులు కావడం రాష్ట్రంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల తీవ్రతను తెలియజేస్తున్నాయి. పల్నాడులో రేప్‌కు, హత్యకు గురైన ఆశా వర్కర్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రజలకు తలలో నాలుకలా వ్యవహరించే కీలక పాత్ర ఆమెది. గర్భిణికి నొప్పులొస్తే పెద్దాస్పత్రిలో చేర్పించే కర్తవ్య నిర్వహణలో ఆమె బలైంది. ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి రావాల్సినంతగా స్పందన రాలేదు. రూ.పది లక్షల చెక్కుతో తన పని ముగిసిందన్నట్లు వ్యవహరించడం అన్యాయం. అనకాపల్లి ఉదంతంలోనైతే ఆ మాత్రం కదలిక కూడా లేదు.
రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం కొన్నేళ్లుగా స్త్రీలు, బాలికలపై నేరాల్లో ఎ.పి. మొదటి రెండు మూడు స్థానాల్లో 'సుస్థిరత' కనబరుస్తోంది. రాష్ట్ర పోలీస్ రికార్డుల మేరకు 2020లో కంటే 2021లో 25 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. ముందటేడు 14,603 కేసులు రాగా నిరుడు 17,736 కేసులు వచ్చాయి. క్రైం రేటు ఈ రేంజిలో పెరగడం గతంలో లేదు. ఈ సంవత్సరం తొలి మూడు మాసాల్లో మహిళలపై గ్యాంగ్ రేప్‌లు, హత్యలు ఒక దాని తర్వాత ఒకటి 20 సంభవించడం ఆందోళన కలిగించే విషయం. విజయవాడ జనరల్ ఆస్పత్రిలో 23 ఏళ్ల దళిత యువతి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైంది. గుంటూరు నగరంలో పట్టపగలు ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ కావించబడింది. రేపల్లె రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై గర్భిణి సామూహిక లైంగిక దాడికి బలైంది. మన్యం జిల్లాలో ఇదే సమయంలో అత్యాచారం నమోదైంది. ఇవి కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే. వెలుగులోకి రానివి, వచ్చినా కేసుల వరకు వెళ్లనివి ఇంకా చాలానే ఉన్నాయి.
మహిళలపై లైంగిక దాడులు విచ్చలవిడి కావడానికి శిక్ష పడుతుందన్న భయం దోషుల్లో కొరవడటమే. చాలా కేసులు రాజకీయ ఒత్తిళ్లు, పోలీసులు, పెద్ద మనుషుల నడుమ రాజీలు, పంచాయితీలతో ఎఫ్‌ఐఆర్‌ల దాకా రావట్లేదు. కేసులు నమోదైనా సరైన సాక్ష్యాలు, దర్యాప్తులు లేక, ఏళ్లకు ఏళ్లు కోర్టులో నలుగుతున్నాయి. దాంతో రేప్ చేసినా తమకేం కాదన్న ధీమా నేరాలకు పురిగొల్పుతోంది. ఒక ఎం.పి. నగ వీడియో బహిర్గతం అయినప్పుడు దానిపై కనీస దర్యాప్తు లేకుండా సదరు ఎం.పి.ని ప్రభుత్వం వెనకేసుకొచ్చే పరిస్థితి ఉంటే మహిళలపై దారుణాలు ఆగుతాయా? మహిళలపై నేరాల అంతానికి, వారి రక్షణకు 2019 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 'దిశ' బిల్లును కేంద్రం తిప్పి పంపింది. 2020లో మరో బిల్లు తీసుకురాగా కేంద్రం నుండి ఇంకా క్లియరెన్స్ రాలేదు. అయినా 'దిశ' పేరిట యాప్‌లు, పోలీస్‌స్టేషన్ల హడావిడిని సర్కారు ప్రబలంగా సాగిస్తోంది మినహా కేంద్రంతో మాట్లాడింది లేదు. 2007 ఆగస్టులో విశాఖ ఏజెన్సీ వాకపల్లిలో 11 మంది గిరిజన స్త్రీలను పోలీసులు దారుణంగా రేప్ చేశారు. పదిహేనేళ్లయినా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక కూడా ఆ కేసు విచారణ ఒక పట్టాన తేలట్లేదు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం ఏమైందో అంతుబట్టదు. ఢిల్లీలో మెడికోపై గ్యాంగ్ రేప్ తర్వాత 'నిర్భయ' చట్టం వచ్చింది. అయినా మహిళలపై దాడులు ఆగింది లేదు. చట్టాలతోనే మహిళలపై నేరాలు ఆగవని అనుభవంతో బోధ పడుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. నయా-ఉదారవాద యుగంలో మద్యం, అశ్లీల వీడియోలు, సాహిత్యం విశృంఖలంగా బజారులో, నెట్టింటిలో లభిస్తున్నాయి. వీటిని కట్టడి చేయడంతోపాటు వ్యవస్థ పని తీరులో, మైండ్‌సెట్‌లో మార్పు రావాలి.