Jul 05,2023 20:30
  • వరద ప్రాంతాల్లో పర్యటిస్తును వర్కింగ్‌ గ్రూపు

బీజింగ్‌ : చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తుండగా, మరికొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా వంఝూ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలకు 15మంది మరణించగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో చైనా వరదల నిరోధక సంస్థకి చెందిన వర్కింగ్‌ గ్రూపు బుధవారం ఉదయం దక్షిణ చైనాలో వరదలతో సతమతమవుతున్న చాంగ్‌కింగ్‌ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ పరిస్థితులను సమీక్షిస్తోంది. మంగళవారం మధ్యాహుమే అత్యవసర ప్రతిస్పందనా చర్యలు తీసుకున్న తర్వాత చాంగ్‌కింగ్‌ అధికారులతో ప్రభుత్వం అత్యవసర సమావేశం జరిపింది. అనంతరం వర్కింగ్‌ గ్రూపును అక్కడకు పంపించారు. వరదలు ఇతర విపత్తులకు కారణమవకుండా నివారించడానికి, సహాయ చర్యలు చేపట్టడానికి, వరద నీటిలో చిక్కుకుపోయిన వారికి అవసరమైన ప్రాధమిక సహాయం అందించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరింది. రాబోయే 24గంటలు చుట్టుపక్కల జిల్లాల్లోని వర్షపాతం తీరు తెనుులను నిశితంగా పర్యవేక్షించాల్సిందిగా కోరింది. సోమవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాంఝూ జిల్లాలో 24 పట్టణాలు, ఉప జిల్లాలు దెబ్బతిన్నాయి. 2500మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 37వేల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకోగా, వారిలో 11వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. దాదాపు 2వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 570హెక్టార్ల మేరా పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. 3కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లింది.