Jul 02,2023 16:09
  • బీసీలకు  రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలి
  •  జిల్లా శెట్టిబలిజ సంఘం డిమాండ్    

 ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : కాకినాడ జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గీయులు అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నారని అందువల్ల తమ హక్కులను, సీట్లను సాధించుకోవడమే కాక ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను ఆయా రాజకీయ పార్టీలు కేటాయించాలని శెట్టిబలిజ సామాజిక వర్గీయ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలోని రామారావు పేటలో ఉన్న కేంద్ర శెట్టిబలిజ కళ్యాణ మండపంలో జిల్లా శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో శెట్టిబలిజ కలయికను నిర్వహించారు. అనంతరం సభను జిల్లా శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షత వహించగా సీనియర్ రాజకీయవేత్త నురుకుర్తి వెంకటేశ్వరరావు నేతృత్వంలో సభను నిర్వహించారు.
  ఈ సందర్భంగా శెట్టిబలిజ సంఘ నాయకులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గీయులు చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా ఐక్యత లోపించిందని అందువల్ల ఐక్యంగా ఉండాలని, కాకినాడ జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లను ఆయా రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే తమ ఓట్లును మనమే వేసుకోవాలని అలా వేసుకుంటే పాలకులవుతామని లేని పక్షంలో ఆయా పార్టీలకు బానిసలుగా ఉంటామని సూచించారు. త్వరలోనే తమ సామాజిక వర్గీయులతో జేఏసీ ఏర్పడి వీరంతా జాతిని ఐక్యం చేసి జాగృతి చేస్తారన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 24కి తగ్గించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు రాజకీయ తీర్మానాలు చేశారు. ఆయా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఇతర బీసీ కులాలతో కలిపి ముందుకు వెళ్లాలని సూచించారు. అంతకుముందు శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డికి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు.
   ఈ కార్యక్రమంలో సామాజిక వర్గ నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, రాయుడు నాగేశ్వరరావు, వాసంశెట్టి రాజేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, గీసాల శ్రీనివాసరావు, నురుకుర్తి కిట్టు, అనుసూరి ప్రభాకర్ రావు, పితాని శ్రీనివాసరావు, పెంకే వెంకటలక్ష్మి, కముజు శ్రీనివాసరావు, పితాని అన్నవరం, అనుసూరి చిన్నబాబు, పంపన మురళి, గుత్తుల బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.