Sep 17,2023 16:12
  • శెట్టిబలిజలకు అండగా జగన్ ప్రభుత్వం
  • మంత్రి వేణు, ఎమ్మెల్యే ద్వారంపూడిలకు ఘన సన్మానం

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందువల్ల రానున్న 2024 ఎన్నికలలో తిరిగి వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను, మంత్రులను చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. తామిద్దరిని వేరువేరుగా చూడవద్దని శెట్టిబలిజ సామాజిక వర్గీయులను వారు కోరారు. ఆదివారం పోక్సో కోర్ట్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పితాని శ్రీనివాసరావుకు కాకినాడ సూర్యకళ మందిరంలో కాకినాడ సిటీ శెట్టిబలిజ కుటుంబాల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సంఘీయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
   ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ తాను ఇదే సామాజిక వర్గము నుండి రాజకీయ రంగంలో అడుగు పెట్టానని తనను తన సామాజిక వర్గాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో పాటు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారని ఈ ఎంపికలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రధాన పాత్రను పోషించారన్నారు. నాటి నుంచి ద్వారంపూడితో తమ స్నేహం కొనసాగుతుందని వేణు చెప్పారు. బీసీలు జడ్జిలుగా పనికిరాని చెప్పిన మాటల నుంచి బీసీలు వెన్నుముకగా ఉన్నారనే స్థాయికి నేడు సీఎం జగన్ తీసుకు వచ్చారన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గీయులు బలపరిచిన పార్టీలే విజయం సాధించడంలో ప్రధాన పాత్రను వహించనున్నట్లు చెప్పారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏ కులం లేనివాడినని అందరూ తన వాడిగా చూసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శెట్టిబలిజలు డబ్బులు ఆశించరని గౌరవాన్ని మాత్రమే కోరుకుంటారని చెప్పారు. పితాని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో తన ఒంటిపై నల్లకోటు వేసుకుని తిరగడాన్ని గ్రహించానని అందుకే ఆయనకి సముచిత స్థానం కల్పించాలని ఆనాడే నిర్ణయించుకున్నానన్నారు. అనుకోకుండా పితానికి ఫోక్సో కోర్ట్ స్పెషల్ పీపీగా అవకాశం వచ్చిందని దీనికి మంత్రి వేణు అంగీకరించారని ద్వారంపూడి చెప్పారు. జనసేన- టిడిపి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రాజకీయంగా శెట్టిబలిజ సామాజిక వర్గీయులే నష్టపోయే అవకాశం ఉందని ద్వారంపూడి చెప్పారు. అనంతరం పితాని శ్రీనివాస్ మాట్లాడుతూ తాను పోక్సో కోర్టు స్పెషల్ పీపీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుందని అందువల్ల ఈ కార్యక్రమాన్ని సిటీకి చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గీయులు నిర్వహించారన్నారు. అనంతరం పితాని ఆధ్వర్యంలో మంత్రి వేణు, ఎమ్మెల్యే ద్వారంపూడిలకు ఘనంగా సత్కారం చేశారు. అలాగే కాకినాడ జిల్లాల్లో వైకాపా ప్రభుత్వంలో బీసీలకు స్థానం లేదని అందువల్ల రెండు అసెంబ్లీ సీట్లను శెట్టిబలిజ సామాజిక వర్గీయులకు కేటాయించాలని సూచించారు. 
  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, శెట్టిబలిజ సామాజిక వర్గ నేతలు వాసంశెట్టి రాజేశ్వరరావు, మర్రిపూడి రమణ, వాసంశెట్టి సత్య, కుందూరు అప్పలనాయుడు, గీసాల భాస్కర్, పితాని సోమన్న, రాయుడు మురళి, బొందల నూకరాజు, కర్రి బాబ్జీ, వాసంశెట్టి భీమరాజు, ఎల్లబోయిన చిన్న, నురుకుర్తి సూర్యప్రకాష్, దొడ్డి వీరేంద్ర, వనుం సుబ్బారావు, బొక్క బుజ్జి, పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.