Oct 29,2023 09:57

సీతాఫలం మధురఫలం. ఇది పోషకగని. సీతాఫలంలో సి విటమిన్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం సమద్ధిగా లభిస్తాయి. ఎముకపుష్టికి తోడ్పడుతుంది. నోటిలో జీర్ణరసాలను పెంచి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బలవర్థకమే కాదు.. మలబద్ధకంతో బాధపడేవారికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఎదిగే పిల్లలకు రోజూ ఒక పండు తినిపిస్తే మంచిది. పండు గుజ్జును పాలలో కలిపి.. పిల్లలకు తాగించవచ్చు. సత్వర శక్తి లభిస్తుంది. ఇన్ని ఫలితాలున్న ఫలాన్ని పండుగానే కాక ఇతర రుచుల్లోనూ తీసుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.


గమనిక: సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు. భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.

  • హల్వా

కావలసినవి : సీతాఫలం గుజ్జు - కప్పు , నెయ్యి - 120 గ్రా, బొంబాయి రవ్వ - 120 గ్రా, పంచదార- 40 గ్రా, పాలు - గ్లాసు, జాజికాయ పొడి - 1/2 స్పూను, జీడిపప్పు -10, బాదం - 15, కిస్‌మిస్‌ -15
తయారీ : ముందుగా బాగా పండిన సీతాఫలం గుజ్జు తీసి, పక్కనుంచుకోవాలి. బాండీలో నెయ్యి వేడి చేసి డ్రైఫ్రూట్స్‌ (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌, ఇంకేమైనా..) ను వేయించి, గిన్నెలోకి తీసుకోవాలి. ఆ నేతిలోనే బొంబాయి రవ్వను దోరగా వేయించి, దానిలో పంచదార వేసి నిమిషం కలపాలి. కొంచెం ముద్దగా రాగానే, పాలు పోసి తిప్పుతూ ఉడికించాలి. మూడు నిమిషాలు ఉడికిన తర్వాత సీతాఫలం గుజ్జు, జాజికాయ పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్‌ వేసి, బాగా కలపాలి. మరో మూడు నిమిషాలు అలా తిప్పుతూ ఉడికించిన తర్వాత స్టౌ మీద నుంచి దింపి, సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే సీతాఫలంతో తియ్యనైన హల్వా రెడీ.

  • కలాకండ్ 

కావలసినవి : సీతాఫలం గుజ్జు - కప్పు, పాలు- 2 లీటర్లు, నిమ్మరసం- 3 స్పూన్లు, చక్కెర-1/4 కప్పు, యాలకుల పొడి- స్పూను, జాజికాయ పొడి- చిటికెడు, పాలపొడి-1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు -2 స్పూన్లు
తయారీ : మందపాటి గిన్నెలో లీటరు పాలను మరిగించాలి. పాలు మరిగేటప్పుడు మంటను ఆపి, పాలను నిమిషం పాటు తిప్పాలి. కాస్త వేడి తగ్గిన పాలలో నిమ్మరసం వేసి తిప్పితే విరిగిపోతాయి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రంలో వేసి, వడకట్టాలి. ఈ పదార్థాన్ని దానిలోనే ఉంచి, స్పూనుతో తిప్పుతూ మంచినీటితో కడిగినట్లు కదపాలి. దానిని మూటలా కట్టి, పూర్తిగా నీరు పోయేలా బరువు ఉంచాలి.
మరో గిన్నెలో మిగిలిన లీటరు పాలను స్టౌ సిమ్‌లో పెట్టి, పావు లీటరు అయ్యేంత వరకూ మరిగించాలి. దానిలో పంచదార, పాల విరుగు, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి, కలపాలి. దీనిని తిప్పుతూ రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత సీతాఫలం గుజ్జును వేసి, నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత పాలపొడి కలపి మరో నిమిషం తిప్పుతూ ఉడికించాలి. తయారైన కలాకండ్‌ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పోసి అన్నివైపులా సర్దాలి. పైన డ్రైఫ్రూట్స్‌ పలుకులు చల్లుకోవాలి. నోరూరించే సీతాఫలం కలాకండ్‌ రెడీ.

  • ఛీజ్‌కేక్‌..

కావలసినవి : గోధుమపిండి బిస్కెట్లు - 6, వెన్న-450 గ్రా, సీతాఫలం గుజ్జు - కప్పు, పంచదార -100 గ్రా, నిమ్మరసం- 2 స్పూన్లు, క్రీమ్‌-750 గ్రా, గుడ్లు- 6, సోర్‌ క్రీం- 200 గ్రా
తయారీ : ముందుగా కుక్కర్‌ అడుగున అంగుళం మందంలో ఇసుక పోసి విజిల్‌, గాస్‌కట్‌ పెట్టకుండా సిమ్‌లో వేడి చేయాలి. బిస్కెట్లను పొడి చేసి కరిగించిన వెన్నతో కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో సమంగా సర్దాలి. నెయ్యి వేడి తగ్గిన తర్వాత గట్టిగా పేరుకుంటుంది. ఇంకా పలుచగా అనిపిస్తే, ఓ పావుగంట డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి.
మరో వెన్న రాసిన గిన్నెలో సీతాఫలం గుజ్జు, పంచదార, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో క్రీమ్‌, గుడ్ల సొన, సోర్‌ క్రీం చేర్చి బాగా కలపాలి. దీనిని ముందుగా రెడీగా ఉంచుకున్న బిస్కెట్‌ మిశ్రమం మీద పోయాలి. దీనిని 50 నిమిషాలు వేడి చేసిన ఇసుక మీదపెట్టి ఉడికించాలి. కేక్‌ మధ్యలో కొద్దిగా ఉబ్బినట్లు వచ్చినప్పుడు చాకును గుచ్చి, చూడాలి. చాకుకు ఏమీ అంటకపోతే కేక్‌ రెడీ అయినట్లే.