Nov 12,2023 14:26

'ఒక్క నిమిషం ఆగు! లోపల ఎర్రగానే ఉందా ?!' అడిగింది కుందేలు.
'ఇవి ఎలుగుబంటి తోటలోనివి. కోసి చూపించటం కుదరదు. నీకు నమ్మకం ఉంటే కొనుక్కో! ఎర్రగుందో, తియ్యగుందో బయటకు ఎలా తెలుస్తుంది?' అంది కోతి.
ఎలుగుబంటి తాటి కాయల గిర్రలబండే అది. బండి మీద గడ్డివేసి, తియ్యటి పుచ్చపండ్లు పేర్చి బండిని తాడుతో లాక్కోస్తూ, అడవంతా అమ్మేది కోతి. ఎలుగుబంటి పుచ్చపండ్ల తోటలో అన్నీ ఎర్రటివీ, తియ్యటివే! తెల్లటివీ, చప్పటివీ ఉండవు. అది పంటకు వాడే విత్తనం అలాంటిది. పుచ్చపండ్ల తోట పెద్దమొత్తంలో సాగు చేయటంతో తోట పనులు ఎలుగుబంటి చూసుకుంటూ, గత మాసం నుండి అమ్మేటందుకు కోతిని సహాయంగా పెట్టుకుంది. కోతి బండిని అడవంతా తిప్పి, పక్షులకు, జంతువులకు పుచ్చపండ్లు అమ్ముతుండేది.
కోతి దగ్గర ఒక పండు కొనుక్కొని తన పిల్లలను పిలిచి, ఆత్రంగా పుచ్చపండు కోసింది కుందేలు. 'అయ్యో ! పండు ఎర్రగలేదు! చప్పగుంది!' ముక్క కొరుకుతూ అంది కుందేలు. తియ్యటి పండు తినలేక బాధ పడుతూ అవి చప్పటి కాయతో సరిపెట్టుకున్నాయి. ఇలా ఉడుత, చిలుక, జింక, గుర్రం, ఒంటె కూడా పుచ్చపండ్లు కొనుక్కుని, మోసపోయాయి.
ఎలుగుబంటి గత సంవత్సరం నుండి పుచ్చపండ్ల తోట సాగు చేస్తోంది. తానే దగ్గరుండి పాదులు చేయటం, కలుపు తీసి, నీరు పెట్టడం స్వయంగా చేసేది. పుచ్చ పండ్లు ఎంతో ఎర్రగా, తియ్యగా ఉండేవి. పుచ్చ తోటకు విత్తనాలు పక్క అడవిలో పుచ్చతోట పండించే తన చిన్ననాటి మిత్రుడు ఏనుగు దగ్గర కోరి మరీ తెచ్చుకుంది. ఈ రకం పండ్లు పక్క అడవిలో ఏనుగు దగ్గర, ఈ అడవిలో ఎలుగుబంటి దగ్గర మాత్రమే దొరుకుతాయి.
కానీ, ఇప్పుడు పండ్ల నాణ్యత పడి పోయింది. ఎలుగుబంటిని కలిసి అదే విషయం చెప్పాయి జంతువులు. 'మీకు నా బదులు కోతి అమ్మటం చేత అలా అనిపిస్తుంది. అప్పుడూ, ఇప్పుడూ అవే పండ్లు' అంది ఎలుగుబంటి.
కొద్దిరోజులకు ఎలుగుబంటి పుచ్చపండ్లపై నమ్మకం లేక కొనటం తగ్గించాయి. ఒకరోజు మృగరాజు సింహం చుట్టాలచ్చారని మరునాటికి పది పుచ్చపండ్లు పంపమని ఎలుగుబంటికి కబురు పంపింది. ఎలుగుబంటి తాను పండిస్తున్న పండ్లపై తనకే నమ్మకం పోయింది. మృగరాజుకు చప్పటి పండ్లు పంపితే చంపేస్తాడని భయపడింది. వెంటనే పక్క అడవిలో ఉండే తన మిత్రుడు ఏనుగుకు కబురు పెట్టి, పది పండ్లు తనకు పంపమని కోరింది. విషయం తెలిసి ఆశ్చర్య పోయింది ఏనుగు. వెంటనే ఎలుగుబంటిని చేరుకుంది.
'మిత్రమా ! పదేండ్లుగా పుచ్చతోట సాగు చేస్తున్నాను. విత్తనంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. లోపం ఎక్కడ ఉందో అర్థం కావటంలేదు!' అంటూ దీర్ఘంగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చింది ఏనుగు.
కొద్దిసేపటికి 'మిత్రమా ! రేపు నీవు మృగరాజుకు పంపే పండ్లన్నీ ఎర్రటివి, తియ్యటివే అవుతాయి. ధైర్యంగా ఉండు!' అంది ఏనుగు.
మరునాడు ఉదయాన్నే చక్రాల బండిమీద పండ్లు వేసుకుని సింహం గుహకు బయలుదేరింది కోతి. కొద్దిసేపటికి పుచ్చపండ్లన్నీ తాజాగా, ఎర్రగా, తియ్యగా ఉన్నాయని సంతోషపడి, మంత్రి నక్కతో విలువైన కానుకలిచ్చి ఎలుగుబంటికి పంపాడు మృగరాజు. ఎలుగుబంటి ఆశ్చర్యపోయింది. కోతి రాక కోసం అటూ ఇటూ చూసింది.'మిత్రమా! ఇక కోతి ఈ అడవికి రాదు. అడవి వదిలి గ్రామానికి పారిపోయింది' అంది ఏనుగు.
'నీ దగ్గర నాణ్యమైన పుచ్చపండ్లు తీసుకుని, దారిలో ఉన్న తన ఇంట్లో ఉన్న వేరే రకం పుచ్చపండ్లను వాటి స్థానంలో పెట్టి, వీటిని అధిక ధరకు రహస్యంగా అమ్ముతుంది కోతి. నా విత్తనం మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నాకు కోతి మీద అనుమానం వచ్చింది. దానికి తెలీకుండా వెనుకనే వెళ్ళాను. నేను ఊహించిందే జరిగింది' అంది ఏనుగు.
మరుసటిరోజు తన అడవిలో ఉండే తెలిసిన చిన్న ఏనుగును ఎలుగుబంటికి సహాయంగా నియమించింది. కొద్దిరోజులకే ఎలుగుబంటి పుచ్చపండ్ల వ్యాపారం తిరిగి ఊపందుకుంది.
పైడిమర్రి రామకృష్ణ
92475 64699