Jul 10,2023 22:15
  • నేడు విచారణ..!

న్యూఢిల్లీ : అదాని గ్రూపు కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయనే హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో ఇన్వెస్టర్లు లక్షలాది కోట్లు సొమ్ము నష్టపోయారు. దీనిపై విచారణ జరపాలని.. మదుపర్ల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సెబీ తాజాగా 41 పేజీలతో కూడిన నివేదికను సోమవారం సుప్రీంకోర్టుకు అందజేసింది. 2019లో పారదర్శకత నిర్మాణ నిబంధనలను రద్దు చేయడం వల్ల అదాని గ్రూపు కంపెనీల్లో ఆర్థిక ఆసక్తులు కలిగిన వారిని గుర్తించడంలో సవాళ్లు నెలకొన్నాయని సెబీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. అదే విధంగా 2019 నిబంధనల మార్పును సమర్థించింది. ''2014-2019 మధ్య కాలంలో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పిఐ)లపై పరిమితులు తగ్గించబడ్డాయి. ప్రయోజనకరమైన యజమానులను నిర్ణయించడానికి ప్రాథమికంగా సమస్య తలెత్తింది. ఏదైనా ఆర్థిక ఆసక్తిని కలిగి ఉన్న ప్రతీ చివరి వ్యక్తి వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.'' అని సెబీ అఫిడవిట్‌లో తెలిపింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనలకు సంబంధించి ఎఫ్‌పిఐ సంస్థలు ఆర్థిక ఆసక్తి ఉన్న సంస్థలు అధికార ఎజెన్సీల పరిధిలో ఉన్నాయని గమనించినట్లు రెగ్యులేటర్‌ తెలిపింది. కానీ స్పష్టమైన నియంత్రణ లేదని సెబీ పేర్కొంది. దీనిపై జులై 11న (నేడు) సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.