
- సుప్రీంను కోరిన అదానీ మాజీ కాంట్రాక్టర్
- నగదు బదిలీ వ్యవహారాలు తనకు తెలుసునని నివేదన
ముంబయి : హిండెన్‌బర్గ్-అదానీ వివాదం మరో మలుపు తిరిగింది. సెబీ-అదానీ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు తనను అనుమతిం చాలంటూ అదానీ వద్ద గతంలో కాంట్రాక్టర్‌గా పనిచేసిన అజరు కుమార్ అగర్వాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అదానీకి చెందిన సర్గుజా రైల్ కారిడార్ ప్రాజెక్టుకు ఈబీపీఎల్ వెంచర్స్ సంస్థ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌గా వ్యవహరించింది. ఆ సంస్థలో అగర్వాల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అదానీ గ్రూపులోని కంపెనీల పనితీరును తాను నిశితంగా పరిశీలించానని, కాబట్టి పెట్టుబడి దారుల విశాల ప్రయోజనాలను కాపాడే నిమిత్తం సుప్రీంకోర్టుకు సాయపడేందుకు అనుమతించాల ని ఆయన తన పిటిషన్‌లో కోరారు. తాను చేసిన పనికి సొమ్ము చెల్లించడం కోసం ఒక అనుబంధ కంపెనీ నుండి మరో అనుబంధ కంపెనీకి డబ్బును బదిలీ చేశారని అందులో వివరించారు. అగర్వాల్ పిటిషన్‌లోని వివరాల ప్రకారం.... సర్గుజా రైల్ కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అదానీ గ్రూపు సర్గుజా రైల్ కారిడార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఆర్‌సీపీఎల్) పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసింది. చండ ఘీర్‌లో ప్రాజెక్టును చేపట్టేందుకు ఎస్‌ఆర్‌సీపీఎల్‌కు ఈపీసీ కాంట్రాక్ట్ లభించింది. ఆ పనులను తర్వాత ఈబీపీఎల్ వెంచర్స్‌కు సబ్-కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ సంస్థే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసింది. ఎస్‌ఆర్‌సీపీఎల్ తరఫున పనిచేసిన సమయంలో అగర్వాల్ ఆ సంస్థ పని సంస్కృతిని నిశితంగా పరిశీలించారు. 2022లో ఎస్‌ఆర్‌సీపీఎల్‌ను అదానీ పోర్ట్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ సంస్థలో ఎస్‌ఆర్‌సీపీఎల్ రూ. 450 కోట్లు కానీ లేదా ఓడరేవు నిర్వాహకుడి ఏకీకృత నిర్వహణ లాభంలో ఐదు శాతం కానీ జమ చేస్తుందని అదానీ పోర్ట్ తెలిపింది. ఇదిలావుండగా అదానీ గ్రూప్ కంపెనీలు నిధులను దారిమళ్లించే అవకాశం ఉన్నదని, వాటాల విలువ ను తారుమారు చేసే ప్రమాదం ఉన్నదని 2014లో చేసిన హెచ్చరిక ను సెబీ గోప్యంగా ఉంచిందని ఈ నెల 8న సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అనామికా జైస్వాల్ తెలియజేశారు. అవకతవకల కు పాల్పడడం ద్వారా సంపాదించిన సొమ్మును దుబారు, మారిషస్‌లలోని సంస్థల ద్వారా అదానీ తన లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెట్టారని, ఆ విషయాన్ని కూడా సెబీ దాచిపెట్టింద ని జైస్వాల్ వివరించారు. అదానీ గ్రూపులో అవకతవకలు జరిగాయని, వాటాల విలువను ఎక్కువ చేసి చూపారని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ చేసిన ఆరోపణల పై విచారణ జరపాల్సిందిగా జనవరిలో సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాను జరిపిన విచారణ పూర్తయిందంటూ ఆగస్ట్ 25న సుప్రీంకోర్టుకు సెబీ నివేదిక సమర్పించింది.