Sep 01,2023 10:47

ముంబయి :  అడ్డగోలుగా తమ ఆస్తుల విలువను పెంచేందుకు సెబీ నిబంధనలకు అదానీ పాతరేశారు. ఏదైనా ఒక కంపెనీ తన సొంత షేర్లను 75 శాతం మాత్రమే కలిగివుండాలని, మిగతా 25 శాతం ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది సెబి నిబంధన. అదానీ ఈ నిబంధనను తుంగలో తొక్కి కేవలం పది శాతం షేర్లను మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలా చేయడం ద్వారా షేర్ల ధరలను తేలికగా తారుమారు చేయొచ్చు. అదాని ఈ పని చేయడం ద్వారా భారత సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. అహ్లి, చాంగ్‌లు అదాని గ్రూపు కోసం పనిచేశారన్న ఆరోపణే గనుక రుజువైతే అది సెబీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. అదాని ఫ్లాగ్‌షిప్‌ కంపెనీలైన అదాని ఎంటర్‌ప్రైజెస్‌, అదాని పవర్‌, అదాని ట్రాన్స్‌మిషన్‌ అనే మూడు కంపెనీల్లో అమెరికాకు చెందిన అహ్లికి 12 శాతం, తైవాన్‌కు చెందిన చాంగ్‌ లింగ్‌కు 14.4శాతం షేర్లు ఉన్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. అంటే ఈ కంపెనీల షేర్లలో పది శాతం మాత్రమే బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్న మాట. ఇద్దరు విదేశీ వ్యక్తులకు వాటాలను ఎలా కట్టబెట్టారనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఇంతకుముందు హిండెన్‌బర్గ్‌ చేసిన సంచలనాత్మక ఆరోపణలపై విచారణ నిర్వహించి అదానీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన పెద్ద మనిషి ఇప్పుడు అదానీ కంపెనీ టివి చానెల్‌ ఎన్డీటివిలో డైరక్టర్‌గా ఉన్నారు.దీనిని బట్టే ఆ విచారణ ఎంత బూటకమో అర్థమవుతూనే ఉంది.