
సెప్టెంబర్ 28వ తేదీన అంతర్జాతీయ శాస్త్రీయ సంస్కృతి దినోత్సవం జరుపుకుం టున్నార. ముఖ్యంగా ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలనే భావనతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
నేడు మనం ఆస్వాదిస్తున్న సౌకర్యాలు, పనిముట్లు, జీవితావసరాలు, మందులు...అన్నీ సైన్స్ ఫలాలే. మానవుడు భూమి మీద జీవనం ప్రారంభించిన నాటి నుంచి, నేటి వరకూ తన ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేసి, ఈరోజు అంతరిక్షాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొనే స్థాయికి చేరుకున్నాడంటే శాస్త్రీయ ఆలోచన, దృక్పథం కారణం. తన జీవితంలో సైన్స్ ఒక భాగమని భావించాడు. ఆచరించాడు. అందుచేతనే ఈ భూమి మీద ఎన్ని అవాంతరాలు, అనారోగ్యాలు, విపత్తులు సంభవించినా, తన శాస్త్రీయ ఆలోచనలతో ఎదుర్కొని నిలబడి, నవ నాగరికతకు చిరునామాగా నిలిచాడు. తాజాగా ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ''కరోనా'' మహమ్మారికి అతి తక్కువ సమయంలో నియంత్రణ చేయగలిగాడంటే అది సైన్స్ ఫలితమే. పౌర జీవనంలో శాస్త్రీయ సంస్కృతి మమేకం కావడం వల్లనే ఇటువంటి అద్భుతాలు సృష్టిస్తూ, ఈ విశాల ప్రపంచంలో నిలబడగలుగుతున్నాం.
మన దేశానికి స్వాతంత్య్రం సాధించే సమయంలోనే, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకులు దేశం, ప్రజలు శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని, తద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. 1946లో జైల్లో ఉండగా తాను రాసిన ''ది డిస్కవరీ ఆఫ్ ఇండియా'' గ్రంథం ద్వారా ప్రజలందరికీ శాస్త్రీయ అవగాహన ఉండాలని తెలిపారు. ఆనాడు దేశంలో తిష్ట వేసిన మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు పేదరికానికి పరిష్కారం సైన్స్ అనే భావన కలిగించాడు. అదే భావన ప్రతీ భారతీయ పౌరులలో భాగం కావాలని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 51ఎ (హెచ్)లో పొందుపరిచారు. ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగంలో లేని విధంగా మన భారత దేశంలో ప్రతీ పౌరుడు శాస్త్రీయ సంస్కృతి కలిగి ఉండాలని, తన అవసరాలను తీర్చుకునేందుకు, సమస్యల పరిష్కారానికి శాస్త్రీయంగా ఆలోచన చేసి అభివృద్ధి సాధించాలని దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో ప్రజలు...ప్రతీ ఒక్కరూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు ఇలా అందరూ... శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు సాగాలని తెలిపారు. కానీ నేటి పాలకులు, మూఢ నమ్మకాలు, మూఢ మత భావనలు పాటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కరోనా కాలంలో గంగలో మునగండి, గోమూత్రం తాగండి, పళ్ళాలు వాయించండి, దీపాలు వెలిగించండి, పూలు జల్లండి అని చెబుతూ కొన్ని లక్షల మందికి సరైన వైద్యం సకాలంలో అందివ్వకుండా, కొన్ని లక్షల మంది మరణాలకు కారణం అయ్యారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకూ మూఢ నమ్మకాలు, విశ్వాసాలు పెంపొందించే జ్యోతిష్యం, వాస్తు, మూఢ మత భావనలు పెంపొందించే సిలబస్ (కరికులం) ప్రవేశపెడుతూ దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న మంకీ పాక్స్, ఖోస్తా 2 వంటి అనేక మహమ్మారులను తరిమికొట్టడానికి, ఇంధన కొరతలను అధిగమించడానికి, వాతావరణ మార్పులను జయుంచడానికి, ఆహార ధాన్యాల కొరత నివారించడానికి, సైన్స్ ఆధారంగా శాస్త్రీయ ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేయాలి. టెక్నాలజీ, మెడిసిన్, వ్యవసాయం, ఇంజనీరింగ్, విద్య, అంతరిక్ష పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి విషయాలకు ప్రజలు, ప్రభుత్వాలు, సంస్థలు, మీడియా అత్యధిక ప్రాధాన్యత, ప్రోత్సాహం అందివ్వాలి. ప్రపంచంలో అనేక దేశాలు అనేక రంగాల్లో ముందంజలో ఉండగా...మనం ఇంకా ఏ మసీదులు కింద ఏ గుళ్ళు ఉన్నాయి? వర్షాలు పడాలంటే నగంగా ఊరేగింపులు జరుపుదాం! వంటి ఆలోచనలతో ఉండటం ఆక్షేపణీయం. దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు.
అదే విధంగా విద్వేష ప్రసంగాలు, మత ప్రాంతీయ భాషా ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలి. ''టెస్ట్ అండ్ ట్రయల్'' చేయకుండా ఏ సైన్స్ పరిశోధనను నిరాకరించరాదు. శాస్త్ర పరిశోధనలు ఫలించాలంటే పాలకులతో పాటు ప్రజలందరూ శాస్త్రీయ సంస్కృతిని కలిగి వుండాలి. మనదేశం నుంచి ''పోలియో'' వ్యాధిని పూర్తిగా నిర్మూలించాం అంటే ప్రజలందరూ శాస్త్రీయ సంస్కృతి కలిగి ఆమోదించడం వల్లే కదా సాధ్యం అయింది. రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, ఇటీవల బండ్ల శిరీష అంతరిక్షంలో పయనించగలిగారు. కావున వాస్తవికతను అర్థం చేసుకోవాలి. మన అవసరాలు తీర్చకోవడానికి, సమస్యల పరిష్కారానికి సైన్స్ ఒక సాధనం అని అందరూ గ్రహించాలి. సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే, ప్రజలందరూ శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలి. పౌర సంస్కృతిలో సైన్స్‌ను ఒక భాగం చేయడమే ఈ అంతర్జాతీయ శాస్త్రీయ సంస్కృతి దినోత్సవం ముఖ్య ఉద్దేశం. అందుకే దేశాభివృద్ధి ప్రజల శాస్త్రీయ, సాంకేతికత వినియోగంపై ఆధారపడి ఉంటుంది అని భారతదేశ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభారు ఆనాడే తెలిపారు. ఇకనైనా మనం శాస్త్రీయ ఆలోచనలతో ముందుకు సాగుదాం. ఈ 21వ శతాబ్దంలో భారతదేశాన్ని అన్నింటా ముందు వరుసలో నిలబడేలా కృషి చేద్దాం.
- ఐ. ప్రసాదరావు,
సెల్ : 6305682733