Oct 29,2023 07:25
  • ఈ రోజుల్లో ఎవరినైనా పొదుపు చేస్తున్నావా? అని అడిగితే 'స్కూలు ఫీజులు, ఇంటి అద్దె, పెరిగిన ఇంటి ఖర్చులు, హాస్పటల్‌ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.. అప్పులు తీర్చుకోవడమే సరిపోతుంది. ఎలా చేయాలి పొదుపు?' అంటున్నారు. ఈ నేపథ్యంలో జనంలో పొదుపు ప్రాధాన్యత, అవసరం అవగాహన చాలా ముఖ్యమంటున్నారు ఆర్థిక నిపుణులు. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పొదుపు చేయడం చాలా కష్టమే. అయినా భవిష్యత్తు కోసం ఎంతో కొంతైనా డబ్బు దాచుకోవాలని సూచిస్తున్నారు. నిజానికి పొదుపు చేయడం అంటే ..అది ఆర్థికపరమైన అంశంగానే చూస్తాం. పొదుపు అనేది అన్ని విషయాలకూ వర్తిస్తుంది. విద్యుత్‌, నీటిని, ఆహారాన్ని... ఇలా ఎన్నో అనవసరంగా వృథా చేయకుండా అవసరమైనంతే వాడుకోవడమూ పొదుపే.. ఇలాంటి పొదుపు వల్లా ఖర్చు తగ్గుతుంది.. దాంతో ఆ మేరకు డబ్బు ఆదా అవుతుంది. ఈ ఉద్దేశంతో 'ఈ నెల 30న ప్రపంచ పొదుపు దినోత్సవం' జరుపుకోవడం ప్రారంభించాయి ప్రపంచ దేశాలు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

కుటుంబంలో భార్యాభర్తా ఇద్దరూ కష్టపడితేగానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లని గడ్డు పరిస్థితులను చూస్తున్నాం. నిత్యావసర సరకులు రోజురోజూకి ఆకాశాన్ని తాకేలా పెరిగిపోతున్నాయి. కరెంట్‌ వాడుకోకపోయినా బిల్లు మాత్రం పేలిపోతుంది. మార్కెట్‌కి వెళితే సంచి నిండక ముందే జేబులో డబ్బులు అయిపోతాయి. ఈ క్రమంలో పొదుపు అనే మాటకు తావులేకుండా పోతుంది. అయినా జాగ్రత్తగా.. అనవసరమైన ఖర్చు ఎక్కడవుతుంది? ఏ విషయంలో పొదుపు చేస్తే ఖర్చు తగ్గించవచ్చు? అని పరిశీలన చేస్తే మాత్రం పొదుపు చేయడం ఎక్కడో ఒకచోట సాధ్యపడుతుంది. ఇటువంటి ఆలోచనా ధోరణి కుటుంబంలో భార్యభర్తలిద్దరికీ ఉండాలి. అప్పుడే వృద్ధాప్యంలోనూ ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవు. దాన్ని పిల్లలకూ అర్థమయ్యే విధంగా చెప్పాలి. వారికీ పొదుపు చేయడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి.

  • ఆడంబరాలు ఆపాలి..

పదిగానీ, వందగానీ ఖర్చు పెట్టి కొనేముందు ఆ వస్తువులు, పదార్థాలు మనకు ఎంతమేరకు ఉపయోగపడతాయో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. పక్కవాళ్లు అంత ఖర్చు పెట్టి పెళ్లి, ఫంక్షన్లు చేశారు.. మనమూ అలాగే చేయాలనే ఆడంబరాలకు పోకూడదు. ఉన్న డబ్బును పిల్లల చదువుకు, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయినప్పుడు వాడుకోవాలి. ఇంకా బంధువులకు ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమవుతాయి. అప్పుడు అప్పు చేసే బాధ లేకుండా డబ్బును పొదుపుగా ఖర్చు పెట్టి, కొంత సమకూర్చుకోవాలి.

  • పిల్లలకు పొదుపు ఖాతా..

బయటకు వెళ్లినప్పుడు కంటికి కనిపించిన కొత్త వస్తువులు పిల్లలు అడగడం సహజం. అది కొనివ్వకపోతే వారి కోపానికి గురికాక తప్పదు. అందుకే వారి చేతికి కొంత డబ్బు ఇచ్చి, పొదుపు చేయించేలా ప్రోత్సహించాలి. అప్పుడే ఖర్చు పెట్టే విషయాల్లో ఆలోచనతో అడుగేస్తారు. జనగామ జిల్లా చిల్పూర్‌ జెడ్పీ హైస్కూల్లో కొంతమంది ఆడపిల్లలు కలిసి 'స్కూల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చిల్పూర్‌' అని పొదుపు బ్యాంకు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తాన్ని స్థానిక పోస్టాఫీసులో జమ చేస్తున్నారు. ఇలా పాఠశాల స్థాయి నుంచే పొదుపు అవగాహన కల్పిస్తే కుటుంబ ఖర్చుల పట్ల ఒక అవగాహన వస్తుంది. ఆదా చేయడం అలవాటవుతుంది. అవసరాలకు తగ్గట్టుగా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వ్యవహరిస్తారు.
పిల్లలు, వారి చదువుల కోసం ప్రత్యేకించి పొదుపు పథకాలు ప్రారంభించే ముందుగా ఆ కుటుంబంలో యజమాని పేరు మీద కచ్చితంగా బీమా పాలసీ ఉండాలి. పిల్లల భవిష్యత్తు చదువుల కోసం ప్రత్యేక పొదుపు పథకాలు ఉన్నాగానీ కుటుంబ యజమాని పేరుపై బీమా ఉంటే మంచిదనేది నిపుణుల సూచన. అనుకోని సంఘటన జరిగితే బీమా పాలసీ ద్వారా దక్కే ప్రయోజనాలు ఆ కుటుంబానికి, పిల్లల చదువులకు రక్షణగా నిలిచే అవకాశం ఉంటుంది.

saving-for-future-sneha-story-women
  • మహిళలకు ప్రత్యేకంగా..

ఇంటా, బయట కష్టపడే మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని తీవ్రమైన వ్యాధులు మహిళలకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గర్భాశయ, రొమ్ము, సర్వైకల్‌ క్యాన్సర్‌ వంటివి ఇటీవల మహిళల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. వీటి చికిత్సకు అధిక మొత్తంలో అవసరం ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలామంది వీటికి చికిత్స చేయించుకోలేరు. ఫలితంగా ప్రాణం మీదకు వస్తాయి. ఇటువంటప్పుడు పరిహారం ఇచ్చే 'క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ' లను తీసుకోవాలి. ఒకసారి వ్యాధిని గుర్తించగానే పాలసీ ద్వారా ఒకేసారి పరిహారం అందుతుంది. దీంతో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు. ఆ కుటుంబానికి కొంత ఊరట కలుగుతుంది. ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళలు ఈ బీమాను తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు 'మెటర్నిటీ బెనిఫిట్‌ పాలసీ' తీసుకోవడమూ మంచిది. బిడ్డ పుట్టినప్పుడు అయ్యే వైద్య ఖర్చులను పాలసీకి చెందిన కంపెనీ చెల్లిస్తుంది. కొన్ని పాలసీల్లో బిడ్డ పుట్టగానే తనకూ బీమా రక్షణ లభిస్తుంది. మరికొన్ని పాలసీల్లో కొన్ని టీకాల ఖర్చులనూ చెల్లిస్తారు.

saving-for-future-sneha-story-women
  • బీమా తప్పనిసరి..

కరోనా తర్వాత చాలామందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఎవరి ఆరోగ్యం ఎప్పుడు.. ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇంట్లో ఉన్నా.. ప్రయాణం చేస్తున్నా.. ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. అందుకే ప్రతిఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా తప్పనిసరిగా ఉండాలి. ఈ పాలసీలు.. అత్యవసరాల్లో ఎవరి మీదా ఆర్థికంగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ప్రమాదంలో గాయపడినా, పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా ప్రమాద బీమా పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీలు ప్రమాదం జరిగినప్పుడే కాదు.. గృహరుణం ఉన్నా వ్యక్తిగత ప్రమాద బీమాలు ఉపయోగపడతాయి. అయితే ఈ పాలసీలు కట్టేముందు అన్ని వివరాలు తెలుసుకునీ, అన్నీ విశ్లేషించుకుని జాగ్రత్తగా కట్టుకోవాలి. ఈ బీమాల పట్ల కుటుంబసభ్యులు పూర్తి అవగాహనతో మెలగాలి.

saving-for-future-sneha-story-women
  • వాహన బీమా..

కాలంతో పాటు పరుగుతీస్తున్న కాలంలో అందరూ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వాహనం నడిపేవారికి నూటికి నూరు శాతం బీమా పాలసీ తీసుకోవాలి. అయితే, మహిళా వాహనదారులకు ప్రత్యేకంగా బీమా, ఇన్సూరెన్స్‌ పాలసీల్లో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని పాలసీ తీసుకునేటప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉదాహరణకు అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని ఒకచోట నుంచి మరోచోటకు తరలించేందుకు ఏర్పాటు, రహదారిపై వాహనం నిలిచినప్పుడు సేవలు అందించేలా 'రోడ్‌సైడ్‌ అసిస్టెంట్‌' లాంటి ప్రత్యేక రైడర్లను ఇన్సూరెన్స్‌ పాలసీకి జోడించుకోవాలి. వాహనం నడిపేటప్పుడు ఏ ఇబ్బంది ఎదురైనా బీమా కంపెనీని సంప్రదిస్తే చాలు. బీమా సంస్థ అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇలాంటి విషయాలపై వాహనదారులు అవగాహన పెంచుకోవాలి. ఇవేకాకుండా, ప్రయాణాలు ఎక్కువగా చేసే వారు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ (ప్రయాణ బీమా పాలసీ)ని తప్పనిసరిగా తీసుకోవాలి.

  • ఆహారం, నీరు, విద్యుత్‌ పొదుపు..

నిత్య జీవనంలో పొదుపు అనేది సహజంగా ఉండాలి. అందులోనూ ఆహారంలో చాలా అవసరం. ఎక్కువ వండుకుని, పారబోయడం ఆహారాన్ని వృథా చేయడమే. పడేయడం ఇష్టంలేక చాలామంది చద్దివి తింటూంటారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతారు. అందుకే అవసరం మేరకు వండుకోవాలి. నీటి విషయంలోనూ అంతే.. చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. మరి కొన్నిచోట్ల నీరు వృథాగా పోతూ ఉంటుంది. కానీ భవిష్యత్తు తరాలకు నీటి సమస్య రాకుండా ఉండాలంటే అవసరం మేరకే నీరు వాడుకోవాలి.
ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు ఫ్యాన్లు, లైట్లు కట్టేయడం మరచిపోతూ ఉంటారు. ఇంట్లో ఎవరూ లేకపోయినా లైట్లు వెలుగుతూ, ఫ్యాన్‌ తిరుగుతూ ఉంటాయి. కొందరు ఏసీలు కూడా వేసేసి మర్చిపోతుంటారు. కానీ ఒక్క నిమిషం ఆగి స్విచ్‌లన్నీ ఆఫ్‌ చేశామా? లేదా? అని చూసుకోవడం తప్పనిసరి. దేనినైనా పొదుపుగా వాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు అందించగలం.
పద్మావతి
94905 59477