Oct 31,2020 22:57

'మాధవ్‌ ! సరికొత్త కథలు కావాలయ్యా! ట్రెండ్‌ మారిపోతోంది. సహజత్వానికి దగ్గరగా చక్కని ఆహ్లాదమయిన కథలు రాసే రచయతలు రావాలయ్య మన ఫీల్డ్‌కి!' అన్నాడు సర్వోత్తమరావు.
హైదరాబాద్‌ ఒక స్టార్‌ హోటల్‌లో స్పెషల్‌గా బుక్‌ చేసిన సూట్‌లో ప్రముఖ నిర్మాత సర్వోత్తమ రావు, అప్పుడే సినీ రచయితగా ఎదుగుతున్న మాధవ్‌, డైరెక్టర్‌ జమదగ్ని కొత్త సినిమా కథ మీద కసరత్తుకు సమావేశమయ్యారు. వాళ్ళ మధ్య ఈ సంభాషణ మొదలయ్యింది.


'అలా రాసే రచయితల్ని మన చిత్ర పరిశ్రమ ప్రోత్సహించే చరిత్ర లేదు సర్‌! అందుకునే చాలా గొప్ప రచయితలలూ వాళ్ళ అస్తిత్వాలు పొగొట్టుకోలేక ఇక్కడికి రావడం లేదు!' అని కఠినంగా అన్నాడు.
'మరి నువ్వూ అలాగే ఫీల్‌ అవుతున్నావా?' జమదగ్ని అడిగాడు.
'నేనూ చాలా కాంప్రమైజ్‌ అయ్యి, వెనక్కి వెళ్లలేక మనసు చంపుకొని రాస్తున్నా!'
'అదేంటయ్యా! నువ్వు రాసిన కథ, మాటలు గొప్ప హిట్‌ కదా.?!'
'కానీ నాకు మానసిక తృప్తి కలిగే ఒక్క కథా ఇప్పటివరకూ రాయలేదు. మన పరిశ్రమకి రావలసిన గొప్ప రచయితలు ఇక్కడకు వచ్చారుగానీ, ఇమడలేక వెనక్కి వెళ్ళిపోయారు!'
'అలాంటివాళ్ళు కూడా ఉన్నారా? అసలు ఇక్కడకి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లరు కదా?' అని జమదగ్ని సందేహం వ్యక్తం చేశాడు.
'ఎందుకు లేరు సర్‌ ? మీరు ఓపికగా వింటే చెప్తాను!'
ఇద్దరు కుతూహలంగా.. 'చెప్పు.. అలాంటివాళ్ళ గురించి' అడిగారు. మాధవ్‌ చెప్పడం ప్రారంభించాడు..


***


అది కోనసీమలోని ఒక ఊరి నడిబొడ్డులో గడియార స్థంభాన్ని ఆనుకొన్న శాఖా గ్రంథాలయం. అక్కడ హాల్లో టేబుల్సు మీద పేపర్లు, వారపత్రికలు.. వాటిని చదువుతున్న పాఠకులు. తర్వాత గదిలో గాజు అల్మారాల్లో ఎన్నో గ్రంథాలు, నవలలు పేర్చి ఉన్నాయి. ఎవరు తమని చదువుతారా.. అన్నట్లు అవి వేచి చూస్తున్నాయి. వాటిలో అక్షరాలు పేజీల పరుపుల మీద గాఢనిద్రలో ఉన్నాయి. మధ్య మధ్యలో ఎవరి కళ్ళళ్ళో పడదామా అని తెరిచి చూస్తున్నాయి.


సాయంకాలం! గాలి చల్లగా వీస్తోంది. కాలువ గట్టున ఉన్న ఒక డాబా ఇంటి నుండి బయలుదేరిన మనోహర్‌ గడియార స్థంభం దగ్గర ఆగాడు. స్కూటర్‌ పార్క్‌ చేసి, లైబ్రరీలోకి అడుగు పెట్టాడు. గడియార స్థంబంలోని గడియారం నాలుగు గంటలు చూపిస్తోంది. ముందుగదిలో ఒక ఎత్తయిన బల్ల ముందు పొడవైన గళ్ళ పుస్తకంలో ఒక టైయిన్‌ దారం కట్టిన పెన్సిల్‌తో సంతకం చేసి, లైబ్రేరియన్‌ని నవ్వుతూ పలకరించి, వెనుక గదిలో ఉన్న నవలల రేక్‌ తెరిచి, దేవులపల్లి వారి ''కృష్ణపక్షం'' పుస్తకాన్ని తాకగానే అందులోని అక్షరాలు కళ్ళు తెరిచాయి. మనోహర్‌ దీక్షగా చదవడం మొదలుపెట్టాడు.


రోజూ సాయంకాలపు ఘడియలు తనకిష్టమైన లైబ్రరీలో గడపడం.. గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు చదవడం.. తర్వాత తన మిత్రులతో తను చదివిన పుస్తకాల మీద, రచయిత ఎలా రాశాడో దానిమీద సమీక్ష జరపడం చాలా ఇష్టం. చిన్నప్పుడు చదివిన చందమామ దగ్గర నుంచి మొదలైన ప్రస్థానం కొనసాగుతోంది. తిలక్‌, శ్రీశ్రీ, పురాణం, చలం, విశ్వనాథ వార్ని అందరివి చదివేశాడు. డిగ్రీలో చదువుతున్న కామర్స్‌ మీద కన్నా తెలుగు సాహిత్యం మీదే ఎక్కువ మక్కువైంది. కాలేజీ మ్యాగజైన్‌లో ''గాలిపటం'' కవిత అచ్చు కావడం మనోహర్‌కి సాహితీ రంగంలోకి అడుగుపెట్టడానికి దోహదపడింది.


కాలేజీకి వేసవి సెలవులు మనోహర్‌కి ఒక ఆటవిడుపు. అతనిలో ఉన్న జిజ్ఞాస మరింత పెరిగి, ఒక కథ రాయడానికి ప్రేరేపించింది. వేసవి కాలం, కోనసీమలోని మామిడి చెట్లు మామిడి పూత పిందెలుగా రూపుదాలుస్తున్నాయి. మావిచిగుళ్ళు తిన్న కోయిలలు రెచ్చిపోయి కూస్తున్నాయి. ఎంత ఎండాకాలమైనా సాయంకాలం చల్లబడిపోతోంది. మనోహర్‌కి తన ఇంటి పెరట్లో చెట్ల నీడలో మడతమంచం వేసుకొని, తనకిష్టమైన పుస్తకం చదువుకోవడం మరింత ఇష్టం. ఆ రోజు పోస్ట్‌మేన్‌ తెచ్చిన లెటర్‌ ప్రముఖ పత్రిక నుండి వచ్చింది. తన కథ ''ఆవాహన'' ప్రచురణకు అనుమతిస్తూ పంపిన సందేశం.. అతనిలోని రచయిత మరింత ఆనందపడ్డాడు. మరిన్ని సార్లు ఆ లెటర్‌ని చదువుకున్నాడు.


సాయంకాలం గడియార స్థంభం దగ్గరనున్న గణేష్‌ టీ స్టాల్‌లో శ్రీనివాస్‌, గణేశ్‌, రమణ, మూర్తీలకు పకోడీ, టీ పార్టీ ఇచ్చాడు.
'ఒరేరు ఇది చాలా చిన్న పార్టీ. నువ్వేమో ఏదో రోజు సినిమాలకు రాసేస్తావు. మేం అప్పుడు అస్సలు వదిలిపెట్టం! అసలు మమ్మల్ని గుర్తుంచుకుంటావో లేదో?!'
మనోహర్‌ నవ్వేసి..'అంత ఆశ లేదురా! ఈ కోనసీమ అందాల్ని వదిలి, నేను ఎక్కడకి వెళ్ళలేను! అయినా ఒక్క కథే కదా! ఇంకా చాలాదూరం ప్రయాణించాలి. నా తృప్తికోసం నేను రాసుకుంటున్నా. చూద్దాం ! ఎంతవరకు సాగుతుందో?' అన్నాడు.
అతని కథ ప్రచురితమైన వీక్లీ ఇంటికి రావడం, అందరూ అభినందనలు చెప్పడం.. నాన్న ఏమీ మాట్లాడకపోయినా అభినందన పూర్వకంగా చూడడం.. మరింత మానసిక బలాన్నిచ్చింది మనోహర్‌కి.
పత్రికల్లో కథలు పడడం, కాలేజీలో రచయిత మనోహర్‌గా పేరుపొందిన తరువాత ఒకరోజు కాలేజీ వార్షికోత్సవాలకి వచ్చిన ప్రముఖ రచయితతో పరిచయం.. ఆయనకి తను రాసిన కథలు ఇవ్వడం యాధృచ్ఛికంగా జరిగింది.
వానాకాలం వచ్చింది చెట్లన్నీ సేదతీరుతున్నాయి. తొలకరి జల్లుల్లో, మట్టి గుబాళింపులతో ఆ ఊరి జనం ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. మనోహర్‌ మదిలో ఆ టైములో మొలకెత్తిన ఆలోచన నవల ''మనోరథం''గా రూపుదాల్చింది. ప్రసిద్ధ పత్రిక నిర్వహించిన దీపావళి నవలల పోటీలో ఉత్తమ నవలగా బహుమతి పొందింది. అందరి అభినందనల జల్లు మరోసారి మనోహర్‌ మీద కురిసింది.


'మనో ! నీకు ఫోన్‌ !' అని నాన్న పిలుపుకి పెరట్లోంచి ఇంట్లోకి పరిగెత్తి ఫోన్‌ అందుకుని 'హలో !ఎవరండీ?' అని 'నమస్తే సర్‌! థాంక్యూ సర్‌! ఆలోచిస్తాను సర్‌ కొద్దిగా టైము కావాలి!' అని ఫోన్‌ క్రెడిల్‌ చేశాడు.
'ఎవర్రా?' అని తండ్రి షణ్ముఖరావు అడిగాడు.
'అదే నాన్నా! మా కాలేజీకి వచ్చిన సినీ రచయిత వంశీనాథ్‌ గారు. ఎవరో నిర్మాత నా కథలు చదివారుట! ఒక కొత్త కథకి మాటలు రాయమన్నారుట. వీలైతే చెన్నై రమ్మన్నారు!' ఇంటిల్లిపాది ఆలోచనలో పడ్డారు.
''మరి నీ చదువు? ఈ సినిమాలు, కథలు కూడు పెట్టవురా! సరైన దారి ఎంచుకోపోతే మున్ముందు ఇబ్బందిపడతావు!'' అని తన మధ్యతరగతి మనస్థత్వ భయంతో అన్నారు షణ్ముఖరావుగారు.
''లేదు నాన్నగారు నాకు సాహిత్యం మీద అభిలాష కొద్దీ రాయడం మొదలుపెట్టాను తప్ప మరో ఆలోచన లేదండి!' అని తన ఉద్దేశ్యాన్ని చెప్పాడు.


అక్కడితో ఆ సంభాషణ ముగిసింది.
రాజమండ్రిలో గోదావరి సాహితీ సంస్థ వాళ్ళ ''కథా నీ దారెటు'' అనే చర్చలో పాల్గొని బస్‌లో తన ఊరికి బయల్దేరాడు. అక్కడ చాలామంది పేరుగల రచయితలు, వాళ్ళ భావాలు వినగానే కొత్తగా కథ ఎలా చెప్పాలో, మనస్సుకు హత్తుకొనేలా ఎలా రాయాలో మరింత స్పష్టత వచ్చింది మనోహర్‌కి.
నవంబర్‌ నెల, చలిని తట్టుకోవడానికి నెగళ్ళు దగ్గర జనం చలి కాగుతున్నారు. మనోహర్‌ తన గమనం ఎటువైపు వెళ్ళబోతోందా.. అని ఆలోచిస్తున్నాడు. బస్‌లో ఇద్దరు కుర్రాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
'అబ్బ! ఏం రాశాడురా డైలాగ్సు ఆ సినిమాలో ''బొట్టు కన్నీటి బొట్టైంది'' అన్న డైలాగు హైలైట్‌ కదరా!' వాళ్ళు చూసిన సినిమా గురించి డిస్కస్‌ చేసుకుంటున్నారు. సినిమా పవర్‌ఫుల్‌ మీడియం అని మనోహర్‌ మనస్సులో అనుకున్నాడు.
మరుసటి రోజు సాయంకాలం ఫ్రెండ్స్‌ని కలిశాడు. వాళ్ళందరితో సినిమా కథల మీదే డిస్కషన్‌ అయ్యింది. వాళ్ళందరు మనోహర్‌ని 'ఒరేరు నీ కథలు నెమ్మదిగా ప్రవహించే సెలయేళ్ళలా ఉంటాయి. కానీ సినిమాలకి కావలసింది జలపాతాలు. నీ వరవడి మారాలి!' అన్నారు.


'అదే ఆలోచిస్తున్నాను. నా కథని కొత్త పుంతలు తొక్కించాలి!' అనుకొని, అందరికీ బై చెప్పి, ఇంటికి బయలుదేరాడు.
అవినీతి మీద మనోహర్‌ రాసిన ''యుద్ధం'' నవల గొప్ప సంచలనం సృష్టించింది. ఆ పత్రిక సర్క్యులేషన్‌ మరింత పెరగడంతో మరింత మంది ఎడిటర్స్‌ ఫోన్‌ చేసి, తమకీ ఒక సీరియల్‌ రాయమని అడగడం.. మనోహర్‌ రచయితగా మరో మెట్టు ఎక్కాడు. ఫోన్ల తాకిడి పెరిగింది. ఒక నిర్మాత ఏకంగా ఇంటికే వచ్చేశాడు ''యుద్ధం'' కథతో సినిమా తీస్తానని.
తండ్రి దగ్గర ఒకరోజు తన మనసులో ఉన్నది బయటపెట్టాడు. తనకి సినిమాలకి కథలు రాయాలని ఉందని.
'నాకు భయంగా ఉందిరా నువ్వు అక్కడ నిలదొక్కుకోగలవా?' అన్న తండ్రి మాటకు మనోహర్‌ సమాధానంగా.. 'చూస్తాను నాన్నా! ఒక ఛాన్స్‌!' అన్నాడు. 'సరే నీ ఇష్టం!' అని ముక్తసరిగా అని ఊరుకొన్నాడు.


అందరి అభినందనల మధ్య రాజమండ్రిలో ట్రైన్‌ ఎక్కాడు. చెన్నైలో తనని పిలిచిన నిర్మాతని కలిశాడు. అతను డైరక్టర్‌ని పరిచయం చేశాడు. అతను కరచాలనం చేసి 'మీ యుద్ధం చదివాను. కానీ దానిలో కొన్ని మార్పులు చేయాలి!' అంటూ సిట్టింగ్‌కి కూర్చోబెట్టాడు.


చెన్నైలో పానగల్‌ పార్క్‌ దగ్గరలోని ఒక ఇంట్లో మకాం పెట్టిన మనోహర్‌కి ఒక వంటవాడు, పనివాడిని పెట్టాడు నిర్మాత. తన కథ చాలా మార్పులు చేర్పులతో తరిచి చూడగా ఇది అసలు తనకథేనా అనుకొన్నాడు మనోహర్‌. డైలాగ్స్‌ మటుకు కష్టపడి రాశాడు. తన ప్రయత్న లోపం లేకుండా చూసుకున్నాడు. బాగా వచ్చిందని అందరూ చెప్పిన తర్వాత దర్శకుడు. టైటిల్సులో కథా రచయితగా మనోహర్‌ పేరు ఉంటుందని.. డైలాగ్స్‌ దగ్గర మటుకు తనపేరే ఉంటుందని ట్విస్ట్‌ ఇచ్చాడు. .
అతనప్పటికే స్టార్‌ డైరక్టర్‌. మనోహర్‌కి బాధగా అనిపించింది.
'సర్లే ! చూద్దాం! మొదటి సినిమా కదా!!' అని మనసుని సమాధానపరచుకున్నాడు.


వేసవి ఎండలు మండిపోతున్నాయి చెన్నైలో. మనోహర్‌కి ఆ వాతావరణం పడక ఆరోగ్యం దెబ్బతింది. ఊరెళ్ళి, నాలుగు రోజులు ఉండి వద్దామనుకుంటే నాలుగు రోజుల్లో ''యుద్ధం'' సినిమా విడుదలవుతుంది.. అప్పటిదాకా ఉండమని నిర్మాత కోరడంతో తప్పక ఉండిపోయాడు. జ్వరంతోనే ప్రీవ్యూకి వెళ్ళాడు. ప్రీవ్యూ అయ్యాకా అందరూ అభినందనలు తెలియజేశారు. సినిమా బాగానే ఆడింది కానీ.. డైరక్టర్‌కి ఎక్కువ పేరొచ్చింది. కొంతమంది విమర్శకులు మాత్రం 'వీక్లీలో పడ్డ కథకి దీనికీ అస్సలు పోలికే లేదనీ, డైలాగ్సు చాలా బాగా రాసిన డైరక్టర్‌ అభినందనీయుడు' అని రాశారు. దానిని చూసిన మనోహర్‌కి కడుపు మండిపోయింది.


అతను రాసిన తర్వాత కథలన్నీ సినిమా వాళ్ళ చేతుల్లో పడి, అష్టవంకరులు తిరిగి తమ అస్థిత్వాన్ని పోగొట్టుకొన్నాయి. మనోహర్‌ కలం ఇదివరకటిలా పరిగెట్టడం లేదు.. మనస్సు సహకరించడం లేదు. కాంక్రీట్‌ జంగిల్‌లాంటి ఊరు.. సున్నితమైన అతని మనస్థత్వానికి సరిపడని మనుష్యుల మధ్య ఇమడలేక పోతున్నాడు. అయినా అతనికి పత్రికల నుంచి వర్తమానాలు వస్తున్నాయి. తమకి కథలు, సీరియల్స్‌ రాసి పెట్టమని.. కానీ సినీ ప్రపంచం అతన్ని ఒకచోట కుదురుగా కూర్చోనీయడం లేదు. ఇన్‌స్టెంట్‌ కాఫీలా కథ ఇమ్మని, డైలాగ్స్‌ రాయమని డిమాండ్‌ చేయడంతో అతని రచనలో పస తగ్గిపోసాగింది.


ఇదివరకులా కథలు లేవని, అతనిలో సరుకు అయిపోయిందని, మనోహర్‌ మీద విమర్శలు ఎక్కువైపోయాయి. మనోహర్‌ తన మనోధైర్యాన్ని పోగొట్టుకొన్నాడు. స్థైర్యం కోల్పోయాడు. మనిషి చాలా చిక్కి పోయాడు. ఇక అక్కడ ఉండలేక కొన్నిరోజులు తన ఊరు వెళ్ళొద్దామని ట్రైన్‌ ఎక్కాడు. బస్‌ కోనసీమలోకి ప్రవేశించాకా.. అక్కడ పచ్చ గాలి అతన్ని పలకరించింది.. 'ఎక్కడకు పోయావు నేస్తం?' అంటూ.. బస్‌ కిటికిలో తలపెట్టి వీస్తున్న ఆ గాలి ముఖానికి తగులుతుంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోయాడు.
ఇంటి భోజనం తిన్న మనోహర్‌కి కాస్త ఓపిక వచ్చింది. తన ఊరు స్వర్గంలా అనిపించింది. తండ్రి నాలుగు విమర్శనాస్త్రాలు సంధిద్దామనుకున్నా.. కొడుకు పరిస్థితి చెప్పిన తల్లి, చెల్లి ఇంట్లో వాళ్ళ వల్ల నోరు మెదపలేదు.


'నాకు మటుకు ప్రేమ ఉండదా? వాడి మనస్తత్వానికి సరిపడదని నేనే వద్దన్నాను!' అని సర్ది చెప్పుకున్నాడు తండ్రి.
నాలుగురోజుల వరకూ మనోహర్‌ బయటకి వెళ్ళలేదు. ఫ్రెండ్స్‌ వచ్చి పలకరించి, సినిమావాళ్ళని తిట్టిపోశారు.
'వాళ్ళకి మంచి కథలు అక్కర్లేదురా!' అని కొంతమందంటే.. 'మన రచయితలు ఎలా వేగుతున్నారో కదా వీళ్ళతో?' అని ఇంకొంతమంది అన్నారు.


తన గదిలో మేజా బల్ల, తెల్ల కాగితాలు, కలం ఎదురుచూస్తున్నాయి. వాటిని తాకిన వెంటనే కన్నీటి చుక్క బుగ్గలపై నుండి జారి, పేపరు మీద పడింది. కొంచెం సేపటికి తేరుకొని, మనోనిశ్చయంతో మనోహర్‌ తన రచనా వ్యాసంగం మళ్ళీ మొదలుపెట్టాడు. కొంతమంది సినిమా వాళ్ళు ఫోన్‌ చేస్తే.. 'నేను రాసిన కథ యథాతధంగా ఉంచాలి. నా డైలాగ్సు కావాలంటే ఇక్కడ నుండే రాస్తాను! అవి తన పేరు మీదే రావాలి' అని సున్నితంగా చెప్పాడు.
కొన్ని రోజులకి పత్రికలో ప్రకటన పడింది. సహజ రచయిత మనోహర్‌ గారి కలం నుండి జాలువారబోయే ''కొత్త కోయిల'' త్వరలో ప్రారంభమవుతుందని. కోనసీమలో మామిడి కొమ్మల్లో ఉన్న కోయిల కూసింది ఆనందంగా.. వసంతం వచ్చిందంటూ!


***


మాధవ్‌ చెప్పడం ఆపి, 'ఇదీ మన సృజనాత్మక, కళాత్మక సినిమా పరిశ్రమ నుండి వెనక్కి వెళ్ళిపోయిన ఒక రచయిత కథ!' అని లేచాడు. స్టార్‌ హోటల్‌ రూము ఖర్చు తలుచుకుని గిలగిల్లాడిన నిర్మాత 'అయ్యో ! అప్పుడే వెళ్లిపోతున్నావేంటయ్య? కాసేపు ఉండి, కొత్త కథ చెప్పి వెళ్ళు!' అన్నాడు.
'మూడ్‌ లేదు సర్‌ ! మళ్ళీ కలుద్దాం!'
'ఇంతకీ నువ్వు చెప్పిన కథ వెనుక ఆ గొప్ప రచయిత ఎవరో చెప్పెళ్ళో!' అంటూ వ్యంగ్యంగా అడిగాడు జమదగ్ని.
వెనక్కి తిరిగి చూసి 'గ్రేట్‌ రైటర్‌ కీర్తిశేషులు శ్రీనాథ్‌! మా నాన్న!' అని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ గది బయటకి అడుగుపెట్టాడు.

- చాగంటి ప్రసాద్‌
9000206163