యాభై రోజులుగా సాగుతున్న మహత్తర రైతాంగ పోరాటాన్ని దెబ్బతీయడానికి మోడీ ప్రభుత్వ పన్నాగాలు పారలేదు. ఇప్పుడు దొడ్డిదారిన సుప్రీంకోర్టు ద్వారా కొత్త దారులు వెతుకుతోంది. ఏడు దఫాలుగా సాగిన చర్చల్లో ప్రభుత్వం చేయలేని పని సుప్రీంకోర్టు ద్వారా చేయాలని మోడీ ప్రభుత్వం తలపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో కనీస మద్దతు ధర చట్టం చేయడానికి నిరాకరించిన ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడానికి మాత్రమే సిద్ధపడింది. మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోడానికి బదులుగా అక్కడక్కడా కొన్ని సవరణలు చేస్తామని చెప్పింది. రైతు సంఘాలు దానికి ఒప్పుకోకపోవడంతో అందరికీ ఆమోదయోగ్యమైన ఒక కమిటీని వేస్తామని, వీరు చెప్పిన ప్రకారం పోదామని ప్రతిపాదించింది. ఇది కూడా రైతులకు అంగీకారం కాకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సిందిగా ఆఖరిసారి జరిగిన చర్చల్లో స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం తరపున కోర్టు వకాల్తా పుచ్చుకొని కమిటీని నియమించింది. రెండు నెలల్లో వారిని నివేదిక ఇవ్వమని, అప్పటి దాకా ఈ చట్టం అమలు నిలుపుదల (స్టే) చేస్తున్నట్టు తీర్పు చెప్పింది. కోర్టు స్టే ఇవ్వడంతో చట్టాలు వెనక్కి తీసుకున్నట్లుగా, ఉద్యమం ముగిసినట్లుగా కొందరినైనా భ్రమల్లో పెట్టడానికి ప్రభుత్వానికి అవకాశం చిక్కింది. ఈ స్థితిలో కోర్టు తీర్పు పర్యవసానాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం పోరాటం నడుపుతున్న 500 రైతు సంఘాలలో ఏ ఒక్కరూ తమకు 'న్యాయం' చేయాల్సిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థించలేదు. పైగా అఫిడవిట్ వేయాల్సిందిగా సుప్రీంకోర్టే రైతు సంఘాలను కోరింది. దాన్ని రైతు సంఘాలు నిరాకరించాయి. తాము నల్ల చట్టాల చట్టబద్ధత గురించి ప్రశ్నించడం లేదని, వాటిని మొత్తంగానే తిరస్కరిస్తున్నామని, అందువల్ల ఈ విషయాన్ని కోర్టు ద్వారా తేల్చుకోవాల్సింది ఏమీ లేదని, ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని రైతులు స్పష్టం చేశారు. అయినా సుప్రీంకోర్టు ఏకపక్షంగా ప్రభుత్వ వాదన మాత్రమే విని ఈ తీర్పు చెప్పింది. కమిటీ సభ్యుల్ని కూడా వారే ఏకపక్షంగా నిర్ణయించారు. న్యాయం కోసం తీర్పులు చెప్పాల్సిన సుప్రీంకోర్టు 'మధ్యవర్తిత్వం' చేయనారంభించింది. ఇది న్యాయ చరిత్రలోనే అత్యంత దురదృష్టకర పరిణామం.
కోర్టులో కేసు వేసింది బిజెపి అనుకూల భారతీయ కిసాన్ సంఫ్‌ు. రెండో వైపున వున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు పక్షాలు చట్టాలకు అనుకూలం. వారి వాదనల్ని మాత్రమే విని తీర్పు చెప్పడం వెనుక మతలబు ఏమిటో అందరికీ తెలుసు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, ప్రభుత్వం కోరుకున్న తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ తీర్పులో వున్న ప్రధాన అంశాలు రెండు. మొదటిది-మూడు నల్ల చట్టాల అమలుపై స్టే ఇవ్వడం. స్టే అంటే చట్టాల చెల్లుబాటును ప్రశ్నించడం కాదు. తిరస్కరించడం అంతకన్నా కాదు. అమలును నిలుపుదల చేయడం. ఇప్పటి వరకు ఈ చట్టాలు ఏ రూపంలో అమల్లోకి వచ్చాయి? వీటిని కోర్టు ఎలా ఆపుతుంది? వ్యాపారస్తులు తమ దగ్గర అపరిమితంగా వున్న నిత్యవసర సరుకులు నిల్వలను తగ్గించుకోవాలి. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతాయా? అలా అమలు చేస్తే అక్రమ వ్యాపారస్తులపై కేసులు పెట్టాలి. దీనికి ప్రభుత్వం సిద్ధమా? కార్పొరేట్ సంస్థలు రైతులతో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. ప్రభుత్వం వాటిని చట్టవిరుద్ధంగా ప్రకటించగలదా? అన్నింటికన్నా ముఖ్యంగా మద్దతు ధరలకు ప్రభుత్వ సంస్థలు రైతుల నుండి కొనుగోలు చేయాలి. కాని, కేంద్ర ప్రభుత్వ చట్టాల వలన తాము రైతుల నుండి ధాన్యం కొనబోమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా కొనడానికి ఆసక్తి చూపడం లేదు. మిల్లర్లు, వ్యాపారులు ఇష్టానుసారం బస్తాకి రూ.200/రూ.300 తగ్గించి కొంటున్నారు. వీరిపై చర్య తీసుకోవడమో లేదా మద్దతు ధరకు ప్రభుత్వం కొనడమో చేయాలి. ఈ రెండూ కేంద్రం అమలు చేయాలి. ఎఫ్‌సిఐ ని రంగంలోకి దించి కొనుగోలు చేయించాలి. ఆ పని చేయిస్తుందా? మరొక అంశం మార్కెట్ యార్డులను రద్దు చేయడం. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ సెస్ రద్దు చేసి అంతర్ జిల్లా, రాష్ట్ర లావాదేవీలు, రవాణాపై ఆంక్షలు ఎత్తివేసింది. మరలా చెక్ పోస్టులు పెట్టి వ్యాపారస్తుల నుండి సెస్ వసూలు చేస్తుందా? దీనికి కేంద్రం అంగీకరిస్తుందా? ఇవేమీ చేయకుండా చట్టాల అమలుపై స్టే విధించామంటే అర్ధం ఏమిటి? ఈ 'స్టే' ఎలా అమలు చేయాలో కనీసం 'పర్యవేక్షణ కమిటీ' కూడా వేయలేదు. అంటే తీర్పు ఇచ్చిన వారికి దీని అమలుపై చిత్తశుద్ధి వుందా అన్న అనుమానం రాక తప్పదు. చట్టాల అమలు నిలిపివేయడం కన్నా ఆ పేరుతో ఉద్యమాన్ని నీరుకార్చాలన్న ధ్యాసే లక్ష్యంగా కనిపిస్తున్నది.
రైతులు ఎందుకు 'స్టే'ని అంగీకరించడం లేదు? 'స్టే' అనేది తాత్కాలిక చర్య. దీన్ని ఎప్పుడైనా ఎత్తేయవచ్చు. రెండు నెలల తర్వాత రైతులు ఉద్యమాన్ని విరమించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయాక 'స్టే' ఎత్తివేస్తే తిరిగి చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇక అప్పుడు ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదు. ప్రభుత్వం మాత్రమే సంతోషంగా వుంటుంది. ప్రభుత్వాన్ని సంతోష పెట్టేందుకే ఈ 'స్టే' ఉపయోగపడుతుంది. 'స్టే' కి బదులుగా చట్టాన్ని ఉపసంహరించుకొని రైతులు కోరిన పంట గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేసి, దానిపై చర్యల కోసం కమిటీని నియమించి వుంటే రైతులంతా సంతోషించి వుండేవారు. కాని చట్టాలను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సిద్ధపడలేదు.
నిజానికి ఈ చట్టాలు రాజ్యాంగబద్ధం కాదని వివిధ రాజ్యాంగ నిపుణులు, న్యాయకోవిధులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన బాధ్యత రాజ్యాంగాన్ని పరిరక్షించడం. పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధం కాకపోయినా, రాజ్యాంగ బద్ధంగా ఆమోదించకపోయినా వాటిని కొట్టేయవచ్చు. ఈ బిల్లులను రాజ్యసభలో పెట్టిన తర్వాత ఓటింగు జరపలేదు. రాజ్యాంగం 100వ ఆర్టికల్ ప్రకారం ఓటింగ్‌కు ఒక్కరు డిమాండ్ చేసినా పెట్టి తీరాలి. కాని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా డిమాండ్ చేసినా అంగీకరించకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇది అప్రజాస్వామికమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. సుప్రీంకోర్టు దీన్ని పరిశీలనలోకే తీసుకోలేదు. రాజ్యాంగ పరిరక్షణలో అది తన బాధ్యతను విస్మరించింది. కోర్టు తన పని తాను చేయకుండా ప్రభుత్వ బాధ్యతను తన నెత్తిన వేసుకున్నది.
ఇక రెండో అంశం- కమిటీ నియామకం. ఏ ప్రాతిపదికపై నలుగురిని ఎంపిక చేశారో కోర్టు వివరణ ఇవ్వలేదు. వారంతా ఈ చట్టాలకు అనుకూలం. రైతాంగ ఉద్యమానికే కాదు, డిమాండ్లకు కూడా వ్యతిరేకం. కనీసం ఉద్యమం పట్ల సానుభూతి కూడా లేదు. వ్యవసాయ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను బలపరిచేవారే. అలాంటి వారు రైతులకు ఎలా న్యాయం చేయగలరు. అందులో ఒకరు భూపేందర్ సింగ్ మాన్. భారతీయ కిసాన్ యూనియన్ పేరుతో చెలామణి అవుతున్న నాయకుడు. అతను ఈ ఉద్యమంలో భాగస్వామి కాదు. కాని రైతుల వ్యతిరేకతతో తాను ఈ కమిటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరొకరు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి రైతులు చెప్పింది వింటానని ప్రకటించారు. వింటారు సరే ఆఖరికి ఏం సిఫార్సు చేస్తారన్నదే ముఖ్యం. ఈ కమిటీలో వున్న ఆర్థికవేత్త అశోక్ గులాటి మొదటి నుంచి ఈ చట్టాలను బలపరుస్తున్నారు. కోర్టు ఈ కమిటీని చట్టాలకు అనుకూలంగా ఏర్పాటు చేసింది. ఇక న్యాయం లభిస్తుందని రైతులు ఎలా నమ్ముతారు? తమను విశ్వసించమని కోర్టు రైతు సంఘాలను కోరింది. కాని ఆచరణలో వారికి విశ్వాసాన్ని ఇవ్వలేకపోయింది. అదే దాని వైఫల్యం.
రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉన్న ఒక ఉన్నత న్యాయస్థానం చట్టాల రాజ్యాంగబద్ధతను తేల్చకుండా మధ్యవర్తిత్వాలు చేస్తానంటే...ఇక రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్లు ఎవరు? రాజ్యాంగాన్ని పక్కన పెట్టడమంటేనే నిరంకుశత్వానికి పునాది అవుతుంది. ప్రభుత్వం కోరుకునేది అదే. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయిందని బిజెపి నాయకులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఏ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని వారు అందలాలెక్కారో అదే ప్రజాస్వామ్యపు గొంతు నులమడానికి సిద్ధపడుతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని రాజ్యాంగ సంస్థల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. సుప్రీంకోర్టును కూడా 'తందానా' అనిపించాలని పలుమార్లు ప్రయత్నించారు. కొన్నింటిలో సఫలమయ్యారు. జడ్జీల నియమకాన్ని కూడా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. స్వతంత్ర పోరాట ఫలితంగా సాధించుకున్న ఈ రాజ్యాంగం, ఆ పోరాటంతో సంబంధమే లేని బిజెపి కి సమ్మతం కాదు. దానికి బదులుగా మనువాదాన్ని దేశంపై రుద్దాలని వారు చూస్తున్నారు. సుప్రీం మధ్యవర్తిత్వం మనువాదుల్ని బలపరిచేందుకు తోడ్పడుతుంది. సుప్రీం తీర్పు రాజ్యాంగాన్ని, రైతుల హక్కుల్ని పరిరక్షించేదిగా వుండాలి. ఈ నల్లచట్టాలను పూర్తిగా ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలి. ఈ కోణం నుండి సుప్రీం కోర్టు తన తీర్పును పున:పరిశీలించుకోవాలి.
* వి. శ్రీనివాసరావు (సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు)










