Nov 28,2022 23:30
  • ఉత్సాహభరితంగా కెవిపిఎస్‌ రాష్ట్ర మహాసభ ప్రారంభం
  • కర్నూలులో భారీ ప్రదర్శన, బహిరంగ సభ

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : హక్కులను కాపాడుకోవడానికి దళితులు ఐక్యంగా పోరాడాలని కేరళ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, దళిత సోషన్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ అధ్యక్షులు కె.రాధాకృష్ణన్‌ పిలుపునిచ్చారు. దేశంలో మనుస్మృతి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. రెండు రోజులపాటు జరగనున్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర నాలుగో మహాసభ కర్నూలులో సోమవారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా మహాప్రదర్శన, అంబేద్కర్‌ కూడలిలో బహిరంగ జరిగింది. కిసాన్‌ ఘాట్‌ నుండి రాజ్‌ విహార్‌ కూడలి, కోట్ల సర్కిల్‌, కొండారెడ్డి బురుజు మీదుగా ఓల్డ్‌ బస్టాండ్‌ అంబేద్కర్‌ కూడలి వరకు వేలాది మందితో మహాప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనను కె.రాధాకృష్ణన్‌, డిఎస్‌ఎంఎం జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పూర్వ ప్రధాన కార్యదర్శి జాన్‌ వెస్లీ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లప్ప, అండ్ర మాల్యాద్రి డప్పు కొట్టి ప్రారంభించారు. ప్రదర్శనలో డప్పు కళాకారులు డప్పులు వాయిస్తూ ముందుకు సాగారు. వారి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెవిపిఎస్‌ నాయకులు కార్యకర్తలు చేతులు పైకిజోడించి ఈ సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, కులవిక్షతను రూపుమాపేందుకు పూనుకుంటున్నట్లు ప్రతిజ్ఞబూని ముందుకు సాగారు. రాజ్‌ విహార్‌ కూడలిలో ఐద్వా ఆధ్వర్యంలో, పెద్ద పార్కు రోడ్డు కూడలిలో ఆవాజ్‌ ఆధ్వర్యంలో పూలు చల్లి మహాప్రదర్శనకు స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్‌ సర్కిల్‌లో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌బాబు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కె.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ దేశ సామూహిక వ్యవస్థ కులవ్యవస్థ మీద నిర్మితమైందని, కుల వ్యవస్థను నాశనం చేయకుండా సమానత్వాన్ని సాధించడం సాధ్యం కాదని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోరాటాలకు పుట్టినిల్లు అని అన్నారు. ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడం గర్వకారణమేనని, కానీ రాజస్థాన్‌లో నీటి పాత్ర తాకాడని తొమ్మిదేళ్ల దళిత బాలుడిని ఉపాధ్యాయుడు చనిపోయే వరకూ కొట్టడం అమానుషమని పేర్కొన్నారు. జాతి, కుల వ్యవస్థను తిరిగి తీసుకురావాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. కేరళ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. కేరళలో ఒకప్పుడు ఘోరమైన కుల వ్యవస్థ ఉండేదని, పోరాటాల వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. భూమిలేని పేదలందరికీ భూమిని పంచడంతో పాటు అందరికీ విద్య, ఉపాధి వంటి పథకాలే వామపక్ష ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాయన్నారు. దేశం నంబర్‌ వన్‌గా ఉందని మోడీ చెబుతున్నారని, ఆకలిలో దేశం ముందు స్థానంలో ఉందని విమర్శించారు. బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 52 శాతం మంది అతి దారిద్య్రంలో ఉన్నారని, వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఆ శాతం 0.70 మాత్రమేనన్నారు. రాజ్యాంగం ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు కల్పించిందని, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌ భగవత్‌ వీటిని తొలగించాలని అంటున్నారని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలు ఉన్నత స్థానాల్లో ఉంటే మనుస్మృతి అమలు కష్టం అవుతుందనే రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

  • జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలి : వి.శ్రీనివాసరావు

జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నాగరిక సమాజం సిగ్గు పడేలా నేటికీ కులవివక్ష కొనసాగుతోందన్నారు. దళితులు చనిపోయాక మృతదేహాన్ని పూడ్చడానికి కూడా స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు త్యాగం చేసిన అమరుల స్ఫూర్తితో కులవివక్షపై పోరాడాలని, కలిసొచ్చే అందరినీ కలుపుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాలకులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టాన్ని, రిజర్వేషన్లను నీరుగారుస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగడం లేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, ఆ కేసుల్లో రాజీకి పోలీసులు బలవంతం చేస్తున్నారని, దాడి చేసిన వారికి బెయిల్‌ ఇస్తున్నారని విమర్శించారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా? రాదా? అనేది తేల్చి చెప్పాలని ప్రశ్నించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడుతామని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌లోపు అంటరానితనం నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామన్నారు. కెవిపిఎస్‌ ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి జె.జాన్‌ వెస్లీ, ఎపి రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు పి.నిర్మల ప్రసంగించారు.

 

kvps-state-conference-in-kurnool-vsr-speech

 

kvps-state-conference-in-kurnool-vsr-speech

 

kvps-state-conference-in-kurnool-vsr-speech

 

kvps-state-conference-in-kurnool-vsr-speech