ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఏడాది తర్వాత కూడా ఎడతెగని పంచాయితీగా కొనసాగుతుండడం విచారకరం. ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూలు విడుదల చేసినా అనేక శేష ప్రశ్నలు అలాగే వున్నాయి. ఇప్పుడు ఎన్నికలు పెడితే కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఆటంకమనీ, మొదటి దఫా వ్యాక్సినేషన్ పూర్తయ్యాక అంటే మరో అరవై రోజుల తర్వాత ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాసిన లేఖను పంచాయితీ రాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ ఎస్‌ఇసి కి అందజేశారు. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో అటు ప్రజల ఆరోగ్యం ఇటు ఎన్నికల పూర్తి ఉభయ లక్ష్యాలనూ గమనంలో వుంచుకుని సమన్వయంతో వ్యవహరించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు నిచ్చిందని, గతంలో సుప్రీం కోర్టు కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని వారు పేర్కొన్నారు. అయితే నిమ్మగడ్డ ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చి అనుకున్న ప్రకారమే గతంలో ఇచ్చిన షెడ్యూలును మీడియా ముందు మళ్లీ ప్రకటించారు. వ్యాక్సినేషన్ రీత్యా విజయనగరం, ప్రకాశం జిల్లాలను తొలి దఫా పోలింగ్ నుంచి మినహాయిస్తున్నట్టు, ఓటింగ్ వేళలు పెంచినట్టు తెలిపారు. ఇలాంటి మీడియా గోష్టులు మామూలుగా సాంకేతికాంశాలకు పరిమితమవడం రివాజు కాగా ఎస్‌ఇసి జరిగిన పరిణామాల మీద గురించి కమిషన్‌తో సహకరించకపోతే కలిగే పర్యవసానాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై పాలక పక్షంతో సహా వివిధ వర్గాల ప్రతిస్పందనలూ వచ్చాయి. అన్నీ నిరాటంకంగా జరిగితే రేపు సుప్రీం కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు రానుంది. అయితే దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలకు తాను లోబడి వుంటానన్నారు.
2018 ఆగష్టు లోనే జరగాల్సిన ఈ ఎన్నికలను పట్టించుకోని ఎస్‌ఇసి రాజకీయ ఉద్దేశాలతోనే హడావుడి పడుతున్నారనేది వైసిపి ఆరోపణ. తెలుగుదేశం నియమితుడైన ఆయన ఆ పార్టీ ప్రేరణతోనే ఇవన్నీ చేస్తున్నారని వారంటారు. 2020 మార్చిలో ప్రభుత్వానికి కనీసం తెలియజేయకుండా కరోనా పేరిట ఈ ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడం తీవ్ర విమర్శకు గురైంది. అప్పుడు ముఖ్యమంత్రి జగన్ స్పందనలో న్యాయం వున్నా కులం ప్రస్తావన తేవడం కూడా ఎవరూ ఆమోదించలేదు. సుప్రీం కోర్టు కూడా వాయిదా వేసే ముందు ప్రభుత్వానికి చెప్పి వుండాలని ఇకపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తర్వాతి ఘట్టంలో తనకు భద్రత లేదని ఎస్‌ఇసి ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లకు ప్రభుత్వం ఏకంగా ఎన్నికల చట్టాన్ని సవరించి నిమ్మగడ్డను తొలగించి జస్టిస్ కనగరాజ్‌ను నియమించడం పెద్ద రాజకీయ దుమారమైంది. హైకోర్టు ఆ నియామకాన్ని కొట్టివేసినా చాలా మల్లగుల్లాలు సాగాయి. నిమ్మగడ్డ కూడా బిజెపి నేతలతో మంతనాలు జరుపుతూ కెమెరాకు చిక్కడం, గవర్నర్‌ను కలుసుకోకుండా తనను తనే పున:నియమించుకోవడం పొరబాటని తేలింది. సుప్రీం కోర్టు కూడా ఖచ్చితంగా చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనను తిరిగి నియమించింది.
అఖిలపక్షమా? ఏకపక్షమా?
ప్రభుత్వంతో సంప్రదింపుల బదులు అఖిలపక్ష సమావేశం పేరిట ఆయన అన్ని పార్టీలనూ పిలిచి విడివిడిగా మాట్లాడారు. సిపిఎం ప్రతినిధిగా హాజరైన వై.వెంకటేశ్వరరావు ఆ సమావేశంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. గతంలో విడుదలైన నోటిఫికేషన్‌ను రద్దు చేసి మొత్తం ఎన్నికలు మళ్లీ జరపాలని టిడిపి, సిపిఐ వంటి పార్టీలు కోరగా సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ , బిజెపి కూడా తమ అభిప్రాయాలు చెప్పాయి. అయితే అంతా అయిన తర్వాత ఎస్‌ఇసి ఏకగ్రీవంగా ఎన్నికలు జరపాలని నోటిఫికేసన్ విడుదల చేయాలని అభిప్రాయం వచ్చినట్టు ప్రకటించారు. అప్పటి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎన్నికలు సాధ్యం కావనే అభిప్రాయంతో లేఖ రాసినా పైన చెప్పిన షెడ్యూలు ప్రకటించారు. ప్రభుత్వం సహకరించడం లేదని హైకోర్టుకు వెళ్లారు. గవర్నర్‌కూ ఫిర్యాదు చేశారు. మరోవైపున వైసిపి నేతలు కొందరు మంత్రులు నిమ్మగడ్డ తెలుగుదేశం ఏజంటు అంటూ తీవ్ర భాషలోనే దాడి కొనసాగించారు. ఫిబ్రవరి 5,9,13,17 తేదీలలో నాలుగు దశలుగా ఎన్నికలు జరుగుతాయని కమిషనర్ ప్రకటించిన షెడ్యూలు నిలిపేయాలని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. షెడ్యూలును ఏకసభ్య బెంచ్ గత వారం కొట్టివేసింది. తర్వాత నిమ్మగడ్డ విస్త్రుత ధర్మాసనం ముందకు వెళ్లగా 20న అనుమతించింది. అయితే తన హయాంలో ఎన్నికలు జరపరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు నిమ్మగడ్డ ఆరోపించడం సరికాదని కోర్టు చెప్పింది. ఆ విధమైన వ్యాఖ్యలు తీవ్ర భాషలోనే మంత్రులు, పాలక వైసిపి నేతల నుంచి వచ్చిన మాట నిజమే. కాని రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషనర్ సంయయమనంతో మాట్లాడాలని కూడా సూచించింది.
సమన్వయం లేని సంఘర్షణ
స్థానిక ఎన్నికలు సకాలంలో పూర్తి చేయడం రాజ్యాంగ బాధ్యత అయినా కరోనా ప్రత్యేక పరిస్తితుల కారణంగా ప్రభుత్వంతో సంప్రదించి అడుగేయాలని హైకోర్టు విస్త్రుత ధర్మాసనం కూడా చెప్పింది. కాని తర్వాత జరుగుతున్నది అందుకు విరుద్ధమైన దిశలో వివాదం కొనసాగింపుగా మారింది. విచారణ సాగుతుండగానే ఎస్‌ఇసి డిప్యూటీ డైరెక్టర్ సాయిప్రసాద్‌ను ఎలాంటి జీతభత్యాలు పెన్షన్ వంటివి లేకుండా బర్తరఫ్ చేసినట్టు ప్రకటించారు. తర్వాత కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్‌ను తొలగించారు. వివిధ శాఖాధికారులను పిలిపించడా వారు కొన్నిసార్లు గైర్‌హాజరయ్యారు. ఇంకోవైపున కొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తాము వ్యాక్సిన్ వేయించుకునే వరకూ ఎన్నికల విధులకు రాబోమని ప్రకటించాయి. గవర్నర్‌కు మెమొరాండం కూడా ఇచ్చాయి. ఇలా పరస్పర విరుద్ధ దిశలలో సాగుతున్న ఈ పరిణామాల మధ్య ప్రభుత్వాన్ని సమర్థించేవారు, ఎస్‌ఇసిని కొనియాడేవారుగా రాష్ట్రంలో విభజన వచ్చింది. తెలుగుదేశం నాయకులైతే కేంద్ర బలగాలను పిలిపించి స్థానిక ఎన్నికలు జరపాలనే వరకూ వెళ్లారు. ఇది గతంలో ఎన్నడూ చూడని అవాంఛనీయ పరిస్థితికి దారితీసింది. సిపిఎం కార్యదర్శి మధు ఒక ప్రకటన చేస్తూ విస్త్రుత ధర్మాసనం చెప్పినట్టు ఎన్నికలు జరపాలని, ఆరోగ్యం ఎన్నిలకు ముఖ్యమే గనక సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. కాని ఆ విధమైన కనీస సమన్వయం లేకపోవడమే ప్రస్తుత సంఘర్షణకు, అనిశ్చితికి దారితీసిందనేది స్పష్టం.
బహుముఖ వివాదాలు
ఎన్నికలకన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రభుత్వం అనవచ్చు గాని ఏదో ఒక సహేతుక పరిష్కారంతో ఎన్నికలు జరపాల్సిన బాధ్యత కాదనలేనిది. తొలి విడత వ్యాక్సిన్ తర్వాత 28 రోజుల వ్యవధితో మలి విడత మొత్తం అరవై రోజుల అనంతరం ఎన్నికలకు సిద్ధమని ప్రభుత్వం అంటుంది. అప్పటికి తన పదవీ కాలం ముగిసిపోతుంది గనకనే నిమ్మగడ్డ తొందర పడుతున్నారని ప్రభుత్వ వర్గాల ఆరోపణ. విస్త్రుత ధర్మాసనం తీర్పు తర్వాత సుప్రీం కోర్టుకు వెళతామని ప్రకటించినా ఆ ఎస్‌ఎల్‌పి లోపాలతో వుండటంతో విచారణకు రాలేదు. సోమవారం విచారించినా ఖచ్చితంగా ప్రభుత్వ అనుకూల తీర్పు వస్తుందని లేదు. తిరస్కరణ జరగొచ్చు. లేదంటే మధ్యే మార్గంలో మాట్లాడుకుని వ్యాక్సినేషన్-ఎన్నికలు రెంటికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పొచ్చు. కనుక పంతాలు, పట్టింపులకు పోవడం కన్నా పట్టువిడుపులతో వాస్తవిక పరిష్కారం వెతకడం అందరి బాధ్యత. అత్యున్నత న్యాయస్థానం దిశానిర్దేశం చేస్తే అంతకన్నా కావలసింది లేదు. తర్వాత కూడా ఎన్నికల విధుల బహిష్కరణ అంటున్న ఉద్యోగ సంఘాల వైఖరి, పోలీసుల అభ్యర్థన సమస్యలు అలానే వుంటాయి. కలెక్టర్లతో సహా పలువురు ఉన్నతాధికారులపై ఎస్‌ఇసి వేటు వేయాలని ఆదేశించినా అమలు చేయలేమని ప్రభుత్వం తెలియజేసింది. ఇదో రాజ్యాంగ సంక్షోభమనీ, రాష్ట్రపతి పాలన కావాలని కూడా కొందరు మాట్లాడుతున్నారు. 324 అధికరణం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ అధికారాలు వుంటాయో 234 అధికరణం ప్రకారం ఎస్‌ఇసి అంతేనన్నది వారి వాదన. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం కుదరలేదు గనక ఎన్నికల అధికారుల నియామక ఉత్తర్వులు, బాధ్యతల విభజన వంటివి జరగాల్సే వుంది. అది జరిగి జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలైతేనే ఎన్నికల ప్రక్రియ మొదలైనట్టని మరో వాదన వినిపిస్తుంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రద్దు, ఏకగ్రీవ ఎంపికలు మరో వివాదంగా వున్నాయి. ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్ కార్యదర్శిపై ఎస్‌ఇసి బహిరంగ విమర్శలే చేశారు. ఆ కారణంగా 2019 ఓటర్ల జాబితా తీసుకోవలసి వచ్చింది గనక మూడున్నర లక్షల మంది యువ ఓటర్లు అవకాశం కోల్పోతున్నట్టు ఆయనే ప్రకటించారు. దీనిపైనా అభ్యంతరాలు రావచ్చు. మొత్తంపైన గతంలో వివాదాలు పరిష్కారమై విమర్శలు సరిదిద్దుకుని పూర్తి చేసుకోవలసిన స్థానిక ఎన్నికల ప్రక్రియ మరింత లోతైన వివాదాల్లో కూరుకుపోవడం విచారకరం. సుప్రీంకోర్టు నుంచి సరైన పరిష్కారం వస్తుందని, ప్రభుత్వం, ఎస్‌ఇసి, అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిద్దాం. రాజకీయ పార్టీలు దీన్ని సంకుచిత ప్రయోజనాలకు సాధనంగా చేసుకోరాదని కోరుకుందాం. ఏ వ్యవస్థ కూడా ఏకపక్షంగా వ్యవహరించేందుకు రాజ్యాంగంలో అవకాశం లేదు. వుండదు.
* తెలకపల్లి రవి










