ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి, అధికారాన్ని ఉపయోగించి బెదిరించడానికి పూనుకుంటోందని సిపిఎం రాష్ట్ర కమిటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్‌కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖను మీడియాకు విడుదల చేశారు. దీంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఎలా మానిటరింగ్ చేయాలి, వారిని నిరంతరం ఫాలో ఎలా అవ్వాలి అనే అంశాలతో అధికార వైసిపి స్థానిక నాయకత్వానికి రాసిన లేఖను కూడా జత చేశారు. ఒక్కో పోలింగ్‌బూత్‌కు 10 మంది చొప్పున పాయింట్ ఆఫ్ కాంటాక్ట్సు (పి.ఒ.సి.)గా స్థానిక వైసిపి నాయకులను పనిచేయడానికి నియమిస్తున్నారని తెలిపారు. వీరితో మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారని, పి.ఒ.సి కేంద్రంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రైవేటు టీచర్లను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలను సందర్శించి యాజమాన్యంతో కలిసి ఓటర్లను ప్రలోభపెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. రవాణా, లాజిస్టిక్స్, ఫలహారాలు అని చెప్పి ఓటర్లకు గాలం వేయడానికి 'కోడ్' భాషను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని పేర్కొన్నారు. దీన్ని నివారించేందుకు ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ''సిటిజన్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్'' నిర్వహించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. దీనిపై గతంలోనే లేఖ రాశామని, ఇంతవరకూ ఏ చర్యలు తీసుకున్నదీ తెలియలేదని లేఖలో గుర్తు చేశారు. శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు పిఒసిల పేరుతో అధికార దుర్వినియోగానికి పూనుకుంటున్నారని, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పోలింగ్ ముగింపు వరకు ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా తగుచర్యలు తీసుకోవాలనీ కోరారు.










