నా మది గదిలో ఓ మూలన మూలుగుతోంది
కుళ్లిన గత అనుభవ గింజల మూటలు
ఉత్సుకత ఏముందని తడమటానికి..
అన్నీ సత్తువుడిగిన తాలు, డొల్ల విత్తులే..
పేదరిక పురుగు పట్టి, బువ్వలేక బక్క చిక్కి..
గతానుభవమే గాండ్రించి గాయపర్చగా..
మాడిన పేగులే నా ఆత్మీయ నేస్తాలై..
నీ అంతు చూస్తానంటోంది అనంత ఆకలి !
గతమంతా మెతుకు వెతలే..
నిన్నలో చిక్కదనం మాయం..
కడు దరిద్రమయ్యింది ఖాయం..
కలల మబ్బుల్ని ప్రాధేయపడినా..
కురిపించవు స్వప్నంలోనైనా సిరులు
కన్నీటి వరదలో తడిసి ముద్దై..
నా ఉనికి ఉవ్వెత్తున దూదిపింజలా ఎగిసి..
మునిగే బతుకు నావ దారిద్య్ర సంద్రంలో !
నెమరేసుకునేందుకు ఏముంది..
నిన్న.. నేడు... రేపు.. మాపుల్లో..
అవి నాపై గురిపెట్టిన..
కాలపు కర్కష బాణాలు
దోబూచులాడే కపట ప్రేమికులు
రేపటి ఆశలకన్నీ చీడపీడలే..
జారుకుంటానంటోంది ప్రాణం
సహకరిస్తానంటోంది దేహం
ఆకలికి శాశ్వత పరిష్కారమే కదా !
డా: బుర్ర మధుసూధన్ రెడ్డి
99497 00037