May 08,2023 21:41

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరబిందో డైరెక్టరు పెనక శరత్‌ చంద్రారెడ్డికి పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరైంది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తన భార్య అనారోగ్య కారణాల దృష్ట్యా శరత్‌ చంద్రారెడ్డి విజ్ఞప్తి మేరకు ఢిల్లీ హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శరత్‌ చంద్రారెడ్డికి ఢిల్లీ రౌస్‌ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తీహార్‌ జైలులో ఉన్న శరత్‌ చంద్రారెడ్డి.. తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని, అందుకు ఆరు వారాలు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకె నాగ్‌ పాల్‌ దీనిపై విచారణ చేపట్టి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం బెయిల్‌ కోరుతూ శరత్‌ చంద్రారెడ్డి జనవరి ఆఖరి వారంలో పిటిషన్‌ దాఖలు చేయగా, నాడు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా శరత్‌ చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేసింది.