వయసు మీదపడేకొద్దీ శరీరంలోని అవయవాల పనితీరులోనూ మార్పులు వస్తుంటాయి. అందులో ప్రధానమైంది జీర్ణవ్యవస్థ. సులువుగా అరుగుతూ.. శరీరానికి తగిన శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. వీటితోపాటుగా పెద్ద వయసుల వారిలో అత్యంత అవసరమైన ఆహారంపై దృష్టిపెట్టాలి.
* వయసు మీదపడిన వారిలో ఎదురయ్యే సమస్య ఎముకలు గుళ్లగా మారడం. దీనిని అధిగమించాలంటే.. తక్కువ కొవ్వు గల పాల పదార్థాలు, ఆకు కూరలు, విటమిన్ బీ12, పీచు, క్యాల్షియం, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాలను రోజు ఆహారంలో జత చేసుకోవాలి.
* రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే, సీజనల్ పండ్లు, కూరగాయల్ని తప్పక తీసుకోవాలి. తినలేనివారు.. జ్యూస్ రూపాల్లోనైనా తీసుకోవాలి.
* పెద్దవారు సాధ్యమైనంత వరకు నూనె పదార్థాలు, వేపుళ్లు తీసుకోకపోవడమే శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి, అదీ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
* బిపి, షుగర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు.. రాగిజావ క్రమం తప్పకుండా తాగాలి. మధ్యాహ్న ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం తీసుకుంటే మంచిది. రాత్రులు తేలికపాటి అల్పాహారాన్ని తీసుకోవాలి.
*ఆహార నియమాలతోపాటుగా.. చిన్నపాటి దూరం వాకింగ్ చేయాలి. మీకు ఆసక్తి ఉన్న అభిరుచిని ఆస్వాదిస్తూ.. మానసికంగా తగినంత విశ్రాంతిని జోడించి ఆరోగ్యంగా జీవనం సాగేలా చూసుకోవాలి.