Oct 14,2023 21:52

లేదు... అనారోగ్య సమస్యలు ఉన్నాయి : లోకేష్‌
నిబంధన ప్రకారమే నడుచుకుంటున్నాం : జైళ్ల శాఖ డిఐజి
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే చల్లని వాతావరణం అవసరమని జైలు అధికారులకు సూచించామని డాక్టర్‌ శివకుమార్‌ తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైలు అధికారుల విజ్ఞప్తితో డాక్టర్‌ శివకుమార్‌ నేతృత్వంలో ఐదుగురు వైద్యుల బృందం చంద్రబాబుకు శనివారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం జైలు కాన్ఫరెన్స్‌ హాలులో జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ శివకుమార్‌ వివరాలను వెల్లడించారు. చంద్రబాబుకు సుగర్‌, బిపి, ఊపిరితుత్తులు, టెంపరేచర్‌ తదితర పరీక్షలన్నీ నార్మల్‌గా ఉన్నట్టు తెలిపారు. కేవలం చర్మ సంబంధిత సమస్య మాత్రమే ఉందని చెప్పారు. ఆయన తీసుకుంటున్న ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని చెప్పారు. ఎండవేడిమి కారణంగా డీహైడ్రేషన్‌ సహజమని, చెమట ఎక్కువగా పట్టడడంతో రాషెస్‌ వస్తుంటాయని తెలిపారు. చర్మ సంబంధిత సమస్యకు ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని చెప్పారు. చంద్రబాబుతో తమ బృందం మాట్లాడిందని, ఆయన యాక్టివ్‌గా సమాధానాలు ఇచ్చారని తెలిపారు. చర్మ సంబంధిత సమస్యపై గత రిపోర్టుల గురించి తమకు తెలియదని, అవసరమైతే చంద్రబాబు పర్సనల్‌ వైద్యుని సూచనలు తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబుకు ఎటువంటి స్టెరాయిడ్స్‌ ఇవ్వడమూ లేదని తెలిపారు. చంద్రబాబును ప్రస్తుతం ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని తెలిపారు. జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌ మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యం పట్ల తమ వైద్య బృందం ప్రతిరోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని చెప్పారు. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తడంతో తమ వైద్యులు పరీక్షించి వైద్య సహాయం అందజేస్తున్నప్పటికీ సెకండ్‌ ఒపీనియన్‌ కోసం రాజమహేంద్రవరం జిజిహెచ్‌ను కోరామని తెలిపారు. 12వ తేదీ నుంచి నేటి వరకూ మూడు దశలుగా వైద్య బృందం పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. ఆయన ఆరోగ్యంపై అపోహలద్దన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై పూర్తి రిపోర్టును ఆయన అనుమతితో అడ్వకేట్లకు అందజేస్తామని, నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని చెప్పారు.

  • మాజీ సిఎం పట్ల ఇంత దారుణమా? : లోకేష్‌

ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌ను నారా లోకేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు అస్వస్థత రీత్యా ప్రత్యేక సదుపాయాలు అవసరమని వైద్యులు సూచించినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ములాఖత్‌లో ఆయనను నిలదీశారు. తన తల్లి నారా భువనేశ్వరి, టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో కలిసి చంద్రబాబుతో లోకేష్‌ సోమవారం ములాఖత్‌ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకూ ములాఖత్‌ జరిగింది. ఈ సందర్భంగా జైలు అధికారితో లోకేష్‌ మాట్లాడారు. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు ఉన్నట్టు స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. జైలు ఉన్నతాధికారి తీరు పట్ల లోకేష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో ఉక్కపోత గురించి చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. ములాఖత్‌ అనంతరం మీడియాతో మాట్లాడకుండా లోకేష్‌, భువనేశ్వరి వెళ్లిపోయారు. కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు.