
''పదుగురాడు మాట పాటియై ధర జెల్లు/ఒక్కడాడు మాట ఎక్కదెందు?'' అన్నాడు వేమన. సమాజంలో ఎక్కువమందికి గల అభిప్రాయానికే ఎక్కువ విలువ ఉంటుంది. అది చెల్లుబాటవుతుంది. మరి ఎక్కువమంది కావాలనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రచారం చేస్తే ఏమవుతుంది? అది తప్పుడిది అయినప్పటికీ, తాత్కాలికంగా అయినా సరే, చెలామణి అవుతుంది. దీనికి ఉదాహరణగా ''నల్లమేక - బ్రహ్మణుడు'' కథ ఉండనే ఉంది. అయితే, సత్యం వెల్లడయ్యేంతవరకే అబద్ధాలు వర్థిల్లుతాయి.
యజ్ఞం జరిపించిన బ్రాహ్మణుడికి ఒక నల్ల మేకపిల్ల కానుకగా వస్తుంది. దానిని భుజాన వేసుకొని ఇంటికి బయల్దేరతాడు. ఆ మేక పిల్లను ఎలాగైనా దొంగిలించాలని ఓ నలుగురు దొంగలు అనుకుంటారు. అయితే, ఆ బ్రహ్మణుడిని కొట్టో, కన్నుగప్పో కాకుండా తెలివిగా తస్కరించాలని అనుకున్నారు. ఆ పథకంలో భాగంగా మొదటి దొంగ ఎదురై, ''పంతులుగారూ! కుక్కను మోసుకెళ్తున్నారేమిటి?'' అని ఆశ్చర్యంగా అడిగాడు. ''కళ్లు కనపడడం లేదా? అది కుక్క కాదు, మేకపిల్ల'' అన్నాడు బ్రాహ్మణుడు. కొంతదూరం వెళ్లాక రెండో దొంగ ఎదురై- ''అయ్యో, కుక్కను మోస్తున్నారా?'' అనడిగాడు. ''కాదు కాదు, మేకపిల్ల'' అన్నాడు బ్రాహ్మణుడు. ఎందుకైనా మంచిదని మేకపిల్లను భుజాల మీంచి దించి, నడిపించటం మొదలెట్టాడు. మరికొంత దూరం వెళ్లాక మూడో దొంగ ఎదురై ... మిగతా ఇద్దరిలాగానే ఆశ్చర్యపోతూ అడిగాడు. బ్రాహ్మణుడికి అనుమానం మొదలైంది. ''మేకపిల్ల కాదా ఇది?'' అనడిగాడు. ''ఛ .. భలేవారే.. మిమ్మల్ని ఎవరో మోసం చేశారు!'' అన్నాడు దొంగ. ఇంకొంత దూరం వెళ్లాక నాలుగో దొంగ ఎదురై - ''కుక్కపిల్లను వెంటబెట్టుకొని వస్తున్నారే పంతులు గారూ..?'' అన్నాడు. ఇక బ్రాహ్మణుడు అది మేకపిల్ల కాదు, కుక్కే అని నిర్ధారణకు వచ్చేశాడు. ''ఛ .. ఛ'' అని అక్కడే దానిని విడిచిపెట్టి - వెళ్లిపోయాడు. దొంగలు దానిని ఎంచక్కా ఎత్తుకుపోయారు. మన దేశంలో ఇప్పుడు ఇలాంటి కథే నడుస్తోంది. నిజాలను కప్పెట్టి, అబద్ధాలకు రెక్కలు తొడుగుతున్న కాలం సాగుతోంది.
పనిగట్టుకొని ప్రచారం!
సంఘటన ఆధారంగా ఇచ్చి పుచ్చుకునేది సమాచారం. ఆ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా విస్తరించటం ప్రచారం. చాలాకాలం వరకూ మన సమాజానికి ఇవి రెండే పరిచయం. సంఘటన లేకుండా, జరక్కుండా సమాచారం ఉండదనేది మన అభిప్రాయం. కానీ, సంఘటనతో సంబంధం లేకుండానూ కొన్ని ప్రచారాలు సాగుతూ ఉంటాయి. వాటినే వదంతులు అంటాం. సాధారణంగా ఈ వదంతులకు జీవితకాలం తక్కువ. అసలు నిజం ఏమిటో తేలిపోయాక- వదంతి చచ్చిపోతుంది. దానిని నమ్మినవాళ్లు, ఏరికోరి ప్రచారం చేసినవాళ్లూ నాలుక కరుచుకుంటారు. చెల్లుబాటు కాని సమాచారాన్ని మోసినందుకు నవ్వుల పాలవుతారు. ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లయితే- వదంతిని ప్రచారం చేసినందుకు నొచ్చుకుంటారు. లెంపలు వేసుకుంటారు. ఇదంతా సమాచారవ్యవస్థ ఆధునిక సాంకేతిక రూపం దాల్చక ముందునాటి సంగతి! ఇప్పుడు పరిస్థితి మారింది. వదంతినే వాస్తవ విషయంగా ప్రచారం చేయటం ఒక ఉద్యోగంగా మారింది. ఉధృతంగా సాగుతోంది. దీనికి ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు వేదికలు అవుతున్నాయి.
సైన్సు ఆధారంగా నిర్మితమైన అత్యాధునిక సమాచార వ్యవస్థలు ఇప్పుడు ఆ సైన్సుకే భిన్నంగా వినియోగితమవుతున్నాయి. ఇక్కడ సైన్సంటే సత్యాన్వేషణ. కార్యాకారణ సంబంధాన్ని కచ్చితంగా కలిగి ఉంటే వైజ్ఞానిక ప్రక్రియ. కానీ, అబద్ధాలూ, అతిశయోక్తులూ, కుటిల కుయుక్తులూ కార్యాకారణ సంబంధాన్ని ఖాతరు చేయవు. సత్యం ఆధారంగా నడవవు. సెంటిమెంట్లూ, సంచలనాల ఆధారంగా అవి పురుడు పోసుకుంటాయి, విస్తరిస్తాయి. విద్వేషాలను, విధ్వంసాలను సృష్టిస్తాయి. భావోద్వేగ పునాదుల మీద మనుషులను విభజిస్తాయి. మనసుల మీద విష బీజాలను నాటుతాయి. ప్రపంచం నలుమూలలా విస్తరించిన ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటివి సమాచార వ్యాప్తికి సమాన స్వేచ్ఛను ఇస్తున్నట్టు పైకి కనిపిస్తూనే - ఉద్దేశపూర్వకంగా రాజకీయ, వ్యాపార అజెండాలను మోస్తున్నాయి. చాలాకాలంగా వస్తున్న విమర్శలూ, ఇటీవల సంఘటనలూ ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి.
భావోద్వేగాలతో బలమైన క్రీడ
ఏదైనా ఒక రాజకీయ పార్టీ బలపడాలి అంటే - అది ప్రజల సమస్యలపై, ప్రజల మధ్య పనిచేయటం ఒక సాంప్రదాయ పద్ధతి. అలా పనిచేయడం ద్వారా ఏర్పర్చుకున్న పునాది మీదనే అది పెరుగుతుంది. ఇతరత్రా రాజకీయ పరిణామాలు దానికి కలిసి వస్తే ఎన్నికల్లో రాణిస్తుంది. ఇలాంటి పద్ధతికి భిన్నంగా కేవలం ప్రచార రంగాన్ని అస్త్రంగా చేసుకొని, అడుగులు వేస్తున్న పార్టీ బిజెపి.
మన దేశంలో సోషల్ మీడియా తొలి అడుగులు వేస్తున్న కాలంలోనే - బిజెపి దాంతో అంటకాగటం మొదలుపెట్టింది. భావోద్వేగాల మీద ప్రజలను ఓట్లుగా మార్చుకునే పార్టీకి ప్రజల దైనందిన సమస్యల కన్నా - సెంటిమెంట్లే కీలకం. సెంటిమెంట్లకు విశ్వాసం తప్ప నిజానిజాలతో సంబంధం ఉండదు. కులం, మతం, దైవ విశ్వాసాలూ, గత చరిత్రల ఘనతలూ వంటి వాటిని అది ఆసరాగా చేసుకుంటుంది. వాటి గురించైనా ఉన్నది ఉన్నట్టు చెబితే ప్రజల ఉద్వేగాల్లో మార్పుండదు. నిజ జీవిత సమస్యలూ, అవసరాలే వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాంటి స్థితిని దాటించి, నిజావసరాలకు మించిన భావోద్వేగాలను రగిలించటం ఒక ఎత్తుగడగా బిజెపి తరచూ భావిస్తూ ఉంటుంది. దానికి సోషల్ మీడియాను ఒక వేదికగా వాడుకుంటోంది. దేశంలో ఇంకే పార్టీకి లేనివిధంగా భారీ ఐటి సెల్ బిజెపికి ఉంది. ''అబద్ధాలైనా ప్రచారం చేయండి. ప్రజలను కదిలించండి'' అని ఆ పార్టీ ముఖ్య నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ విభాగానికి బహిరంగంగానే పిలుపునిచ్చాడు. ఈ పిలుపును అందుకొని వేలాదిమంది నిరంతరంగా సమాచారాన్ని వండి వార్చుతున్నారు. సతీసహగమనం వంటి దురాచారాలను సైతం సమర్ధించటం, ముస్లిములపై విద్వేషాలను రగిలించటం, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం, ప్రతిపక్షాలపై అక్కసు వెల్లగక్కటం, బిజెపి ప్రతి చర్యనూ విపరీతంగా ఆకాశానికెత్తటం, బిజెపిని విమర్శించే పోస్టులపై మూకుమ్మడి దాడి చేయడం, బూతులు తిట్టటం, వ్యక్తిత్వాన్ని కించపర్చటం ... ఈ కాషాయ దళ ప్రచార విభాగం పని. ఈ విషయాల్లో 'పనితనాన్ని' బట్టి జీతభత్యాలు ఉంటాయి. ఈ బృందాలకు నాయకత్వం వహిస్తున్నవారు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లతో నిత్య సత్సంబంధాలు కలిగి ఉంటారు. వారు చేస్తున్న విద్వేష, అసత్య, అనుకూల ప్రచారానికి ఎక్కడా ఆటంకం కలగకుండా మేనేజ్ చేస్తారు. ఈ ప్రచారంలో ఆరితేరిన కమలాకరులు ప్రసిద్ధ సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులుగానూ చేరతారు. ఇదంతా వ్యూహాత్మకంగా సాగుతోంది. దాదాపు పదేళ్ల నుంచి ఇది పకడ్బందీగా నడుస్తోంది.
విస్తృతంగా మోడీ అనుకూల ప్రచారం
మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటికే సోషల్ మీడియో బిజెపి సేవలో తరిస్తోంది. గుజరాత్ నరమేధంతో ప్రతిష్ట కోల్పోయిన మోడీని ఒక గొప్ప నాయకుడిగా చూపించే బాధ్యతను తలకెత్తుకుంది. గుజరాత్ మోడల్ చాలా గొప్పదంటూ ఇటు సాంప్రదాయ మీడియా, అటు సోషల్ మీడియా ఏక పల్లవి ఎత్తుకోవటానికి చాలా 'మేనేజ్‌మెంటు' జరిగింది. దీంతో, ఎన్నికలకు ముందే మోడీ గొప్ప నాయకుడిగా అవతరించాడు. ఫేస్‌బుక్ భారతదేశంలో అడుగిడి, విస్తరిస్తున్న సమయం అది. అప్పటికే అమెరికాలో ఒబామా గెలిచి, తొలి ఫేస్‌బుక్ ప్రచార అధ్యక్షుడిగా పేరొందాడు. దానిని ఇండియాలో బిజెపి అందిపుచ్చుకొంది. ఆ పార్టీ అనుకూల బృందాలు ఫేస్‌బుక్ నిర్వహణలో కీలకపాత్ర వహించటం మొదలుపెట్టాయి. 2014 ఎన్నికల్లో బిజెపి గెలిచాక - ఫేస్‌బుక్ ఉన్నతోద్యోగిగా ఉన్న అంఖీదాస్ రాసిన ఒక వ్యాసమే కాషాయదళంతో ఆ సంస్థకు ఉన్న బలమైన బంధానికి నిదర్శనం. ''ఫేస్‌బుక్ ప్రచారం మోడీని గెలిపించింది!'' అని ఆమె సగర్వంగా ఆ వ్యాసంలో పేర్కొంది. ప్రధాని హోదాలో మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించారు.. జుకెన్‌బర్గుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తరువాత డిజిటల్ ఇండియా ప్రచారం హోరెత్తింది. దానిలో ఫేస్‌బుక్‌కు ప్రధాన భాగస్వామ్యం ఇవ్వటానికీ ప్రయత్నం జరిగింది. దానికి వ్యతిరేకంగా అనేకమంది ఉద్యమించటంతో ఆగిపోయింది.
ఈ ధోరణిపై ఫేస్‌బుక్ ఉద్యోగుల్లోనే వ్యతిరేకత ఉంది. ఆగస్టు 14న వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన సుదీర్ఘ వ్యాసంలో ఇలాంటి అనేక అంశాలను ఏకరువు పెట్టింది. బిజెపి అనుకూల విద్వేష ప్రచారాన్ని నియంత్రించకపోవడంపై కొంతమంది ఉద్యోగులు ఆసియా జోనల్ హెడ్ అంఖీదాస్‌ని ప్రశ్నించారు. ''ఇక్కడ బిజెపితో పెట్టుకోవటం మన సంస్థకు నష్టం'' అని ఆమె వారికి సర్ది చెప్పింది. అంఖీదాస్‌కు వ్యక్తిగతంగా బిజెపితో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆమె సోదరి ఎబివిపిలో పనిచేసింది. అంఖీదాస్ వ్యూహా త్మకంగానే ఫేస్‌బుక్‌లో పనిచేస్తుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వాట్సాప్ కూడా ఫేస్‌బుక్ యాజమాన్యంలోనే ఉంది. అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో జరిగిన మూకహత్యల్లో వాట్సాప్ ద్వారా జరిగిన తప్పుడు ప్రచారమే కారణం. ఢిల్లీ అల్లర్లలోనూ ఫేస్‌బుక్ విద్వేష ప్రచారపాత్రపై చాలా అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీ శాసనసభా కమిటీ ఫేస్‌బుక్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది కూడా!
చైతన్యానికి వేదికలవ్వాలి!
ఇన్ని విద్వేష విష వ్యూహాలకు వేదికగా మారిన సోషల్ మీడియా సామాన్యులకు ఏవిధంగా ఉపయోగపడుతుంది? ఉద్దేశపూర్వక రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకు ఫేస్‌బుక్ వేదికగా మారటం కచ్చితంగా అప్రజాస్వామికం. దానిపై విచారణ జరిపి, నిగ్గు తేల్చాలి. ప్రజాస్వామ్యవాదులు గట్టిగా పోరాడాలి. అదే సమయంలో ఆ వేదికలను ప్రజాస్వామ్య పరిరక్షణకు, మత సామరస్యానికి వాడుకోవాలి. ఈతరాన్ని ఆకట్టుకునే ఆకర్షణీయ పద్ధతుల్లో క్లుప్తంగా, సూటిగా ఉండే వ్యాఖ్యలూ, విశ్లేషణలతో పోస్టులు రూపొందించాలి.
దేశంలో దాదాపు 40 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ వినియోగిస్తున్న వారి సంఖ్య దాదాపు ఇంతే ఉంటుంది. ఒక సమాచారం అత్యంత వేగంగా, సులభంగా, ఖర్చు లేకుండా చేరిపోయే సాధనాలు ఇవి. ప్రజలను వివిధ పేర్లతో రెచ్చగొట్టి, విభజించే వ్యూహాలకు అవి వాహకాలు కాకుండా చూడాలి. అదే తరుణంలో వివిధ అంశాలపై ప్రజలు సంఘటితమయ్యే సమున్నత లక్ష్యానికి వాటిని వేదికలు చేయాలి. సామాజిక వేదికలు కూడా పదునైన కత్తి లాంటివే! దాంతో, శస్త్రచికిత్స చేసి ప్రాణం పోయొచ్చు! విచక్షణా రహితంగా వ్యవహరించి చావులకూ కారణం కావొచ్చు. మంచివాడి చేతి ఆయుధం మంచిపనికి దోహదపడుతుంది. నేరుగా ప్రజలతో కలిసి, కదిలిస్తూనే - సామాజిక మాధ్యమాల్లోనూ చైతన్యాన్ని పండించాలి మరి!
ప్రచారమే పరమార్థం
ఒకసారి మనం గుర్తు చేసుకుంటే - మోడీ గొప్ప పనులన్నీ మీడియా ఆధారంగానే ఉంటాయి. దేశంలోని ఏ సమస్యకు గొప్ప పరిష్కారం లభించింది అన్నదాని కన్నా - ఆయన ట్విట్టర్ అనుచరుల సంఖ్య ఎలా పెరిగింది. ఆదరణ ఏ స్థాయికి చేరింది అన్నదే ఎక్కువసార్లు గొప్ప వార్తలుగా చెలామణి అయ్యాయి. తాజాగా నెమళ్లకు ఆహారం తినిపించటం.. ఒక్కసారే రెండు పుస్తకాలు చదువుతూ లాప్‌టాప్ చూడడం.. వర్షపు వీడియో వంటివి విస్తృత ప్రచారం పొందాయి. మంచుగుహలో ధ్యానం ఫొటో విస్తారంగా వైరలైంది. చెన్నై బీచ్‌లో చెత్త సేకరిస్తున్న ప్రధాని ఫొటో, వీడియో గొప్పగా సాగాయి. ముందుగానే ప్రచారం ఆశించి, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా అమర్చబడతాయని మనకు ఇట్టే అర్థమవుతుంది. సాదాసీదాగా సాగిపోవాల్సిన ఇలాంటి సహజ చర్యలకు పనిగట్టుకొని ఫొటోలు తీయించటం ఎందుకు? వాటిని విస్తృతంగా సోషల్ మీడియాలో వదలటం ఎందుకు? సోషల్ మీడియాను ఒక ప్రచార వేదికగా ఉపయోగించుకుంటున్న బిజెపికీ, మోడీకి మాత్రమే తెలిసిన వ్యూహం అది!
ఏ పనులకు ఏ విధంగా ప్రచారం పొందుతారనేది ఆయా పార్టీల, వ్యక్తుల ఇష్టం. కానీ, విద్వేషాన్ని ఒక ప్రచార వ్యూహంగా ఎంచుకోవటమే పెద్ద ప్రమాదకర ధోరణి. బిజెపి అనుకూలుర ప్రచారం చూస్తే.. దానిలో మత విద్వేషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశభక్తికి వాళ్లే నిర్వచనం చెబుతారు. బిజెపిని వ్యతిరేకించినా, విమర్శించినా, భిన్నమైన అభిప్రాయం చెప్పినా - వెంటనే 'దేశద్రోహి' ముద్ర వేసేస్తారు. చరిత్రను వక్రీకరించి పదే పదే వల్లె వేస్తారు. బిజెపిని ఏమాత్రం విమర్శించినా - ''మీరు పాకిస్తాన్ పొండి'' అని రౌడీయిజం ప్రదర్శిస్తారు. సంస్క ృతి, ధర్మం అంటూనే పచ్చిబూతులు తిడతారు. ''చంపేస్తాం'' అని బహిరంగ హెచ్చరికలు చేస్తారు. తమకు ఇష్టం లేని వ్యక్తుల పట్ల విపరీత విద్వేషం కక్కుతారు. ఇటీవల సిబిఐ మాజీ అధికారి చేసిన ట్వీట్ దీనికి బలమైన ఉదాహరణ. అతడు ఆ మధ్యనే బిజెపిలో చేరాడు. స్వామి అగ్నివేశ్ మరణాన్ని ఆయన హర్షించాడు. 'యుముడు ఇంత ఆలస్యం ఎందుకు చేశాడా?!' అని వ్యాఖ్యానిస్తూ బాధపడ్డాడు కూడా. ఆ స్థాయి ఉన్నతాధికారి ఇంత దిగజారి మాట్లాడతాడా? అని చాలామంది ఆశ్చర్యపడ్డారు. అదీ, బిజెపి భావజాల మహిమ. ఆ పార్టీ మంత్రులూ, ఎంపీలూ, ఎమ్మెల్యేలూ ఇంతకుమించి విద్వేషం మాట్లాడారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అనేక వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అయినా సరే, బిజెపి వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోదు. ఎందుకంటే- ప్రజలను ఆవిధంగా రెచ్చగొట్టడం తమకు లాభిస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. చిత్రం ఏమిటంటే- ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ కూడా ఆ వ్యాఖ్యలను నియంత్రించవు, తొలగించవు. విద్వేష వ్యాఖ్యలు, వీడియోలు ఎక్కువగా సర్క్యులేట్ అవుతాయి. అత్యధికమంది చూస్తారు. అది వారికి కూడా లాభసాటి. ఈ విధంగా సమాజానికి హాని కలిగించే భావోద్వేగాల నాటకం బిజెపి, సోషల్ మీడియాల లబ్ధికి ఉపయోగ పడుతుంది. ఇది సమాజానికి అత్యంత నష్టదాయకం!
ఫేస్‌బుక్ పక్షపాత వైఖరి
ఫేస్‌బుక్ తాము చాలా గొప్ప నియంత్రణా సూత్రాలు పాటిస్తున్నట్టు పైకి చెబుతుంది. అసత్యాలకు, విద్వేషాలకు, అశ్లీలానికి తావివ్వం అని అంటోంది. కానీ, ఆచరణ అలా లేదు. పైగా తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్టు సులభంగానే కనిపిస్తోంది. బిజెపి అనుకూల విద్వేష ప్రసంగాలూ, పోస్టులూ సోషల్ మీడియా నిండా పుంఖాను పుంఖాలుగా కనిపిస్తాయి. ఫేస్‌బుక్ పైకి చెబుతున్న సూత్రాలను పాటించి ఉంటే- వాటిని ఇంకా ఎందుకు తొలగించలేదు? ఇతరులు బిజెపితో విభేదిస్తూ పెట్టే పోస్టులు తరచూ శల్య పరీక్షకు గురవుతున్నాయి. ఏవో ఫిర్యాదులు వచ్చాయన్న పేరిట వాటిని ఆపివేయటం, తొలగించటం, మరిన్ని వివరణలు కోరటం నిరంతరంగా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక పోస్టులు పెడితే - ఫేస్‌బుక్ అకౌంట్లు తరచూ డీయాక్టివేట్ అయిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? బిజెపి అనుకూల ప్రాబల్యం వల్లే ఇలా జరుగుతుందన్నది వాస్తవం. జీతాలతో పెంచి, పోషించబడుతున్న బిజెపి ఐటి బృందాలు తమకు వ్యతిరేక పోస్టులపై వరసగా ఫిర్యాదులు చేస్తాయి. ఆ ఫిర్యాదులపై ఫేస్‌బుక్‌లో ఉన్న బిజెపి అనుకూల బృందాలు వేగంగా స్పందిస్తాయి. విద్వేష పోస్టులపై ఇతరులు చేసే ఫిర్యాదులను మాత్రం అంతగా పట్టించుకోవు.
- సత్యాజీ
94900 99167