ప్రజాశక్తి-పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో పెద్దాపురం, సామర్లకోట రెండు పట్టణాలు, రెండు మండలాల పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారయిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం స్థానిక సుధా కాలనీలోని టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న వారు లేరన్నారు. ప్రజల ఆహ్లాదం కోసం పెద్దాపురం పట్టణంలో శతాబ్ది పార్కు నిర్మించామని, సెలవు రోజుల్లో సుమారు పదివేల మంది పార్కును సందర్శించి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆనందంగా గడిపే వారన్నారు. అటువంటి ఆహ్లాదకరమైన పార్కును నిర్వహించలేక తాళాలు వేయడం దురదృష్టకరమన్నారు. స్వచ్ఛమైన మంచి నీటిని అందించవలసిన బాధ్యత కూడా అధికారులు సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. సామర్లకోటలో మంచినీటి సరఫరా అధ్వానంగా తయారయిందన్నారు. ఫిల్టర్ చేయకుండా బురదతో కూడిన పసరు నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. రెండు మున్సిపల్ పట్టణాలు, గ్రామాల్లో డ్రైన్లు అష్టవ్యవస్థంగా తయారయ్యాయన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్దాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంది సత్యనారాయణ, తూతిక రాజు, టిడిపి మండల అధ్యక్షులు కొత్తిం వెంకట శ్రీనివాసరావు(కోటి), కందుల విశ్వేశ్వరరావు, నూనె రామారావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.










