Oct 01,2023 15:17
  • ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి 

ప్రజాశక్తి - వేంపల్లె  : పులివెందుల నియోజకవర్గంలో ఇసుక అక్రమార్కులు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నదని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లె, చక్రాయపేట పాపాగ్ని  నది నుంచి వందలాది లారీలతో ఇసుకను  తరలించడం జరుగుతున్నదని చెప్పారు. జెపి సంస్థలకు అనుమతులు లేవని అధికారులు చెప్పుతున్న పాపాగ్ని నదికి మాత్రం గర్భ సౌఖాన్ని మిగల్చడం లేదన్నారు. ఇసుక తరలింపుతో భవిష్యత్తులో రైతాంగానికి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఏ ఒక్క అధికారి కూడా ఇసుక స్మగ్లర్లు పైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. ప్రతిరోజు 200 నుంచి 300 లారీలతో ఒక్కొక్క టిప్పర్ ఇసుక 20 వేల నుంచి 30 వేలకు విక్రయించుకొంటున్నట్లు ఆరోపించారు. గత రెండు నెలలుగా పాపాగ్ని నది నుంచి 50 కోట్ల రూపాయలు ఇసుకను అధికార పార్టీ నాయకులు అండదండలతో స్మగ్లింగ్ చేయడం జరిగిందని చెప్పారు. ఆఖరికి పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా  ప్రశ్నిస్తే 9 మంది విలేకరుల పైన దౌర్జన్యంగా కేసులు బనాయించడం దౌర్భాగ్యం అన్నారు. 50 కోట్ల రూపాయల ఇసుక రెండు నెలల్లో అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి, స్మగ్లర్లు జేబుల్లోకి వెళ్ళిందని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకోకపోతే  ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్పీని కలిసి పాపాఘ్ని గర్భశోకాన్ని ఆపి ఇసుకను తరలించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. అలాగే గండిక్షేత్రంలో జరుగుతున్న అవకతవకలకు అంతులేకుండా పోతుందని తెలిపారు. గండి ఆలయ సహయ కమిషనర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. అధికార పార్టీ కార్యకర్తగా గండి ఆలయ అధికారి వ్యవహరించడం దారుణమన్నారు. గండి నిత్యన్నదాన కార్యక్రమానికి లక్షలాది రూపాయలు విరాళాలు ఇస్తుంటే దానికి లెక్కచారం లేకుండా పోయిందని చెప్పారు. శ్రావణమాసం సందర్భంగా భక్తులకు అన్నం పెట్టే పరిస్థితుల్లో లేక పోవడం దురదృష్టకరం అన్నారు. అర్హత లేకున్నా గండి ఆలయ సహయ కమిషనర్ గా ముకుందారెడ్డిని నియమించడం జరిగిందని ఆరోపించారు. గండి ఆలయ అధికారిపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. మాజీ సిఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. చెయ్యని తప్పుకు, చేయని స్కాంకు రాజకీయపరమైన దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీని కథావికలం చేయవచ్చని సిఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెప్పారు. లోకేష్ ను కూడా అరెస్టు చేయాలని కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై కుట్రలు చేసి అరెస్టు చేసిన, మరికొందరిని అరెస్టు చేసిన ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని సిఎం జగన్ అపలేడని చెప్పారు. విలేకరుల సమావేశంలో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, పట్టణ అధ్యక్షుడు ఆర్ వి రమేష్, శేషారెడ్డి, మహమ్మద్ ఇనాయతుల్లా, మడక శ్రీనివాసులు, పోతిరెడ్డి శివ, వేమా నారాయణ, గొగుల మల్లికార్జునతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.