
'చరిత్రలో ఎన్నో కథలు కాగితాల మీద కనపడవు. ఎందుకంటే, అవి స్త్రీల శరీరాల మీద, మనసు మీద రాయబడతాయి' అంటారు పంజాబ్ తొలి మహిళా రచయిత్రి అమృతా ప్రీతం. ఆడపిల్లగా పుట్టినందుకు వివిధ దశలన్నీ కలిపి 100 మార్కులు వేసే పురుషాధిక్య సమాజం మనది. తరతరాలుగా స్త్రీల శరీరాలు, మనసులు ఇలా వుండాలి... అలా వుండాలి అంటూ తెరలు కట్టి, హద్దులు గీసి...వారి స్వేచ్ఛకు, హక్కులకు కట్టుబాట్లనే శృంఖలాలు వేసింది. మరోవైపు స్త్రీలను మార్కెట్‌లో వస్తువును చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వాణిజ్య ప్రకటనల్లో మహిళ శరీరాన్ని కార్పొరేట్లు వస్తువుగా మార్చారు. అదే సమయంలో స్త్రీ వ్యక్తిత్వాన్ని, సృజనాత్మకతను గుర్తించే మానవీయతకు పురుషాధిక్యత అడ్డుపడుతూనే వుంటుంది. 'స్త్రీ శక్తిని, సృజనాత్మకతను ఒప్పుకోని పురుషుడు, తన అంతరాత్మని మోసం చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదు. భారతీయ పురుషుడు ఇప్పటికీ సాంప్రదాయక స్త్రీలను చూడ్డానికి మాత్రమే అలవాటు పడి ఉన్నాడు. గొప్ప వ్యక్తిత్వమున్న స్రీలను గౌరవించడం అనే సౌజన్యం ఈ పురుషులకు రాదు' అంటారు అమృతా ప్రీతం.
'ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుంది' అంటాడు గురజాడ. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న మహిళకు మనువాద భావజాలం, కట్టుబాట్ల సంకెళ్లు అడుగడుగునా అడ్డుపడుతూనే వున్నాయి. తను ధరించే దుస్తుల నుంచి నుదుటి బొట్టు వరకూ అన్నిటినీ కొన్ని శక్తులు శాసిస్తున్నాయి. విజ్ఞాన నిలయాలైన విశ్వవిద్యాలయాల్లో సైతం మహిళా టీచర్లు, విద్యార్థినులు జీన్స్ ధరించకూడదంటూ ఆంక్షలు. మరో కాలేజీలో హిజాబ్‌లు ధరించరాదంటూ హుకుం. అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్న వారికి సైతం వాళ్ల డ్రెస్ కోడ్‌పై కించపరిచే వ్యాఖ్యలు తప్పడంలేదు. ఇటీవలి కాలంలో కట్టుబాట్ల చట్రంలో బంధించే ప్రయత్నం మరింత పెరిగింది. చివరకు ఒక మహిళ గర్భం ధరించే హక్కు కూడా తన చేతిలో లేకుండా పోయింది. తనకు ఇష్టం లేకుండా తల్లి కమ్మని నిర్బంధించే హక్కు, అధికారం ఎవరికీ లేవు. అది ఆ మహిళ నిర్ణయించుకోవాల్సిన విషయం. పూర్తిగా ఆమె హక్కు. అంతేకాదు మహిళల నుదురు చూసి అవమానించడం పరిపాటిగా మారింది. చదువుకుని, ఆధునిక ప్రపంచంలో తిరుగుతూ, ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళలకు సైతం ఇలాంటి చేదు అనుభవాలు, పరాభవాలు తప్పడంలేదు. తాజాగా... మహారాష్ట్ర బిజెపి నేత శంభాజీ భిడే ఓ జర్నలిస్టు నుదుట బొట్టు లేదని ఆమెతో మాట్లాడానికి నిరాకరించాడు. 'నన్ను ప్రశ్నించే ముందు బొట్టు ధరించాలని తెలియదా..? నీతో మాట్లాడను. భారత స్త్రీలు బొట్టు లేకుండా విధవ రూపంలో కనిపించకూడద'ంటూ వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. మహిళలు ఏ స్థాయిలోనున్నవారైనా, వారి ఆహార్యం పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేయడం సంఘ పరివారానికి నిత్యకృత్యమైంది.
ఒకప్పుడు సతీసహగమనం అమలులో వుండేది. ఆ తర్వాత భర్త చనిపోతే ఆ మహిళ పూలు, బొట్టు, తాళి వంటివి తీసేయాలి. తెల్లచీర కట్టి, తలవెంట్రుకలు తొలగించి మూలన కూర్చోబెట్టేవారు. కానీ, భర్తతో వచ్చింది తాళి ఒక్కటే. చిన్ననాటి నుంచి అలంకరించునే పూలు, గాజులు, బొట్టు కాదు. వాటిని పెట్టుకోవాలా లేదా అనేది పూర్తిగా ఆమె ఇష్టం. 'ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోడం కంటే ప్రాణం పోవడం పెద్ద విషయం కాదు' అంటారు ఆఫ్రికన్ రచయిత్రి టోనీ మారిసన్. తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే హక్కు మహిళకు వుంది. 'ఒక స్త్రీగా నాకు ఒక దేశం లేదు/ ఒక స్త్రీగా.. నేను ఉండే స్థలమే దేశం... ప్రపంచం' అని ఆత్మ గౌరవంతో తన ఉనికిని, అస్తిత్వాన్ని ప్రకటిస్తుంది ఆంగ్ల రచయిత్రి వర్జీనియా వూల్ఫ్. స్త్రీలు ఇలాగే వుండాలని చెప్పే పురుషాధిక్య కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకొని తన ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవాలి. తమ ఇష్టాలకు బిగించిన కంచెలను, కంచుకోటలను తుత్తునియలు చేయాలి. ఆ దిశగా మహిళ అడుగులేయాలి. సమాజంలోని అభ్యుదయ శక్తులు అటువంటి వాటిలో భుజం భుజం కలపాలి. స్త్రీ, పురుష సమానత్వం అన్నింటా వెలుగొందాలి. అప్పుడే సమాజం పురోగమిస్తుంది.