ఆయనొక ఇంగ్లీషు ప్రొఫెసరు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఈయన చేసిన సుస్థిర ఆవిష్కరణ ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆచార్యుల వారి ఆలోచనను సమ్మతించి, ఆదరిస్తున్నారు. అదేంటో అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.
పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంతగా హాని చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ మనం విరివిగా వాడే స్ట్రాలు చేస్తున్న కాలుష్యం అంతా ఇంతా కాదు. రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడే మనకు కనిపిస్తాయి. ప్లాస్టిక్ స్ట్రాలే కాదు కాగితంతో తయారుచేసే స్ట్రాలతోనూ ఎంతో నష్టం. నిజానికి ప్లాస్టిక్ స్ట్రాల కంటే పేపర్ స్ట్రాల వల్లనే ఎక్కువ గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉత్పన్నమవుతుందంటే నమ్మగలరా?! ఇక ప్లాస్టిక్ స్ట్రాలతో ఒక్క మన వీధులే కాదు చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు సైతం కాలుష్యమవుతున్నాయి. మరి వివిధ పానీయాలను ఆస్వాదించేదెలా అని ఆలోచిస్తున్నారా? బెంగళూరులోని క్రైస్ట్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాజి వర్గీస్ చేసిన ఆవిష్కరణ దీనికో సమాధానం తీసుకొచ్చింది. కొబ్బరి ఆకులతో పర్యావరణానుకూలమైన స్ట్రాను రూపొందించి, 'ఔరా..!' అనిపించుకున్నారు. అంతేనా దీనితో గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు.
అలా మొదలైంది!
ఇది రెండేళ్ల క్రితం మాటే..! ఒకానొక రోజు పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికొస్తున్న ప్రొఫెసర్ వర్గీస్‌కు విద్యాలయ ప్రాంగణంలోనే ఎండి, పడున్న ఒక కొబ్బరి ఆకు కనిపించింది. నిజానికి ఒక కొబ్బరిచెట్టు ప్రతి ఏడాది సహజంగానే ఆరు ఆకుల్ని కోల్పోతుంది. ఎండిన ఈ ఆకుల్ని పలురకాలుగా వినియోగిస్తారు. చాలా మంది కాల్చేస్తారు. అయితే ఇలా రాలిన కొబ్బరి ఆకులోని ఒక ఈక, ఎండి, గుండ్రంగా ముడత చుట్టుకొని, ప్రొఫెసర్ వర్గీస్ కంట్లో పడింది. అలాంటివి ప్రతిరోజూ చాలానే చూస్తుండేవారు కానీ ఆరోజు మాత్రం ఆ ఆకులో ఒక స్ట్రా రూపం కనిపించింది. దాన్ని ల్యాబ్‌కు తీసుకెళ్లి, ఎక్కువ ప్రెజర్‌తో ఆవిరి పెట్టాడు. ఆ వేడిలో అది సహజంగానే నునుపు తేలినట్లుగా మారింది. అప్పుడిక ప్లాస్టిక్ స్ట్రాకు ప్రత్యామ్నాయంగా మరో స్ట్రా తయారయ్యింది. అయితే అంతటితోనే పూర్తవ్వలేదు. మరో ఏడాది పాటు కొందరు విద్యార్థుల బృందంతో చేసిన కృషితో కొబ్బరి ఆకుతో మల్టీ లేయర్ స్ట్రాను తయారుచేయకలిగారు. ఇందులో ఆ విద్యాలయ డిజైన్ ఇంజినీర్ విద్యార్థుల ప్రతిభ కూడా ఉండటం విశేషం.
విదేశాలకూ ఎగుమతి
వర్గీస్ కనిపెట్టిన ఈ ఆర్గానిక్ స్ట్రా కేవలం పర్యావరణానికి అనుకూలమైనది మాత్రమే కాదు. ఇది యాంటీ ఫంగల్. అంతేనా నీటిలో ఆరు గంటలపాటు నిటారుగా నిల్చుంటుంది. షెల్ఫ్‌లో ఉంచితే 12 నెలల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. ప్రారంభంలో సాధారణ మిషన్‌తో వీటిని తయారుచేశారు. మధురై, తుతికోరిన్, కాసర్‌గూడ్ జిల్లాల్లో చిన్న ప్లాంట్ తెరచి, నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించారు. ఆహార పరిశ్రమలో ఇది పెద్ద మార్పునే తీసుకు రాబోతోందనే మాట నిజమే! అందుకే దీన్ని ఒక బ్రాండ్‌గా మార్చాలని నిశ్చయించుకున్నారు. 'సన్‌బర్డ్' అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఏడాది గడవక ముందే వర్గీస్ రూపకల్పన విదేశీయులను సైతం మెప్పించింది. ఓవర్సీస్ నుంచీ చాలానే ఆర్డర్లు వచ్చాయి. అలా ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలతో పాటు ఏకంగా 25 దేశాలు 'సన్‌బర్డ్' స్ట్రాను దిగుమతి చేసుకుంటున్నాయి.
ఆవిష్కరణకు అంతం లేదు!
ఇక ఈ వస్తువుకి పేటెంట్ కూడా ఈ ఏడాది మే నెలలో వర్గీస్ పొందారు. ప్రస్తుతం మరింత ఎక్కువ మోతాదులో స్ట్రాలను ఉత్పత్తి చేసే పనిలో ఉన్నారు. ధర రూ.3 నుంచి రూ.10 వరకూ ఉండే వీటి ద్వారా నగర పేదలకు, గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు వర్గీస్. ప్రధానంగా కోస్తా ప్రాంతాలైన కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో మహిళలకు దీని నుంచి మేలు కలుగజేయాలని అనుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో మరో 20 యూనిట్లు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆవిష్కరణకు ఐఐటి ఢిల్లీ వారు స్వదేశీ స్టార్టప్ అవార్డును అందించారు. అలాగే స్విస్ రీ షైన్ ఎంట్రప్యూనియర్ అవార్డు, క్లైమేట్ లాంచ్‌ప్యాడ్ అవార్డులూ దక్కాయి. ఇలాంటి బయో డీగ్రేడబుల్ విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఈ ప్రొఫెసర్‌ను క్రైస్ట్ విశ్వవిద్యాలయమూ ప్రోత్సహిస్తోంది. దీనితో వర్గీస్ 'బెస్సింగ్ పామ్స్' అనే స్టార్టప్‌నీ ప్రారంభించారు. ఆవిష్కరణలకు అంతమేముంది...?! కొనసాగుతూనే ఉంటాయి కదా..!