మౌలికరంగ అభివృద్ధికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు చూస్తే ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలకు ఏమాత్రమూ సరిపోవు. అందుచేత
ఈ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే ఒక విధానాన్ని ముందుకు తెచ్చారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలలోకి ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించడం ఆ విధానంలో భాగమే. ఆ ప్రైవేటు పెట్టుబడిదారులు ప్రవేశపెట్టే వినూత్న ఆర్థిక వ్యూహాలతో అదనపు వనరులను సమీకరిస్తారు. వారి వ్యాపారానికి సానుకూలంగా ఉండే వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం వారికి మూల ధనాన్ని సమకూరుస్తుంది. ప్రభుత్వం ఈ మౌలిక వసతుల అభివృద్ధి కోసం చేసే ఖర్చు కు అవసరమైన నిధులను సమీకరించడానికి ప్రభుత్వం తన ఆస్తులను అమ్మకానికి పెడుతుంది. దానితోబాటు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కూడా అమ్మకానికి పెడుతుంది.
కోవిడ్-19పై విజయం సంపూర్ణంగా సిద్ధిస్తుందని, కోవిడ్-అనంతర కాలంలో ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుందని శ్రోతలను నమ్మేటట్టు చేయడం కోసం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు తరహాల ప్రతిపాదనలను తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకించి ప్రస్తావించారు. మొదటిది- భారత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో ఒక కొత్త ముందడుగు వేయనున్నట్టు నమ్మబలికారు. 2020-21లో రూ.94,452 కోట్ల మేరకు ప్రజారోగ్య రంగానికి కేటాయింపులు చేయగా ఈమారు 2021-22 లో 137 శాతం అదనంగా పెంచి రూ. 2,23,846 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు. ఇక రెండవది- రెవెన్యూ వ్యయం పెరిగి, దానివలన ద్రవ్యలోటు పెరిగితే దానినేవిధంగా సర్దుబాటు చేయాలన్న ప్రశ్నను పక్కనబెట్టి, పెట్టుబడి వ్యయాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాలకోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక పురోగమనం వేగం పుంజుకునేలా చేస్తామని అన్నారు. 2020-21 బడ్జెట్‌లో రూ. 4 లక్షల 12 వేల కోట్లుగా ఉన్న పెట్టుబడి వ్యయాన్ని 2021-22 బడ్జెట్‌లో రూ. 5 లక్షల 54 వేల కోట్లకు పెంచారు. వీటికి తోడు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం కోసం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలలో ప్రైవేటు సంస్థల ప్రవేశానికి అవకాశాలు పెంచడంతోబాటు పలు రాయితీలను కూడా ప్రకటించారు. ఈ విధమైన చర్యల వలన విద్యుత్తు, రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు తదితర రంగాలలో వృద్ధి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మన ఆర్థిక మంత్రి అట్టహాసంగా ముందుకు తెచ్చిన ఈ ''ద్విముఖ అభివృద్ధి'' వ్యూహం ఏ నేపథ్యంలో చూడాలి? మన ఆర్థిక వ్యవస్థ వి- ఆకారంలో (ఇంగ్లీషు అక్షరం వి ఆకారంలో) తిరిగి పుంజుకుంటుందని తెగ ప్రచారం జరుగుతున్నప్పటికీ, కోవిడ్ మహమ్మారి వలన తీవ్రతను సంతరించుకున్న సంక్షోభపు ప్రభావాన్ని మనం ఇంకా చూస్తూనే వున్నాం. లాక్‌డౌన్ కాలంలో ఆ దుష్ప్రభావాల నుండి ఆదుకోడానికి ఈ ప్రభుత్వం చేసిన నిర్వాకం ఏపాటిదో దానినీ చూశాం (వి-ఆకారంలో రికవరీ అంటే ఎంత వేగంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిందో తిరిగి అంతే వేగంగా పుంజుకుంటుందని అర్ధం) వివిధ రకాల ఉద్దీపన పథకాలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ వ్యయం పెరుగుదల మన జిడిపిలో కేవలం 1.5 శాతం మేరకే ఉంది. ప్రజలకు ఆహారం నిమిత్తం అతి తక్కువ సహాయం మాత్రమే అందించారు. ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పన విషయంలో కూడా అంతే. సంక్షోభం దెబ్బకు పూర్తిగా చితికిపోయిన ప్రజానీకంలో అతి చిన్న భాగానికి మాత్రమే సగదు సహాయాన్ని అందించగలిగారు. అందుచేత కోవిడ్ తాకిడి నుండి, దాని పర్యవసానంగా మరింత ఉధృతమైన సంక్షోభం తాకిడి నుండి ప్రజలను ఆదుకోవడం విషయంలో పూర్తి చేయకుండా ఉండిపోయిన కర్తవ్యాలను ముందుగా ఈ బడ్జెట్ తలకెత్తుకుని వుండాలి. ఈ కర్తవ్యాలను అసంపూర్ణంగా విడిచిపెట్టి కోవిడ్-అనంతర పరిస్థితులపై చర్చించడం జరిగింది.
ఈ కోణం నుండి చూసినప్పుడు బడ్జెట్ తీవ్ర ఆశా భంగాన్ని కలిగించింది. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడానికి ఈ బడ్జెట్‌లో వ్యాక్సినేషన్ నిమిత్తం రాష్ట్రాలకు అయ్యే ఖర్చులో ఒక చిన్న భాగాన్ని, రూ. 35,000 కోట్లను, రాష్ట్రాలకు కేటాయించారు. దానితోటే మొత్తం జనాభా యావత్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుందని, అసలు ఇప్పటికే కోవిడ్ పై యుద్ధంలో విజయాన్ని దాదాపు సాధించేశామని భావిస్తున్నట్టు కనపడుతోంది. అందుకేనేమో, కోవిడ్ కాలంలో సంక్షేమ చర్యల కోసం చేసిన కొద్దిపాటి ఖర్చును కూడా కొనసాగించకుండా వాటికీ కోతబెట్టారు. ఉపాధి హామీ పథకాన్నే తీసుకోండి. 2020-21లో బడ్జెట్ లో రు.65,000 కోట్లు కేటాయించినప్పటికీ, ఈ పథకం కింద రూ. 1,11,500 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. (2019-20లో రూ. 71,687 కోట్లు వాస్తవంగా ఖర్చు చేస్తే ఆ మరుసటి ఏడాది రూ. 65,000 కోట్లు మాత్రమే కేటాయించారు) పట్టణాల్లో పెద్దఎత్తున పనులు పోగొట్టుకున్న వలస కూలీలు చాలామంది ఈ ఉపాధి హామీ పథకం వైపు మళ్ళడంతో (అడిగిన వారందరికీ పనులు కల్పించాలని ఈ ఉపాధి హామీ చట్టంలో ఉన్నది గనుక) కేటాయింపులు పెంచవలసి వచ్చింది. ఇంతమాత్రం చేతనే పరిస్థితులు మారి, సంక్షోభపు తాకిడి నుండి కోలుకున్నారని చెప్పలేం. అయినప్పటికీ 2021-22 బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ. 73,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆహార సబ్సిడీల విషయం లోనూ ఇదే తీరు కనపడింది. 2019-20 లో ఆహార సబ్సిడీల పద్దు కింద రూ. 1,08,688 కోట్లు ఖర్చు చేశారు. 2020-21 బడ్జెట్‌లో రు.1,15,570 కోట్లు కేటాయించారు. అది వాస్తవంగా రూ. 4,22,618 కోట్లకు పెరిగిందని అంచనా వేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం వర్తించే కుటుంబాలకు తలా 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా పంచినందుకే ఈ పద్దు కింద జరిగిన ఖర్చు ఇంతమేరకు పెరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలకు ఆహారాన్ని చౌకగా అందించే ఒక వ్యవస్థ అవసరం ఇంతటితో తీరిపోయినట్టు ఏ కోశానా భావించలేం. ఇంకా చాలామంది కోవిడ్ సంక్షోభపు తాకిడినుండి కోలుకోలేదు. అయినప్పటికీ, ప్రస్తుత సంవత్సరంలో పెట్టిన ఖర్చులో దాదాపు సగం మాత్రమే 2021-22లో కేటాయించారు. ఇందులో కూడా భారతీయ ఆహార సంస్థకు గతేడాది బకాయి పడిన మొత్తాలను చెల్లించడానికి కొంత ఖర్చు చేస్తారు. ఈ విధంగా సంక్షేమానికి ఈ ఏడాది కోతలు పెట్టడం జరిగింది. దానిని సమర్ధించుకోడానికి మనం కోవిడ్ సంక్షోభాన్ని జయించేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.
కోవిడ్ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో అన్ని రకాలుగానూ వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికే బడ్జెట్ సందర్భంగా ప్రజారోగ్యానికి కేటాయింపులు పెంచడం, పెట్టుబడుల వ్యయాన్ని పెంచడం గురించిన ఆర్భాటం చేస్తున్నారు. అసలు ఈ కేటాయింపుల వైనాన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే ఆ ఆర్భాటపు బండారం కాస్తా బైట పడుతుంది.
ప్రజారోగ్య రంగానికి 137 శాతం కేటాయింపులు పెంచేసినట్టు చూపించడానికి ఆ పద్దు కింద వ్యాక్సినేషన్ కోసం అనివార్యంగా చేయవలసిన ఖర్చును కూడా కలిపి చూపించారు. ఆ రూ. 35,000 కోట్లు మొత్తం వ్యాక్సినేషన్ కు అవసరమయ్యే ఖర్చులో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ మారు ''ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం'' అన్న పద్దు పేరు మార్చి ''ఆరోగ్యం, బాగోగులు'' అని పెట్టారు. దానిలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి కేటాయించినది రూ. 71,000 కోట్లు మాత్రమే. కోవిడ్ లేని గతేడాది బడ్జెట్‌లో కేటాయించినది రూ. 65,000 కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 78,866 కోట్లకు పెరిగింది. దానితో పోల్చినప్పుడు ఈ ఏడాది వాస్తవంగా 9.6 శాతం తగ్గింది.
ఇక ఆరోగ్యం, బాగోగులు పద్దు కింద కేటాయించినదానిలో తాగునీరు, పారిశుధ్యం కింద ఖర్చు రూ. 49,214 కోట్లు ఉంది. ఇది రాష్ట్రాలకు 15 వ ఫైనాన్సు కమిషన్ ఇచ్చిన గ్రాంటు. దానిని కేంద్రం ఎటుతిరిగీ రాష్ట్రాలకు చెల్లించాల్సిందే. జల్ జీవన్ మిషన్ కింద ఇళ్ళకు వ్యక్తిగత కుళాయిలను మంజూరు చేసేందుకు అయ్యే ఖర్చు రూ. 50,000 కోట్లు కూడా ఈ పద్దు లోనే కలిపి చూపించారు. రక్షిత మంచి నీరు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిజమే. కాని అది వైద్య, ఆరోగ్య వ్యవస్థలో ప్రధాన భాగం కానే కాదు. అయితే బడ్జెట్‌లో ఈ పద్దు కింద కేటాయింపులనే భారీగా పెంచి అదంతా వైద్య, ఆరోగ్య బడ్జెట్‌లో భాగంగా చెప్పుకుంటోంది ప్రభుత్వం. 2020-21లో గ్రామీణ మంచినీటి సరఫరాకు కేటాయించినది రూ. 10,905 కోట్లు కాగా ఈ ఏడాది దానిని 450 శాతం పెంచి రూ. 49,757 కోట్లు గా చూపించారు. ఈ సొమ్ము రోడ్లు, మౌలిక వసతుల కల్పన నిధి నుండి మళ్ళించారు.
మొదట దీనిని కేంద్ర రోడ్ల నిధి అని నామకరణం చేశారు. ఆ నిధికి సొమ్ము కోసం కేంద్రం ప్రత్యేకంగా సెస్ ను విధించింది. 2018లో దాని పేరు మార్చి సామాజిక రంగంలో మౌలిక వసతుల కల్పనకు వినియోగించడం మొదలెట్టారు. రోడ్లు, హైవేలు నిర్మించడానికి క్రమంగా ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానించడం ప్రారంభించారు.
ఇలా గతంలో ప్రభుత్వమే బాధ్యత వహించే పలు మౌలిక రంగాలను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పడం ఈ బడ్జెట్ లోని రెండో కీలకాంశం. మౌలికరంగ అభివృద్ధికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు చూస్తే ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలకు ఏమాత్రమూ సరిపోవు. అందుచేత ఈ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే ఒక విధానాన్ని ముందుకు తెచ్చారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాలలోకి ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించడం ఆ విధానంలో భాగమే. ఆ ప్రైవేటు పెట్టుబడిదారులు ప్రవేశపెట్టే వినూత్న ఆర్థిక వ్యూహాలతో అదనపు వనరులను సమీకరిస్తారు. వారి వ్యాపారానికి సానుకూలంగా ఉండే వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం వారికి మూల ధనాన్ని సమకూరుస్తుంది. ప్రభుత్వం ఈ మౌలిక వసతుల అభివృద్ధి కోసం చేసే ఖర్చు కు అవసరమైన నిధులను సమీకరించడానికి ప్రభుత్వం తన ఆస్తులను అమ్మకానికి పెడుతుంది. దానితోబాటు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కూడా అమ్మకానికి పెడుతుంది. ఈ బడ్జెట్‌లో ఆ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా రూ.1,75,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. అంత సొమ్ము రావాలంటే అందుకోసం అత్యుత్తమంగా నడిచే సంస్థల వాటాలను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. మొత్తంగా (1) ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం, (2) కొన్ని సంస్థల వ్యూహాత్మక అమ్మకం (విశాఖ ఉక్కు అమ్మకం ఈ కోవ లోనిదే) (3) ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలను ప్రైవేటీకరించడం అనే మూడు పద్ధతులను అమలు చేస్తారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను, ఒక సాధారణ బీమా సంస్థను ప్రైవేటీకరించడమో, వాటి వాటాలను అమ్మడమో చేయాలని, జీవిత బీమా సంస్థ లో వాటాలను అమ్మకానికి పెట్టడానికి వీలు కల్పించే ఐపిఒ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లను స్టాక్ మార్కెట్‌లో ప్రవేశ పెట్టడం జరుగుతుందని బడ్జెట్ ప్రసంగం లోనే ఆర్థికమంత్రి ప్రకటించారు. వీటికి తోడు ప్రభుత్వ రంగ సంస్థల అధీనంలో ఉన్న భూములను కూడా అమ్మివేయనున్నారు. ఈ విధంగా తన ఆస్తుల అమ్మకం ద్వారా పెట్టుబడి వ్యయానికి అవసరమైన వనరులను సమీకరించడానికి సిద్ధపడుతున్నారే తప్ప అదనంగా పన్నులను వేయడానికి మాత్రం సిద్ధం కావడంలేదు.
2020-21లో రూ. 2,10,000 కోట్లను పైన తెలిపిన పద్ధతుల ద్వారా సమీకరించాలని భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ ఆచరణలో ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రస్తుత స్టాక్ మార్కెట్‌లో స్పెక్యులేషన్ సృష్టిస్తున్న ఒడిదుడుకుల నేపథ్యంలో, ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా, ఏమేరకు తన లక్ష్యాన్ని ఈ ఏడాది చేరుకోగలుగుతారన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ ఆ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నప్పటికీ, దానివలన నిజంగా ప్రయోజనం పొందేది మాత్రం కొద్దిమంది స్వదేశీ, విదేశీ కార్పొరేట్లే తప్ప ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఎదురు చూస్తున్న కోవిడ్ బాధిత సామాన్య ప్రజానీకం మాత్రం కాదు. ఈ బడ్జెట్‌ను రూపొందించిందే ఆ కార్పొరేట్ల కోసం.
(స్వేచ్ఛానుసరణ)
సి.పి. చంద్రశేఖర్











