
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
సంక్రాంతి పండగ కళ.. కోలాహాలం అంతటా నెలకొంది. పల్లె పండగ సంక్రాంతి వచ్చిందంటే పట్టణాలు, నగరాల్లో ఉన్నవారంతా మూట, ముళ్లు సర్దుకుని స్వగ్రామాలకు తరలివెళ్లడం సహజమే. గడచిన వారం అంతా ఈ పండగ వాతావరణమే. జనవరి 12వ తేదీ నుంచి పండగ మూడ్‌లోకి వివిధ తరగతుల ప్రజలు వెళ్లిపోతారు. ఎక్కడికక్కడే ఉత్సవాలు, సంబరాలు పెద్ద ఎత్తున సాగాయి. సంక్రాంతి వచ్చిందంటే సంబరాలను తెస్తుందన్న నానుడిని గుర్తు చేసేలాగ అన్నిచోట్లా ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. క్రీడలు, వివిధ రకాల పోటీలు, నృత్యాలు వంటివి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సాగాయి. అక్కడక్కడా కోడిపందాల రాయుళ్లు పోటీకి కోళ్లతో మారుమూల గ్రామాల్లోకి వెళ్లడం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ప్రారంభించిన అమ్మఒడి పథకం కింద పాఠశాల విద్య, ఇంటర్ చదివే పిల్లల తల్లి అకౌంటులో రూ.14వేలు పడడంతో పండగ సందడి తారాస్థాయికి చేరింది. విశాఖలో షాపింగ్ మాల్స్ అన్నీ ఈనెల 11వ తేదీ నుంచీ జనం తాకిడితో కిటకిటలాడిపోయాయి. విశాఖ నగరంలోని ప్రధాన బట్టల షాపులు సహా చిన్నా, పెద్దా షాపుల్లో ఈ వాతావరణం కనిపించింది. పండగ సందర్భంగా భోగి రోజు మొదలుకొని 16 వరకూ నగరంలో బీచ్‌రోడ్లన్నీ కిటకిటలాడిపోయాయి. పెద్ద ఎత్తున వాహనాలతో సాగర తీరం అంతా బారులు తీరడం కనిపించింది. జోడుగుళ్ల పాలెం నుంచి ఆర్‌కెబీచ్ వరకూ కార్లు, మోటారు వాహనాల క్యూ పెద్ద ఎత్తున సాయంత్రం కనిపించింది. సరదాగా బీచ్‌లో గడిపేందుకు వచ్చిన వారంతా పండగ సీజన్ కావడంతో ఓపిగ్గానే వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయత్నించారు. సంక్రాంతిని పలు రకాలుగా ఆనందించేందుకు ప్రయత్నించినా కొంతమందికి ఈ సంక్రాంతి కొంత భారంగానే సాగిందని చెప్పక తప్పదు.
సాధారణ ప్రజలు, రైతులపై ప్రభావం...
సంక్రాంతి సందడి కాసేపు అలా ఉంచితే... రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సొంతూళ్లకు వచ్చిన వారికి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల ఛార్జీలు తడిసిమోపెడయ్యాయి. ప్రయాణికులు ఈ విషయంలో లబోదిబోమన్నారు. ఆర్టీసీ ఏకంగా ఉన్న ఛార్జీపై 30 నుంచి 40శాతం పెంచగా, ప్రైవేట్ బస్సులు 50శాతం వరకూ పెంచేశారు. విశాఖ నుంచి విజయవాడకు రూ.700 నుంచి రూ.1000 వరకూ ఒక టికెట్ ధర సాగింది. ఏటా ఈ తంతు సాగుతున్నా ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టిసారించడం లేదు. పండగ సమయం అయినందున ప్రజలు డబ్బులు ఖర్చు చేయడానికి వెనుకాడరని, ఈ టైంలోనే జనం నుంచీ అధికంగా లాక్కోవాలనే వ్యూహంతో ఆర్టీసీ కూడా వడ్డన దిగింది.
మరో ముఖ్యమైన విషయం జిల్లాలో ఖరీఫ్ పంట ఈ ఏడాది విస్తృతంగా రైతుల చేతుల్లోకి వచ్చింది. 2019తో పోల్చితే దిగుబడి బాగా వచ్చిందన్నది స్పష్టమవుతోంది. దిగుబడి పరంగా రైతుల్లో సంతోషం ఉన్నా మద్దతు ధర లేక విశాఖ గ్రామీణ ప్రాంతంలో రైతులు నష్టపోయినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. 155 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అందులో సంక్రాంతి ముందు రోజు వరకూ తెరచుకున్నవి 50 కేంద్రాలు లోపే. మేం ఫలానా రకం వరి పండించామంటూ సమాచారాన్ని రైతులు ఇస్తేనే, ఆయా కొనుగోలు కేంద్రాలకు అమ్ముకోడానికి రైతులకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ నిబంధనతో రైతు నష్టపోతున్నాడు. అలగే సాగు ధృవీకరణ పత్రాలు అంటూ యంత్రాంగం కాలయాప చేయడం జిల్లాలోని పలు మండలాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది లక్ష టన్నులు ఇప్పటికే కొనుకోలు చేయాల్సి ఉండగా 15వేల టన్నులే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వ్యాపారులు ఏటా విశాఖ గ్రామీణ ప్రాంతంలోకి వచ్చి కొనుక్కుని వెళ్లిపోవడం ఆనవాయితీగా మారిపోయింది.