
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
పంచాయతీ సమరనాదాలు గ్రామ సీమలను వేడి పుట్టిస్తున్నాయి. అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది. అంతవరకూ అన్నా.. తమ్ముడు... అక్కా... చెల్లి... బావ... బావమరిదీ అంటూ ఇలా సొంత, పర అనే బేధం లేకుండా ఒకరినొకరు పిలుచుకుంటూ కలసి మెలసిన జనం మధ్య పంచాయతీ ఎన్నికల గీతలు ఇప్పుడు గీయబడుతున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలంటేనే కులం, ధనం, అధికార బలం అన్నీ ఒక దాని వెంట నడుస్తూ జనాన్నీ అందులోకి దించుతాయన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ కలిసి ప్రజల మధ్య రాజకీయ కాకను రగిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండక్కర్లేదు. పైగా అనేక సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలైనందున గ్రామాల్లో ఉత్సాహం కాసింత కనిపిస్తోంది.
అధికార వైసిపిలో ఆశావహుల సంఖ్య కోకొల్లలుగా ఉంటే... ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశంలో మాత్రం నాయకత్వం ఉన్నా ఈ ఎన్నికల్లో ఆర్థికంగా చేతులు కాల్చుకోవడం దేనికన్న భావన బయటపడుతోంది. జిల్లాలో అనేక చోట్ల మొదల విడత ఎన్నికల నేపథ్యంలో అధికార వైసిపికి గ్రూపుల బెడద నెలకొనగా... టిడిపికి పలు చోట్ల అభ్యర్థుల కొరత కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ వైపు స్థానిక ఎన్నికల్లో ప్రజలు మొగ్గుచూపుతారన్న కారణంతో టిడిపి శ్రేణులు వెనకడుగువేస్తున్నాయి. పైగా వైసిపి ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి వరకూ చేరడంతో టిడిపి నేతల్లో గుబులు రేగడం సహజమే. అయితే ఇటీవల దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసం, అపహరణ వంటి అంశాల్లో అధికార పార్టీ విఫలమైందంటూ బిజెపి, జనసేనతో కలిసి గోల చేసిన టిడిపి స్థానికంగా దానిని మలచుకోవాలనే తాహతును పలు చోట్ల ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికలంటే పార్టీ జెండాలు, పార్టీ గుర్తులతో జరగకపోయినా గ్రామ సీమల్లో పార్టీలు, స్థానిక నాయకత్వం బట్టే ఆ వెనక జనం నడుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా అధికార వైసిపి నాయకులు, ఆ పార్టీ శ్రేణులు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వైసిపి జెండాలతో కోలాహాలంగా సాగుతుండగా, ప్రతిపక్ష టిడిపి కార్యకర్తలు కూడా పలు చోట్ల తమ పార్టీ జెండాలతో దర్శనమిస్తున్నారు.
స్థానిక ఎన్నికల వాతావరణాన్ని జిల్లాలో చూస్తే పదవుల కోసం ప్రాకులాట మరీ ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికంగా కనిపిస్తోంది. అధికారంలో ఉండి పదవి దక్కించుకోలేకపోతే జీవితం వృథా అంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. గ్రామాల్లో నేతల మధ్య విభేదాల పోరు పలు చోట్ల రచ్చకెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైసిపి మద్దతదారులు ఒక పంచాయతీకి పోటీ చేసే వారి సంఖ్య పలు చోట్ల ఇద్దరి నుంచీ ముగ్గురు వరకూ ఉండడం కనిపిస్తోంది. టిడిపిలో ఈ స్థితి లేదు. అత్యధిక పంచాయతీ స్థానాలను గెలిపించుకోవాలంటూ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బాధ్యతలు పెట్టినా వారు స్థానికంగా ఎవరికీ మద్దతివ్వలేక.... వ్యతిరేకించలేక ఎవరి పని వారు చేసుకొండనే ధోరణితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రామస్థాయిలో ఎవరిని వద్దన్నా సమస్య వస్తుందని, తర్వాత సాధారణ ఎన్నికల్లో తనకు దెబ్బకొట్టే ప్రమాదం ఉందనే అంచనాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చూసీచూడనట్లు విభేదాల పోరును వదిలేయడం తొలి విడత జరిగే అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అత్యధిక స్థానాలు గెలుచుకోడానికి గానూ ఈ వాతావరణం అధికార పార్టీకి ఉపయోగపడుతుందా? అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులను సైతం చర్చకు తావిచ్చేలా చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పలానా వ్యక్తినే అధికార వైసిపి మద్దతు పలకుండా వదిలేయడంతో ఇద్దరు ముగ్గురు బరిలో ఉంటే ఓట్లు చీలిపోయే ప్రమాదం తప్పదా? లేదంటే ఈ పోటీలో టిడిపి పూర్తిగా కార్నర్ (ఒక మూలకు) పోతుందా? అనే మీమాంశ నడుస్తోంది. మరో పది రోజుల పాటు ఏదిఏమైనా వేచిచూడాల్సిందే.