Jan 24,2021 01:00

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
'తమకు సంబంధించిన విషయాల నుంచీ ప్రజల్ని పక్కదారి పట్టించే కళే రాజకీయాలు' అని సాల్‌ వాలెరీ అనే సామాజిక వేత్త అంటారు. 'ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగి వున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అని రష్యన్‌ విప్లవ నేత లెనిన్‌ అన్నారు. గడిచిన వారం రోజులుగా విశాఖ జిల్లాలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న యాత్రలు, కార్యక్రమాలను చూస్తే పైన పేర్కొన్న కొటేషన్లు గుర్తుకురాక మానవు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి విరాళాల పేరిట విశాఖలో నిధి వసూళ్లకు బిజెపి శ్రేణులు బయల్దేరగా, వారికి వంతపాడుతూ జనసేన, టిడిపి, వైసిపి కూడా సై అంటూ ముందుకేగుతున్నాయి. విశాఖను అభివృద్ధి చేసే అంశం కేంద్రంలో పాగా వేసిన బిజెపికి అస్సలు పట్టలేదు. రాష్ట్రానికి, విశాఖకు ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నేతలకు చీమకుట్టినట్టయినా లేదు. ప్రజా సమస్యలపై చర్చ, పరిష్కారం పట్ల పైపార్టీలకు చిత్తశుద్ధి కానరావడం లేదు. రైతు వ్యతిరేక మూడు నల్ల వ్యవసాయ చట్టాలపై దేశ రాజధాని ఢిల్లీలోనూ, మద్దతుగా విశాఖ జిల్లాలోనూ 58 రోజులుగా రైతాంగం పోరాడుతుంటే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బిజెపి రాముడు గుడి పేర రోడ్లపైకి ఆ పార్టీ శ్రేణులను తోసింది. వీరితో పాటు జనసేన, టిడిపి, అక్కడక్కడా వైసిపి నేతలు కూడా రోడ్లపై ర్యాలీలు చేస్తున్న దృశ్యాలు కళ్లెదుటే వారం రోజులుగా సాక్షాత్కరిస్తున్నాయి.
ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించే పని...!
2014లోనూ, ఆ తరువాత 2019లోనూ నరేంద్రమోడీ, బిజెపి పెద్దలు తమకు అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, అవినీతిని పారద్రోలి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి అధికారానికి వచ్చిన సంగతి తెలిసిందే. తీరా అధికారం వచ్చాక ఆ పార్టీ కప్పుకున్న మేకతోలును తొలగించుకుంటూ వస్తోంది. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయకుండా కాలాన్ని నెట్టుకుంటూ, ప్రజలు సెంటిమెంట్లను రెచ్చగొడుతూ సొమ్ము చేసుకునే క్రమాన్ని వేగిరం చేసింది.
ఏపికి హోదా ఇవ్వకుండా సంవత్సరాల తరబడి బిజెపి బడా నేతలు కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఏళ్ల చరిత్ర గల వాల్తేరు డివిజన్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎత్తేసినా టిడిపి, జనసేన, వైసిపి నోరు మెదపలేదు. విశాఖకు రైల్వే జోన్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క పనీ ప్రారంభించలేదు. గతేడాది బడ్జెట్‌లో కేవలం రూ.3కోట్లు విదిలించి చేతులు దులుపుకుంది. రైల్వే జోన్‌ అంటే వంద కోట్ల రూపాయలు తక్షణం ఉంటేగానీ ఏ పనీ ముందుకు వెళ్లదన్నది రైల్వే ఉన్నతాధికారులు చెబుతూనే ఉన్నా కేంద్ర పాలకులకు ఏ మాత్రం పట్టడం లేదు. అయినా ఈ పార్టీలు స్పందించడం లేదు. అత్యంత అవకాశవాదాన్ని తెలుగుదేశం, జనసేన, వైసిపి ప్రదర్శించడం స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగ చట్టాలు, నిబంధనలకు భంగం కలిగే చర్యలు పేట్రేగుతున్నా మాట్లాడటం లేదు.
దేశంలో నిరుద్యోగం పెరిగింది. అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. 'పెట్రోల్‌ ధరలతో భారత ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుంది. లీటరు రూ.90కు చేరింది. ప్రస్తుతమున్న ముడిచమురు ధరలను బట్టి లీటరు రూ.30 చొప్పున అందించవచ్చు. రూ.60 అదనంగా దేశ ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం లీటరును రూ.40కే అమ్మాలి.' అని స్వయాన బిజెపి నేత సుబ్రమణ్యస్వామి అన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రజలను దోచుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. వీటిపై టిడిపి, జనసేన, వైసిపి మాట్లాడటం లేదు.
ప్రజల్లో వీటిపై చర్చకు అవకాశం లేకుండా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పనిగట్టుకుని 'దేవుడ్ని' రంగంలోకి తెచ్చేశాయి. రాముడు దేవుడుగా దేశంలో అత్యధిక మంది పూజిస్తారు. ఇది వ్యక్తిగతమైనది. ఎక్కడికక్కడే ప్రతి ఊర్లోనూ, వాడల్లోనూ రామాలయాలున్నాయి. అయోధ్యలో రామాలయం కట్టడమనేది దేశ ప్రజలందరి సమస్య కాదు. కాని ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలపై వారు ఆలోచించకుండా, దేశంలోని ప్రధాన సమస్యలపై చర్చ జరగకుండా, ఆ సమస్యలకు కారణమైన బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా రాముడు సెంట్‌మెంట్‌ను రగల్చి పక్కదారి పట్టించేందుకు బిజెపి కుట్ర చేస్తోంది. అందుకే ఏడాది క్రితమే అయోధ్య తీర్పు వచ్చినా ఇప్పుడు రామాలయం నిర్మాణం పేరుతో నానా యాగీ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా విశాఖలోనూ అయోధ్య రామాలయం పేరుతో సెంటిమెంట్‌ను పండించే పని చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలైన జనసేన, టిడిపి, వైసిపి ఈ ఉచ్చులో పడటం దురదృష్టకరం. విజ్ఞలైన ప్రజలు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి.