Jan 15,2023 11:52

సంక్రాంతి అంటేనే వ్యవసాయక, తెలుగు సంస్కృతికి అద్దం పట్టే పెద్ద పండుగ. ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు.. నలుగురైదుగురు కలసి చేసుకునే పోషకాలతో కూడిన పెద్దవంటలు ఈ పండుగకు పరిపాటి. పూర్వం నుంచీ శీతాకాలంలో తీసుకునే ఆహారమే మనిషికి ఏడాదిపాటు అధిక శక్తిని అందిస్తూ సహకరిస్తుంది అనే నమ్మకం సంక్రాంతి పిండి వంటలతో పయనిస్తూ వచ్చింది. అందుకే కొత్త బియ్యం, పచ్చి కొబ్బరి, నువ్వులు, బెల్లంతో చేసిన రకరకాల పిండివంటలు ఈ పండుగలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ వంటకాలన్నీ శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఉష్ణం పెంపొందించుకోవడానికీ దోహదపడతాయి. మరి ఆ పిండి వంటల్లో కొన్నింటిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
చెక్కలు..
 

1

కావలసినవి : బియ్యప్పిండి - 1/2 కేజీ, సగ్గుబియ్యం -1/4 కప్పు, మినప్పప్పు - 1/4 కప్పు, జీర - స్పూను, నువ్వులు - 2 స్పూన్లు, కరివేపాకు తరుగు - 1/4 కప్పు, కొత్తిమీర - 1/4 కప్పు, పచ్చిమిర్చి 6, అంగుళం అల్లం ముక్క ముద్ద, ఉప్పు - తగినంత, నెయ్యి - 2స్పూన్లు నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా తయారీ : బియ్యప్పిండిలో గంటసేపు నానబెట్టిన సగ్గుబియ్యం, మినప్పప్పు, జీర, నువ్వులు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి-అల్లం ముద్ద, ఉప్పు , వేడిగా ఉన్న నెయ్యి అనింటినీ బాగా కలిపి గోరువెచ్చని నీటితో పిండిని గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకుని చెక్కలుగా ఒత్తుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి చెక్కలను నూనెలో వేయించుకోవాలి. అంతే రుచికరమైన కరకరలాడే చెక్కలు రెడీ.
అరిసెలు..

2


కావలసినవి : బియ్యం- కేజీ, బెల్లం - 3/4 కేజీ, పంచదార - 2 స్పూన్లు, నువ్వులు - 1/4 కప్పు, నెయ్యి - 2 స్పూన్లు, నూనె - డీప్‌
ఫ్రైకి సరిపడా, తయారీ : రాత్రంతా (దాదాపు 12 గం.) నానబెట్టిన బియ్యాన్ని వడగట్టి పిండి పట్టించి ఆరిపోకుండా గట్టిగా నొక్కిపెట్టాలి. అడుగు మందంగా ఉన్న వెడల్పు పాత్రలో బెల్లంలో పావుకప్పు నీటిని చేర్చి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత వడగట్టుకుని మళ్ళీ స్టౌమీద పెట్టి నువ్వులు, నెయ్యివేసి పాకం పట్టుకోవాలి. పాకం కరెక్టుగా ఉంటేనే అరిసెలు పర్ఫెక్టుగా వస్తాయి. సరిగా వచ్చిందో లేదో చూడడానికి నాలుగైదు చుక్కల పాకాన్ని కొద్ది నీటిలో వేసి పరీక్షిస్తే ఉండ రావాలి. ఉండ గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. అలా పాకం తయారయిన వెంటనే స్టౌ సిమ్‌లో పెట్టి రెడీగా ఉంచుకున్న పిండిని ఒకరు కొద్దికొద్దిగా పాకంలో వేస్తూ, మరొకరు రెండూ కలిసేలా వేగంగా తిప్పాలి. సాఫ్ట్‌గా ఉండే చలిమిడి ముద్ద తయారవుతుంది. చలిమిడి గోరువెచ్చగా ఉన్నప్పుడు అరటి ఆకుమీద అరిసెలు ఒత్తుకుని, స్టౌ మీడియం ఫ్లేంమీద పెట్టి అరిసెలు నూనెలో కాల్చుకోవాలి. రెండువైపులా ఎర్రగా కాలిన అరిసెలను అపకలపై ఉంచి నూనెను తీసేసి ఎండు గడ్డిపై ఆరబెట్టాలి. ఆరిపోయిన తరువాత అరిసెలను కొత్త మట్టి కుండలో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం మృదువుగా, రుచిగా ఉంటాయి.
పాకుండలు..

3


కావలసినవి : కొత్త బియ్యం - కేజీ, బెల్లం - 1/4 కేజీ, గసగసాలు - 1/4 కప్పు, పచ్చికొబ్బరి కాయ.
తయారీ : పద్దెనిమిది గంటలపాటు నానబెట్టిన కొత్త బియ్యాన్ని వడగట్టి పిండి పట్టించి ఆరిపోకుండా గట్టిగా నొక్కిపెట్టాలి. అడుగు మందంగా ఉన్న వెడల్పు పాత్రలో బెల్లంలో పావుకప్పు నీటిని పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత వడగట్టుకుని మళ్ళీ స్టౌమీద పెట్టి పాకం పట్టుకోవాలి. పాకం సరిగా వచ్చిందో లేదో చూడడానికి నాలుగైదు చుక్కల పాకాన్ని కొద్ది నీటిలో వేసి పరీక్షిస్తే ఉండ రావాలి. అలా పాకం తయారయిన వెంటనే స్టౌ ఆఫ్‌ చేసి గసగసాలు, కొబ్బరి తురుము, ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యప్పిండి కొంచెం కొంచెం పాకంలో వేస్తూ వేగంగా కలపాలి. చలిమిడి ముద్దగా వచ్చిన తరువాత చల్లారనివ్వాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుని నిమ్మకాయ సైజంత ఉండలు చేసుకోవాలి. బాండీలో నూనె బాగా వేడిచేసి, స్టౌ మీడియం ఫ్లేం మీద ఉంచి, ఈ ఉండలు వేసి మూడు నిమిషాలు కదపకుండా అలా ఉంచేయాలి. తరువాత ఉండలు చెదిరిపోకుండా గరిటెతో నెమ్మదిగా కదపాలి. ఉండలు ముదురు రంగులోకి వచ్చేలా వేయించుకుని తీసేయడమే. కమ్మకమ్మని పాకుండలు రెడీ.
సగ్గుబియ్యం చక్రాలు..

3


కావలసినవి : బియ్యం - కేజీ, సగ్గుబియ్యం - 1/4 కేజీ, పెసరపప్పు - 1/4 కేజీ, పచ్చిమిర్చి - 5, అల్లం - అంగుళం ముక్క, ఉప్పు - తగినంత, కారం - స్పూను, పసుపు - చిటికెడు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ: బియ్యం, సగ్గుబియ్యం, పెసర పప్పులను పిండి పట్టించాలి. పిండిలో పచ్చిమిర్చి-అల్లం ముద్ద, ఉప్పు, కారం, పసుపు కావలసినంత నీటితో ముద్దగా కలపాలి. బాగా కాగిన రెండు స్పూన్ల నూనె ఆ ముద్దలో బాగా కలిసేలా కలపాలి. బాండీలో నూనె వేడిచేసి చక్రాలను ఒత్తుకుని నూనెలో చిటపటలు తగ్గేంత వరకూ వేగనివ్వాలి. అంతే కరకరలాడే సగ్గుబియ్యం చక్రాలు రెడీ.