
ప్రైవేటీకరణలో మునిగి తేలుతున్న మోడీ సర్కారు దేశ రక్షణకు అవసరమైన సిపాయిలను సైతం కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని నిర్ణయించడం దేశానికి వినాశకరం. సైన్యం రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ, 'అగ్నిపథ్' పేరిట ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ఈ విధానం ప్రకారం 17-21 సంవత్సరాల మధ్య వయసున్న వారిని నెలకు రూ.30 నుంచి రూ.40 వేల వేతనంతో నియమిస్తారు. వారికి 'అగ్ని వీరులు' అని నామకరణం చేసి ఆరు నెలల పాటు రక్షణ వ్యవహారాల్లో శిక్షణ ఇస్తారు. వేతనంలో మూడవ వంతు మొత్తాన్ని కార్పస్ ఫండ్‌కు మళ్లిస్తారు. అంటే తొలి ఏడాది నెలకు రూ. 20 వేలు మాత్రమే వేతనంగా లభిస్తుంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి అయిన తరువాత ఎంపికైన వారిలో 25 శాతం మందిని మాత్రమే రక్షణ శాఖలో కొనసాగించి మిగిలిన 75 శాతం మందిని ఇంటికి పంపేస్తారు. కార్పస్‌లో వారు దాచుకున్న సొమ్ముకు సమాన మొత్తాన్ని సర్కారువారు కలిపి వన్‌టైమ్ బెనిఫిట్ కింద రూ.11- 12 లక్షల వరకు చెల్లిస్తారు. పెన్షన్, గ్రాట్యుటీ లేదా ఇంకే ఇతర బెనిఫిట్స్ ఉండవు. అక్కడితో వారికి సర్కారుతో సంబంధం తెగిపోతుందన్నమాట.
గత రెండేళ్ళ కాలంలో సైన్యంలో రిక్రూట్‌మెంట్ లేదు. కేవలం సైన్యంపై ఖర్చును తగ్గించుకోవాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పథకం ఇప్పుడు ఆవిర్భవించిందన్నది నిర్వివాదాంశం. టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ (టిఒడి)గా పిలిచే ఈ పథకాన్ని ఎక్కడా పరీక్షించలేదు. పైలట్ ప్రాజెక్టు లేదు, నేరుగా అమలు చేస్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా తెలియదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇది తగునా? పూర్వపు మిలటరీ సాంప్రదాయాలు, నైతిక విలువలు, నిబంధనలకు అనుగుణంగా ఈ పథకం లేదని పలువురు విశ్రాంత సైన్యాధికారులు విమర్శించారు. సైన్యం సామర్ధ్యంపై ఇది ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తుందన్నారు. సైనిక దళాలను ఆర్థిక కోణంలో చూడవద్దని, ఖజానాకు ఆదా చేసిన డబ్బు నుంచి సైనిక జీవితం, వృత్తిని అంచనా వేయలేం... అనీ సామాజిక మాధ్యమాల్లో వారు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు, అనుభవ సారాలు. ఈ టిఒడి స్కీమ్ సమాజాన్ని సైనికీకరణ చేయడానికి దారి తీయవచ్చు. దాదాపు 40 వేల మంది యువత ప్రతీ ఏడాది సైన్యం నుండి బయటకు నెట్టబడతారు. ఉద్యోగం పోతే వారిని నిరాశ నిస్పృహలు వెంటాడతాయి. ఆయుధ వినియోగంలో శిక్షణ పొందినవారు ఆర్మీ నుంచి బయటకు వచ్చాక ఖాళీగా ఉంటారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం సైనికులను ఇళ్లకు పంపేయడానికి (డీ మొబిలైజేషన్ ఆఫ్ సోల్జర్స్) 1919 నాటి పంజాబ్ అల్లర్లకు ప్రత్యక్ష సంబంధముందని తేలింది. ఈ టిఒడి విధానం పుట్టిన అమెరికాలోనే దానివల్ల ఉత్పన్నమైన మాజీ సైనికులు ఇల్లు, వాకిళ్లు లేక నేరస్తులుగా స్థిరపడిపోతున్నారని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. కనుక అగ్నిపథ్ భారత సమాజానికి ఎంతమాత్రమూ మంచిది కాదు.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బుధ, గురువారాల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ పథకంతో కేంద్ర ప్రభుత్వం తమని మోసగించాలని చూస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగేళ్ల తరువాత ఏం చేయాలని ఆందోళనల్లో పాల్గొన్న యువత ప్రశ్నించడం సబబైనదే! నిరంతరం దేశభక్తి, జాతీయత అంటూ గొంతు చించుకునే కాషాయ పెద్దలు ఏకంగా సైన్యాన్ని కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తామనడం సిగ్గుచేటు. సైన్యంలో చేరినవారు, లేదా చేరాలనుకునేవారు ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యేది వారి దేశభక్తి, చైతన్య స్ఫూర్తితోపాటు తమకేమైనాగాని తమ కుటుంబానికి ఏ లోటూ లేనివిధంగా సర్కారు ఆదుకుంటుందన్న భరోసా కారణంగానే! మరి కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని ఈ కాంట్రాక్టు సిపాయిలకు ఎలాంటి స్ఫూర్తి కలుగుతుంది? ఏం భరోసా ఉంటుంది? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరిట తెచ్చిన ఈ వినాశకర పథకాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తో సహా సైనికులు లేవనెత్తుతున్న వివిధ సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించాలి. దేశం కోసం సర్వస్వాన్ని అత్యున్నతమైన ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ భద్రతా దళాలకు పూర్తి భద్రత, భరోసా కల్పించాలి.