Oct 27,2023 07:12

          'ఇండియా-భారత్‌' వివాదం మళ్లీ తెరమీదికొచ్చి రాజకీయంగా తీవ్ర అలజడికి కారణమైంది. ఈ మారు వివాదానికి కేంద్రమైంది నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి). అన్ని పాఠ్య పుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్‌'ను ఉపయోగించాలని సాంఘిక శాస్త్రాల విషయాలపై పరిశీలనకు ఎన్‌సిఇఆర్‌టి నియమించిన ఉన్నత కమిటీ సిఫారసు చేసింది. అంతేనా, చరిత్రలో హిందూ రాజుల విజయ గాధలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్రలతో పాటు భారత సంప్రదాయ చరిత్రను విద్యార్థులకు బోధించాలంది. కమిటీ సిఫారసులపై ప్రతిపక్షాలు, విద్యావేత్తలు, మేధావుల నుంచి ముప్పేటా విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సకలానీ స్పందిస్తూ కమిటీ సిఫారసులు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయని, తుది నిర్ణయం తీసుకోలేదని వివరణిచ్చారు. అంతటితోనే వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించలేం. సైద్ధాంతికంగా, ఉద్దేశపూర్వకంగానే మోడీ ప్రభుత్వం పలు వ్యవస్థల్లో తమ హిందూత్వ ఎజెండా చొప్పింపును చూస్తూనే ఉన్నాం. వాటికి కొనసాగింపుగానే ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య ప్రణాళికల్లో మార్పులను అర్థం చేసుకోవాలి.
         ఢిల్లీలో నిర్వహించిన జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న దేశాధినేతలకు రాష్ట్రపతి విందు ఇవ్వగా, ఆ సందర్భంగా కేంద్రం ప్రచురించిన ఆహ్వాన పత్రికలలో తొలిసారి 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా' స్థానంలో 'ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌' అని పేర్కొనడంతో వివాదం చెలరేగింది. అనంతరం జరిగిన ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో ఇండియా పేరు భారత్‌గా మారుస్తారన్న చర్చ వచ్చింది. ఇప్పుడు తిరిగి ఎన్‌సిఇఆర్‌టి తెనెతుట్టెను కదిలించింది. దేశం పేరు మార్పు అనేది అదేదో విపక్షాల ఫోరం 'ఇండియా' అని పేరు పెట్టుకుంది కాబట్టి ఆ పదం ఉచ్ఛరించడం ఇష్టం లేక మోడీ ప్రభుత్వం అధాటుగా తీసుకున్న నిర్ణయం అనుకుంటే పొరపాటు. మన దేశానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై హిందూత్వ వాదుల ప్రతిపాదనలు వేరేగా ఉన్నాయి. హిందూత్వ సిద్ధాంతకర్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ పిలుచుకునే సావర్కర్‌, 1923లో రాసిన 'హిందుత్వ' గ్రంథంలో హిందూస్తాన్‌ సహా పలు పేర్లు సూచించాడు. ఆయనా విష్ణుపురాణంలో ఉన్న భారత ఖండం నామధేయాన్ని ప్రస్తావించాడు. ఎన్‌సిఇఆర్‌టి వేసిన కమిటీ కూడా మక్కీకి మక్కీ అదే ప్రస్తావన చేయడం గమనార్హం. కాబట్టి వాస్తవాలతో, పరిశోధనలతో, ఆధారాలతో కమిటీ సిఫారసు చేయలేదని గుర్తించాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత అమలులో భాగంగానే కమిటీ సిఫారసులను చూడాలి.
        పాఠ్య ప్రణాళికల ఫ్రేమ్‌వర్క్‌పై ఎన్‌సిఇఆర్‌టి 2021లో 25 ఉన్నత కమిటీలు వేయగా సాంఘిక శాస్త్రాల పరిశీలనపై సి.ఐ ఐజాక్‌ ఛైర్మన్‌గా వేసిన కమిటీ ఒకటి. ఐజాక్‌ చరిత్రకారునిగా కంటే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతవాదిగానే ప్రాచుర్యం పొందారు. భారత చరిత్ర పరిశోధన మండలిలో సభ్యుడు కూడా. 1975లో ఎబివిపిలో పని చేశారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు కలిగిన భారతీయ విచార కేంద్రం కేరళ విభాగానికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. ఐజాక్‌ కమిటీలోని మరో సభ్యుడు వందనా మిశ్రా సైతం ఎబివిపి కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పని చేశారు. ఇటువంటి వారున్న కమిటీలు ఎటువంటి సిఫారసులు చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. పౌరసత్వ చట్టం, ఏకరూప పౌర స్మృతి, అగ్నివీర్‌, చరిత్ర వక్రీకరణ, సైన్స్‌లో డార్విన్‌ పరిణామ సిద్ధాంతం ఎత్తివేత... అనేకానేక వివాదాలు ఆర్‌ఎస్‌ఎస్‌ అమ్ముల పొదిలో ఉన్నాయి. విద్యకు కాషాయం కప్పే నానారకాల అంశాలు మోడీ సర్కారు ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానంలో నిక్షిప్తమయ్యాయి. కోట్లాది పిల్లల మెదళ్లల్లో భావ కాలుష్యాన్ని అవి నింపుతున్నాయి. కేరళ వామపక్ష ప్రభుత్వం, మరికొన్ని విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు విద్యపై ఉన్న హక్కును రక్షిస్తూ కేంద్ర విధానాలను ప్రతిఘటిస్తున్నాయి. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, నిజమైన చరిత్ర బోధించాలి. శాస్త్రీయ ఆలోచన పెంపొందించాలి. విద్యలో బిజెపి సంకుచిత రాజకీయాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన తరుణం.