పార్లమెంట్, రాష్ట్రాలు, ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం విశ్వాసం ఉంచాలి. సెస్సులను దుర్వినియోగపరచడాన్ని ఆపాలి. కేంద్ర ప్రభుత్వ పద్దులను తనిఖీ చేసిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ వారం పార్లమెంటుకు సమర్పించిన తాజా నివేదికలో కేంద్రం సెస్సులను దుర్వినియోగ పరచిన తీరును బయట పెట్టింది. 2018-19లో వసూలు చేసిన మొత్తం పన్నుల్లో 40 శాతం దాకా భారత సంచయిత నిధి (సిఎఫ్‌ఐ) వద్ద గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం అట్టిపెట్టు కుందని 'కాగ్' నివేదిక వెల్లడించింది. 35 వేర్వేరు సెస్సులు, లెవీలు, చార్జీల కింద ఈ సంవత్సరంలో కేంద్రానికి రూ.2.75 లక్షల కోట్లు రాగా, కేవలం రూ.1.64 లక్షల కోట్లు మాత్రమే నిర్దిష్ట రిజర్వ్ నిధులకు చెల్లించింది. నిజానికి వసూలు చేసిన ఈ సెస్సులన్నీ రిజర్వు నిధులకు ఉద్దేశించినవే. కేంద్రం తీసుకున్న ఈ చర్య భారతదేశ రెవిన్యూ, ద్రవ్య లోటును తక్కువ చేసి చూపుతోంది. అంతేకాదు, పార్లమెంటు ఏ ప్రయోజనాలను ఆశించి ఆరోగ్య, విద్యా, మౌలిక సదుపాయాల సెస్సుల విధింపునకు ఆమోదం తెలిపిందో ఆ లక్ష్యం దీనివల్ల నెరవేరకుండా పోతున్నదని 'కాగ్' పేర్కొంది. దీనిపై వెంటనే దిద్దుబాటు చర్యలు తీసు కోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను 'కాగ్' కోరింది. కాగ్ ఇలా కోరడం కూడా ఇదే మొదటిసారి కాదు. గత పదేళ్ళుగా, ముడి చమురుపై వసూలు చేసిన రూ.1.25 లక్షల కోట్లలో ఒక్క పైసా కూడా చమురు పరిశ్రమ అభివృద్ధి సంస్థకు బదిలీ చేసిన పాపాన పోలేదు. ఈ సెస్ ఉద్దేశించినదే ఆ సంస్థకు సాయం చేయడానికి, కానీ అది జరగలేదని కాగ్ తన నివేదికలో విమర్శించింది. పెట్రోల్, డీజిల్‌లపై అదనపు ఎక్సైజ్ సుంకాలుగా వసూలు చేసిన భారీ సెస్ మొత్తాలను వాస్తవానికి రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాల్సి వుంది కానీ అందులో కొంత భాగాన్ని సంచయిత నిధి (సిఎఫ్‌ఐ)లో వుంచుతున్నారని పేర్కొంది. ఇకపోతే, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణకు కారణమైన జిఎస్‌టి నష్టపరిహార సెస్సును కూడా కేంద్రం వదిలిపెట్టడం లేదు. జిఎస్‌టి ఏర్పాటైన మొదటి రెండేళ్ళ కాలంలో రూ.47,272 కోట్లు వెళ్లాలి. కానీ అలా జరగలేదు. పైగా, రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన ఈ సెస్ మొత్తాలను రాష్ట్రాలకు గ్రాంట్స్- ఇన్-ఎయిడ్‌గా చూపించారు. ఇది కేంద్రం-రాష్ట్రాల మధ్య ఆర్థిక గణాంకాల వక్రీకరణలకు దారి తీసింది.
ఆదాయపు పన్నుపై కొత్తగా విధిస్తున్న 4 శాతం ఆరోగ్య, విద్యా సెస్‌లో కొంత భాగం విద్యా రంగానికి కేటాయిస్తుండగా, ఆరోగ్య రంగానికి నిధి ఏర్పాటు చేయలేదు. కస్టమ్స్ సుంకంపై వేస్తున్న సామాజిక సంక్షేమ సర్‌చార్జి విషయంలోనూ అది ఇలాగే వ్యవహరించిందని 'కాగ్' విమర్శించింది. ఈ వైఫల్యాల్లో ఏ ఒక్కదాన్ని కూడా అనుకోకుండా, అనాలోచితంగా జరిగిందని భావించలేమని 'కాగ్' వ్యాఖ్యానించింది. 14వ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా రాష్ట్రాల వంతునకు వచ్చే పన్నుల వాటా 42 శాతానికి పెరిగినప్పటి నుండి తన రెవిన్యూ పెంచుకోవడానికి సెస్సులు, సర్‌చార్జిలపై కేంద్రం ఆధారపడిందనడంలో ఎలాంటి రహస్యం లేదని పేర్కొంది. అసలు సెస్ వసూళ్ళ మొత్తాలు ఈ పూల్ కిందకు రావు. ఒకవేళ, ఇటువంటి లెవీలు తన పన్నుల వ్యవస్థను సరళీకరిం చాలని ప్రయత్నిస్తున్నందున, నిర్దిష్ట ప్రజా వ్యయానికి అవస రమైన నిధుల కోసం ఈ పని చేశామంటే, దానికి తగిన కారణం చూపాలి. అది కూడా ఆమోదయోగ్యమైన రీతిలో సహేతుకంగా వుండాలని 'కాగ్' పేర్కొంది. అయితే, జిఎస్‌టి నష్టపరిహారం చెల్లింపు వివాదం లేదా రాష్ట్రాలను పరిగణ నలోకి తీసుకోకుండానే వ్యవసాయ బిల్లులను ఆమోదించడం వంటి అంశాల్లో...కేంద్రం ఫెడరల్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోంద న్న వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వున్న...అభిప్రాయ భేదాలను పూడ్చుకుని విశ్వాసాన్ని పునరుద్ధరించడం చాలా కీలకం. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాలతో ప్రారంభించి చూసి నట్లైతే ఈ సెస్సులను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. కరోనా కారణంగా, దానితో దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ వల్ల ఆదా యాలు పడిపోయి, ఉపాధి అవకాశాలు క్షీణించిన పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకేనైనా ముందుకు రావడం అవ సరం. చిట్టచివరిగా, ఈ పాఠాలను నేర్చుకోవడానికి ఆడిట్ నిర్ధారణల కోసం వేచి వుండే అవసరం అటు పార్లమెంట్‌కు ఇటు ప్రజలకు లేకుండా...సెస్సు వసూళ్ళ నిర్వహణలో పూర్తి పారదర్శకత అత్యంత ఆవశ్యకమని 'కాగ్' సూచించింది.
('ది హిందూ' సంపాదకీయం)










