చెన్నై : లైంగిక వేధింపులకు గురిచేశారని పూర్వ విద్యార్థిని చేసిన ఆరోపణలపై ప్రతిష్టాత్మక కళాక్షేత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిపద్మన్‌ను సోమవారం తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'పద్మన్ నన్ను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఓసారి నన్ను తన ఇంటికి రమ్మన్నాడు. దానికి నేను నిరాకరించాను. దాంతో అతను డ్యాన్స్ డ్రామాలో ఓ కీలకమైన పాత్రని తీసుకుని వేధించేందుకు ప్రయత్నించాడు. ప్రొఫెసర్ వేధింపుల వల్ల నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ నుండి తప్పుకున్నాను' అని ఆమె ఆరోపించారు.
కాగా, కళాక్షేత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్మన్‌తోపాటు, ముగ్గురు రిపర్టరీ ఆర్టిస్టులు సంజిత్ లాల్, సాయి కృష్ణన్, శ్రీనాథ్‌ల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 90 మంది విద్యార్థులు గత గురువారం తమిళనాడు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ ఎ.ఆర్ కుమారికి లేఖ రాశారు. ఈ విషయంపై కుమారి మీడియాతో మాట్లాడుతూ... 'ఈ ఇన్‌స్టిట్యూట్‌లో 2008 నుండి లైంగిక వేధింపులు ఉన్నాయని పూర్వ విద్యార్థులతో సహా అందరూ నాతో చెప్పారు. లైంగిక ఆరోపణలకు సంబంధించిన నివేదికను నేను ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కి సమర్పిస్తాను. ఈ నివేదికను స్టాలిన్ పరిశీలించిన తర్వాత తదుపరి చర్యల కోసం ప్రభుత్వం పోలీసులను నిర్దేశిస్తుంది' అని ఆమె అన్నారు.
శుక్రవారం ప్రొఫెసర్ పద్మన్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు), తమిళనాడు మహిళా వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4 (మహిళలపై వేధింపులక జరిమానా) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కళాక్షేత్రంలో విద్యార్థినీలను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ ఇనిస్టిట్యూట్ మాజీ డైరెక్టర్ లీలా శాంసన్ గతేడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.










