Jul 26,2023 11:55

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఉపాధ్యాయ భార్యాభర్తలతో విద్యాశాఖలోని ఓ అధికారి ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. మంగళవారం ఉదయం నుంచి ఉపాధ్యాయ సంఘాలు, వివిధ గ్రూపుల్లో ఈ సంభాషణ వైరల్‌ అయింది. ఆ అధికారి తీరుపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ అధికారి.. ఉపాధ్యాయులను బూతులు తిట్టడంతోపాటు బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఆయన ఛాంబర్‌లో ఎప్పుడూ అధికారపార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఉంటారని, ఆ అధికారి వద్దకు విజ్ఞప్తులు, ఫిర్యాదులు తీసుకెళ్లిన ప్రతిసారీ ఉపాధ్యాయులను ఆయన తీవ్ర పదజాలంతో తిట్టేవారని ఆరోపణలున్నాయి.

                              ఉపాధ్యాయులతో డీఈఓ రాఘవరెడ్డి ప్రవర్తిస్తున్న తీరు బాగోలేదు : ఎమ్మెల్సీ రాంగోపాలరెడ్డి

ఉపాధ్యాయులతో డీఈఓ రాఘవరెడ్డి ప్రవర్తిస్తున్న తీరు బాగోలేదంటూ ఎమ్మెల్సీ రాంగోపాలరెడ్డి సోమవారం నాటి 'స్పందన' కార్యక్రమంలో కలెక్టరు విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు. బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలకు పాల్పడి.. ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న డీఈవో రాఘవరెడ్డిని పక్కన పెట్టి.. విచారణ చేపట్టాలని లేఖ కూడా రాశారు. విచారణ సమయంలో ఆయన విధుల్లో ఉంటే ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉండదని తెలిపారు.

                                                       ఉపాధ్యాయుడితో విద్యాశాఖ అధికారి సంభాషణ...

అధికారి : 'యూజ్‌లెస్‌ ఫెలో. ఇల్లీగల్‌గా స్కూల్‌లో ఉంటే సరిపోతుందనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు ఓరు.. నేనంటే. నువ్వు నామీద వాట్సప్‌లో పెట్టిన పేపర్‌ క్లిప్పింగ్‌లు అన్నీ తీసుకుని రా.. రేపు. పనికిమాలిన గాడిద కొడకా.. బడి చెప్పుకోక ఏం పనిరా నీకు.. యూజ్‌లెస్‌ ఫెలో.. రేపు వచ్చి రెక్టిఫికేషన్‌ ఆర్డర్‌ తీసుకుని పోదురా.. అర్థమైందా..

ఉపాధ్యాయుడు : ఓకే సార్‌..

అధికారి : మీ భార్యకు ఫోన్‌ ఇవ్వు. నమస్తే సర్‌ (ఉపాధ్యాయుడి భార్య). నువ్వయినా నీ మొగుడిని సరిచేసుకో అమ్మా.. నీ పిల్లలు అన్యాయమైపోతారు. జాగ్రత్త. బిడ్డలకు కూడా పిల్లలను కూడా ఎవరూ ఇవ్వరు.. నిన్న ఎమ్మెల్యేకి వీడి గురించి చెబుదామనుకున్నా.. ఊళ్లో పరువు పోతుందని చెప్పలేదు.. వీడికేం పని అమ్మా? నా మీద తిక్క నా కొడుకులు ఎవరో పేపర్‌లో రాస్తే.. వీడు అందరికీ పంచుతాడా వాట్సప్‌లో ?

ఉపాధ్యాయుడు : సార్‌.. అది మామూలుగా ఫార్వర్డ్‌ మెసేజ్‌ సార్‌

అధికారి : అవునమ్మా ఈ గాడిద కొడుకుకు ఏం పని.. నీ మీద ఏమన్నా ఒకటి వస్తది.. నేను వేరే వాళ్లకు పంపితే బాగుంటదా.. నువ్వూ స్కూల్‌ అసిస్టెంట్‌వే కదా.. చెప్పు బాగుంటదా నీకు.. వీడికి ఓ మూడు రోజులు బువ్వ పెట్టగాకు దారికొస్తాడు.. లేదంటే నిన్ను చంపేస్తాడు. మెంటల్‌ ఉంది యూజ్‌లెస్‌ ఫెలోకి .. రేపు రమ్మను.. రెక్టిఫికేషన్‌ ఆర్డర్‌ తీసుకుని పొమ్మను..'