Aug 26,2023 11:36
  • ముస్లిం విద్యార్ధిపై విషం గక్కిన టీచర్‌
  • సహచర విద్యార్థులతో చెంపదెబ్బలు
  • సర్వత్రా ఆగ్రహం

ముజఫర్‌నగర్‌ : ఉత్తరప్రదేశ్‌లో మైనారిటీల రక్షణ, గౌరవం గాలిలో దీపంలా మారుతున్నది. యోగి సర్కారు తీరుతో రాష్ట్రంలో ద్వేషపూరిత సంస్కృతి తీవ్రమవుతున్నది. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలపై దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు విద్యాసంస్థలకూ చేరాయి. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే.. ఆ వర్గం విద్యార్థులను తోటి విద్యార్థులతో కొట్టిస్తున్నారు. ముస్లిం బాలుడిని చెప్పుతో కొట్టాలంటూ ఒక టీచర్‌ విద్యార్థులను ప్రోత్సహించిన ఘటన ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, న్యాయవాద సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను 'ద్వేషపూరిత సంస్కృతి'గా వారు అభివర్ణించారు. చిన్నారులను విద్వేషానికి బలి చేస్తున్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముస్లింల పట్ల హేయ భావాన్ని చిన్న వయస్సు నుండే పిల్లలకు నూరిపోయడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఎక్కాలు సరిగా చెప్పలేదన్న కారణంతో 2వ తరగతి చదువుతున్న ముస్లిం విద్యార్ధిని, టీచర్‌ పక్కనున్న హిందూ విద్యార్ధులతో కొట్టించింది. ఒక విద్యార్ధి కొట్టగానే అవతల విద్యార్ధి ఏడుస్తున్నాడు, దీంతో 'ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అతడిని గట్టిగా కొట్టడం లేదు? అని టీచర్‌ గద్దించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ ముస్లిం విద్యార్ధిని మరింత గట్టిగా కొట్టేలా ఇతర విద్యార్ధులను రెచ్చగొడుతోంది. దీంతో మరో విద్యార్ధి అక్కడకు వచ్చి ముస్లిం విద్యార్ధిని గట్టిగా కొట్టాడు, ఆ బాలుడి నడుంపై కూడా కొట్టాలంటూ టీచర్‌ చెప్పడం వినిపించింది. ఆ టీచర్‌ ఒక వ్యక్తితో మాట్లాడుతూ, తానేం చేస్తోందో చెబుతున్నట్లు ఆ వీడియోలో వుంది. ఇదంతా ఎలా, ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ వీడియోలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వినిపించినట్లు పోలీసులు తెలిపారు. 'ఈ వీడియోలో కొన్ని అభ్యంతరకరమైన మాటలు కూడా వినబడ్డాయి. మేం స్కూలు ప్రిన్సిపల్‌తో మాట్లాడాం. ముస్లిం విద్యార్ధులు సరిగా చదవడం లేదని, వారి ఇళ్లల్లో తల్లులు పిల్లల చదువులు పట్టించుకోవడం లేదని ఒక మహిళా ఉపాధ్యాయురాలు అంది. వీడియో తీసిన వ్యక్తి దీన్ని ధృవీకరించాడు.'' అని ముజఫర్‌నగర్‌ పోలీసులు ఒక వీడియోలో తెలిపారు. ఈ ఘటనపై తాను పోలీసు ఫిర్యాదు ఇవ్వాలనుకోవడం లేదని బాధిత విద్యార్ధి తండ్రి తెలిపారు. తాము మధ్యతరగతి వర్గానికి చెందినవారమని, పోలీసు ఫిర్యాదు చేయకుండా పిల్లాడిని ఇక్కడ నుండి తీసేసి, వేరే స్కూల్లో చేర్పిస్తామని తెలిపారు. ముజఫర్‌నగర్‌లోని ఖుబ్బాపూర్‌ గ్రామంలో నేహా పబ్లిక్‌ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. టీచర్‌ను త్రిప్తా త్యాగిగా గుర్తించారు.
దీనిపై బాలల హక్కుల సంస్థ (ఎన్‌సిపిసిఆర్‌) తీవ్రంగా స్పందించింది. పిల్లల గుర్తింపును కాపాడేందుకు ఆ వీడియోను షేర్‌ చేయవద్దని ఎన్‌సిపిసిఆర్‌ చీఫ్‌ ప్రియాంక కనూంగూ కోరారు. విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.

అమానుషం : సీతారాం ఏచూరి

ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సుహృద్భావం పునాదులు ధ్వంసమవుతున్నాయి, అక్కడ గ్రీస్‌లో, భారతదేశంలో ప్రజాస్వామ్యంపై ప్రధాని మోడీ ఉపన్యాసాలు ఇస్తుంటే ఇక్కడ దేశంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని, అమానవీయ చర్యలు చోటు చేసుకుంటున్నాయని సిపిఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

ఈ దారుణాన్ని మోడీ ఖండిస్తారా? : కపిల్‌ సిబల్‌

రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ.. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ మాట్లాడతారా? లేక ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండిస్తారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కిరోసిన్‌ను చల్లి బీజేపీ మంట రాజేస్తున్నదని కాంగ్రెస్‌ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అమాయక పిల్లల మనస్సులలో వివక్ష అనే విషాన్ని నాటడం, పాఠశాల వంటి పవిత్ర స్థలాన్ని విద్వేషాల మార్కెట్‌గా మార్చే ఒక ఉపాధ్యాయుడు దేశం కోసం ఏమీ చేయలేడు'' అని ఆయన అన్నారు. ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌ కూడా ఈ సంఘటనను ''ప్రబలమైన హిందూ రాడికలైజేషన్‌ ఫలితం''గా అభివర్ణించింది. గత తొమ్మిదేండ్ల మోడీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.

విద్వేషం సాధారణమవుతోంది : ఎఐఎంఐఎం చీఫ్‌

ఈ ఘటనపై ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. 'జరిగినదానికి యోగి ఆదిత్యనాథ్‌ కారకులు. బహుశా ఆ టీచర్‌ని లక్నోకి పిలిచి సన్మానిస్తారేమో, ఎంతమంది ముస్లిం పిల్లలు ఇలాంటి అమానుషాలను మౌనంగా భరిస్తున్నారో లెక్కలేదు. పాఠశాలల్లో ముస్లిం పిల్లలను జిహాదీ లేదా పాకిస్తానీ అని పిలవడం సర్వసాధారణమై పోయింది' అని ఒవైసి పేర్కొన్నారు.

శశిథరూర్‌ దిగ్భ్రాంతి

నమ్మశక్యంగాకుండా వుంది. మన దేశంలో ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను, సిగ్గుతో మనందరం తలవంచుకోవాలి, మన రాజ్యాంగ హక్కులు, స్వేచ్ఛలు ఇలా నీరుగారిపోతున్నాయని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ వ్యాఖ్యానించారు.