న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని త్రిప్తా త్యాగి అనే ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్.. తరగతి గదిలో ఓ ముస్లిం విద్యార్థిని ఇతర విద్యార్థులతో చెంపదెబ్బలు కొట్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) మండిపడింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంపై నాలుగు వారాల్లోగా వివరణాత్మక నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఈ ఘటనలో టీచర్‌పై తీసుకున్న చర్య, నమోదైన ఎఫ్‌ఐఆర్, ముస్లిం విద్యార్థి కుటుంబానికి చెల్లించిన నష్ట పరిహారం, భవిష్యత్తులో ఇలాంటి అవమానకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలు వంటివి కూడా నివేదికలో చేర్చాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శితోపాటు, డిజిపికి కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు జారీ చేసింది.
కాగా, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మైనారిటీ కమిషన్ కూడా ముజఫర్ నగర్ జిల్లా మెజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. మెజిస్ట్రేట్ కూడా సెప్టెంబర్ 6 లోపు ఈ విషయంపై సమాధానం ఇవ్వాలని, వ్యక్తిగతంగా కార్యాలయంలో హాజరుకావాలని కోరింది. అలాగే విచారణ సమయంలో టీచర్ త్రిప్తా త్యాగి కూడా హాజరుకావాలని మైనారిటీ కమిషన్ అధ్యక్షుడు అష్పాక్ సైఫీ తెలిపారు.










