Oct 22,2023 07:07

'నాకీ నెల పీరియడ్‌ స్కిప్‌ అయ్యింది.' అద్దం ముందు నిలబడి, కళ్ళకి కాటుక పెట్టుకుంటూ చెప్పింది శోభన. షర్టుకి గుండీలు కుట్టుకుంటున్న నేను ఒక్క నిముషం శిలా ప్రతిమలా కూర్చున్న చోట అలాగే కూర్చుండిపోయాను. ఆ సమయంలో తండ్రిని కాబోతున్నానన్న ఆనందం కంటే.. ఇప్పుడే ఇబ్బందుల్లో బతుకుతున్న మా ఇద్దరి జీవితాల్లోకి ఇంకో బాధ్యత రాబోతుందనే భయమే ఎక్కువ వేసింది. ఈ సినిమాల్లో చూపించినట్టు ఎగిరి గంతేసి, పెళ్ళాన్ని ఎత్తుకుని గిరగిరా తిప్పడం, నోట్లో చక్కెర పోయడం లాంటివి అటుంచితే.. తలెత్తి తన ముఖంలోకి చూడాలన్నా సిగ్గేసింది. అందుకే ఏవీ పట్టనట్టు మళ్ళీ నా పనిలో నేను పడిపోయాను. తను కూడా నా దగ్గర్నుంచి అలాంటివేమీ ఆశించనట్టు..
'నాలుగు గంటలకి నీళ్ళొస్తాయి. మర్చిపోకుండా పట్టి పెట్టు. అలానే సాయంత్రం సంతకెళ్ళి, కూరగాయలు కొనుక్కునిరా. రేపు వండటానికి ఏం లేవు ఇంట్లో..' అంటూ లంచ్‌ బాక్స్‌ బ్యాగులో పెట్టుకుని, బయల్దేరి కంపెనీకి వెళ్ళిపోయింది.
నేను షర్టు అవతల పడేసి, గుమ్మంలోకొచ్చి కూలబడ్డాను.
సన్నగా వర్షం మొదలైంది.
మెల్లగా మనసులోకి ఆలోచనల గుంపొకటి చొరబడింది.
నాన్నమ్మ గుర్తొచ్చింది.
అమ్మానాన్న లేని నన్ను చిన్నప్పటి నుంచీ కంటికి రెప్పలా కాపాడింది ఆమే. ఉన్నట్టుండి ఆవిడకి ఆరోగ్యం పాడవడంతో నేను తొమ్మిదో తరగతిలోనే బడి మానేసి, పనులకు వెళ్ళాల్సొచ్చింది. పెయింట్‌ కొట్టడానికో, తాపీ పనులకో రోజుకూలీగానో వెళ్ళేవాడ్ని. కొన్నాళ్ళకి అవీ మానేసి మంచాన పడ్డ నాన్నమ్మని ఇంటి పట్టునే ఉండి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నేను ఇంట్లోనే ఉండిపోతే ఇల్లు గడవడం కష్టం. కాబట్టి టౌన్లో తెల్సినవాళ్ళ దగ్గర టైలరింగ్‌ నేర్చుకుని, అప్పు చేసి ఓ కుట్టుమిషన్‌ కొనుక్కుని, ఆ పని ప్రారంభించాను.
పల్లెటూరు.. అది కూడా టౌనుకి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఊళ్ళో వాళ్ళెవరూ కూడా పెద్దగా రెడీమేడ్‌ డ్రెస్సులు కొనడానికి వెళ్ళేవారు కాదు. వారం వారం ఊర్లోకి తెచ్చి అమ్మే విడి గుడ్డ కొనుక్కుని, దాన్ని కుట్టించుకోవడానికి అందరూ నా దగ్గరికే వచ్చేవారు.
అలా అందరూ వచ్చినట్టే ఓ సంక్రాంతికి బట్టలు కుట్టించుకోవడానికి శోభన కూడా మా ఇంటికొచ్చింది. నేను ఆది కొలతలు తీసుకోబోతుంటే తను కొంచెం ఇబ్బందిపడుతూ వెనక్కు జరిగింది. తన మొహమాటాన్ని గమనించి టేపు తనతో పాటు వచ్చిన తన ఫ్రెండు చేతికి అందించాను. కొలతలు ఇచ్చేసి, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
అదే నేను మొదటిసారి శోభనని అంత దగ్గర నుంచి చూడడం. పెద్ద పెద్ద కళ్ళూ, చామనచాయ రంగు, ఒత్తైన ఉంగరాల జుట్టూ, ముచ్చటైన కట్టూ బొట్టు. చూడ్డానికి లక్ష్మీదేవి లంగా వోణీ వేసుకుని ఊళ్ళో తిరుగుతున్నట్టు ఉండేది తను.
అప్పట్నించీ తనని ఇంకొకసారి చూడాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుండేది. అందుకే తన బట్టలు నేనెప్పుడో కుట్టేసినా, తీసుకెళ్ళడానికి తనొచ్చినప్పుడల్లా ఇంకా అవలేదని అబద్ధం చెప్పేవాడిని. వచ్చిన ప్రతిసారీ మా నాన్నమ్మ తనని మాట్లాడిస్తూ ఉండేది. ఇంట్లో వాళ్ళిద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటుంటే, ఇంటి బయట పందిట్లో కూర్చుని కుట్టుపని చేస్తుండే నేను, తను మాట్లాడుతున్నప్పుడు మాత్రం కుట్టడం ఆపేసి.. తన మాటల్ని ఎంతో ఆసక్తితో వింటుండేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే అలా వాళ్ళు మాట్లాడుకోవడం వల్లే నాకు శోభన గురించి అన్నీ వివరంగా తెలిసాయి.
తనకి చిన్నప్పుడే అమ్మ చనిపోయిందనీ, నాన్న వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే, వాళ్ళ మావయ్య తనని తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడనీ, ఆయనకున్న ఇద్దరి కొడుకుల్లో చిన్నవాడికిచ్చి తనని పెళ్ళి చెయ్యాలనుకుంటున్నారనీ, కానీ వాడంటే తనకి ఇష్టం లేదనీ., ఎప్పుడూ నాన్నమ్మతో చెబుతుండేది శోభన.
ఈ విషయాలన్నీ తెలిశాక తన మీద నాకున్న ఇష్టం ఇంకా ఎక్కువైంది. ఎప్పుడు టైం దొరికినా ఏదో ఒక సాకుతో తనని మాట్లాడిస్తూ ఉండేవాడిని. అలా మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య ఓ మంచి పరిచయం చోటుచేసుకుంది. సంవత్సరం తిరిగే లోపే ఆ పరిచయం కాస్తా పెరిగి, ప్రేమగా మారింది. ఫోనుల్లో మాట్లాడుకోవడం. అప్పుడప్పుడూ రహస్యంగా చెరువు గట్టు మీద కలవడం. ఇలాంటివన్నీ జరుగుతుండగానే నాన్నమ్మకి అనారోగ్యం ఎక్కువై, చనిపోయింది. నేనా బాధలోంచి పూర్తిగా కోలుకోక ముందే శోభన వాళ్ళింట్లో తనకి పెళ్ళి చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. వాటితో పాటూ వాళ్ళ చిన్నబావ ఆగడాలు కూడా ఎక్కువయ్యాయి. తనని రెండు, మూడుసార్లు పట్టుకుని బలవంతం చెయ్యబోయాడంట. అదే విషయం ఇంట్లో వాళ్ళత్తకి చెబితే ఆమె 'ఏం కాబోయే మొగుడే గదా. ఆ మాత్రం సరసమాడితే తట్టుకోలేవా?' అని తన మీదే విరుచుకు పడిందంట. ఇవన్నీ విన్న రోజు నాకు చాలా కోపం వచ్చింది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. శోభనని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోవడం తప్ప.. ఇంకోదారి కూడా కనిపించలేదు. తనూ దానికి ఒప్పుకోవడంతో ఆ మర్నాడు పొద్దున్నే ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇద్దరం ఊరి నుండి బయటపడి, ఫస్టు బస్సు పట్టుకుని ఈ సిటీకి వచ్చేయడం జరిగింది.
వచ్చిన రోజు సాయంత్రమే గుళ్ళో పెళ్ళి చేసుకుని, నా దగ్గరున్న డబ్బులతో ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నాం. తర్వాత వంట సామాన్లూ వగైరా అన్నీ కొనుక్కుని, మా సంసారం మొదలుపెట్టాం. మొదటి నెలరోజులూ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఎలాగోలా భరించి, నిలబడ్డాం. ఇక్కడ నా టైలరింగ్‌ పని అంతంత మాత్రంగానే ఉండడంతో రెండో నెలలో తను కూడా పని చేయక తప్పలేదు. తనకున్న ఇంటర్మీడియట్‌ క్వాలిఫికేషన్‌తో చిన్న కంపెనీలో చేరింది శోభన. రావడానికి, పోవడానికీ బస్సు సౌకర్యం అంతా కంపెనీనే చూసుకుంటుంది. నెలకి ఎనిమిది వేలు ఇస్తుంది. ఇహ నా సంగతికొస్తే ఈ చుట్టుపక్కల జనాలంతా మాల్స్‌కి వెళ్ళి ఆఫర్స్‌లో రెడీమేడ్‌ దుస్తులు కొనడానికే మక్కువ చూపుతున్నారు.. కానీ, కుట్టించుకోవాలనుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి వచ్చే గిరాకీలను బట్టి మహా అయితే ఓ మూడు నాలుగు వేలు వస్తున్నాయంతే. అలా ఇద్దరం కలిసి సంపాదించినా నెలాఖరికి పన్నెండు వేలకు మించి రాదు. అందులో పదివేలు ఇంటి రెంటుకి, తినడానికీ సరిపోతుంది. ఇంకో రెండు వేలు ఎంతో పకడ్బందీగా ఖర్చుపెడితే కానీ చిన్నా చితకా అవసరాలు తీరవు. మధ్యలో నాకో, తనకో జ్వరమో గిరమో పట్టుకుందంటే ఉన్న సరదా కూడా తీరిపోతుంది.
అందుకే నేనీ పని మానేసి, తనతో పాటు కంపెనీకి వెళ్దామంటే కనీసం పదైనా పాసయ్యి ఉండాలంటారు ఆ కంపెనీ వాళ్ళు. పోనీ నైట్‌ వాచ్‌మేన్‌గా అయినా పోదామంటే శోభన ససేమిరా వద్దంటోంది. రాత్రిళ్ళు ఒంటరిగా ఉండలేనని తెగ గొడవ చేస్తోంది. సరే ఇవన్నీ కాదు, ఎక్కడైనా కూలి పనులైనా దొరుకుతాయేమో చూద్దామనుకుంటే వానాకాలం కావడంతో తాపీ పనులూ, పెయింటు పనులూ ఎవరూ చెయ్యట్లేదు. ఇంకేం చెయ్యాలి నేను. తల కొట్టుకుని, వచ్చిన అరకొరా బట్టల్ని కుట్టుకుంటూ కూర్చోవడం తప్ప.
వాన జల్లు విసురుగా ముఖాన్ని తాకే సరికి ఒక్కసారిగా ఆలోచనల గొలుసు తెగిపోయి, మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.
ముఖం కడుక్కుని, కట్‌ చేసి పెట్టిన రెండు జతల యూనిఫార్మ్‌ బట్టలుంటే కుట్టేసి, పైకి లేచే సరికి టైం దాదాపు మూడున్నర అయ్యింది. పొద్దున్నే వండిన పులిహోరని నాలుక ఎంత వద్దంటున్నా బలవంతంగా లోపలికి కుక్కి, బాటిల్లోని నీటిని నోట్లో పోసుకుంటుంటే గుర్తొచ్చాయి శోభన వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలు. చెయ్యి కడుక్కునేలోపే మంచి నీళ్ళ ట్యాంక్‌ మోసుకుంటూ వచ్చే ట్రాక్టరు, గంట కొట్టుకుంటూ మా ఇంటి ముందు నుంచి వెళ్ళి, వీధి చివర నిలబడింది. నేను వంటగదిలోంచి రెండు ప్లాస్టిక్‌ బిందెల్ని పట్టుకుని ట్రాక్టరు దగ్గరికి పరిగెత్తుకెళ్ళే సరికి ఓ పది మంది ఆడవాళ్ళు అప్పుడే క్యూలో నిలబడున్నారు.
వాళ్ళ ముచ్చట్లు, గొడవలు దాటుకుని నా వంతు వచ్చేసరికి దాదాపు అరగంట పైనే పట్టింది. నీళ్ళు పట్టుకుని నా పాటికి నేను వచ్చేస్తుంటే, 'ఏం టైలరు బాబూ.. పెళ్ళాం చెయ్యాల్సిన ఆడంగి పనులన్నీ నువ్వు చేస్తున్నావే!?' అని ఎవరివో ఎగతాళి మాటలు. వినబడ్డా వినబడనట్టు వెళ్ళిపోయే నన్ను చూసి వెనుక నుంచి మళ్ళీ ఇకఇకలు, పకపకలూ.
బిందెల్ని వంటగదిలో దించేసి, కూరగాయల సంచీ తీసుకుని బయటకు అడుగు పెట్టబోతుంటే అప్పటిదాకా రాలుతున్న సన్న చినుకులు ఉన్నట్టుండి పెద్దవయ్యాయి. ఇంట్లో ఉన్న ఒక్క గొడుగునీ శోభన తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడేం చేయడం అని ఆలోచిస్తుంటే తలుపు వెనుక కొక్కేనికి తగిలించున్న ప్లాస్టిక్‌ గూడ కాగితం కనబడింది. దాన్ని నెత్తి మీదేసుకుని సరసరా వీధిలోకి నడిచాను. సంతకి చేరుకునే సరికి తొక్కేసిన కుళ్ళు టమాటాలు, రోడ్డుకి అడ్డంగా పడేసిన పుచ్చు వంకాయలతో రొచ్చు రొచ్చుగా ఉందా వాతావరణం.
జేబులో నూట యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి. శోభనకి జీతం రావడానికి ఇంకా రెండు రోజులుంది. అప్పటిదాకా ఈ డబ్బులతోనే ఎలాగోలా మ్యానేజ్‌ చెయ్యాలి. అందుకే వంద రూపాయలు పెట్టి కావాల్సిన కూరగాయలేవో కొన్నాను. మిగతా యాభై రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకని అక్కడ్నించి కదలబోయాను. కానీ అప్పుడే నా కన్ను ఎదురుగా ఉన్న బొప్పాయి కాయల మీద పడింది. వాటిని చూడగానే నా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండే వసంతక్క జ్ఞాపకానికొచ్చింది. నెలకోసారి మా ఇంటికొచ్చి, మా పెరట్లో ఉన్న బొప్పాయి చెట్టులోంచి దోరగా పండిన కాయల్ని తీసుకెళ్తుండేది తను. ఎందుకలా చేస్తుందో నాకప్పుడు భోదపడేది కాదు. తర్వాత్తర్వాత నా స్నేహితుల ద్వారా తెలిసిందేమంటే, ఆమె ప్రెగెన్సీ వచ్చే సూచనలు కనిపించినప్పుడల్లా అలా బొప్పాయి కాయలు తిని పోగొట్టుకుంటోందనీ..
'ఒకటి ఎంత?' అడిగాను బొప్పాయి కాయలకేసి వేలు చూపిస్తూ.
'కాయ నలభై రూపాయలు.' అంది అమ్మే ఆవిడ.
'ఇరవై చేసుకుని ఇవ్వండి.'
'ఆఉ...! ఆ ఇరవై కూడా ఎందుకు? ఊరికే ఎత్తుకుపోకూడదూ!?'
బేరమాడదామనుకుంటే ఇలా మాట్లాడుతుందేంటి అనుకుని ఆమె వైపు గాభరాగా చూశాను.
'లేకపోతే ఏందయ్యా ఓ అయిదో, పదో తగ్గించుకోమని అడిగితే సరే, ఏకంగా సగం రేటు తగ్గించేస్తున్నావే!? నువ్వు చెప్పిందానికి గిట్టుబాటు కాదులే గానీ, లాస్టు మాట.. కొంటే ముప్పై అయిదు రూపాయలిచ్చి కొను.. లేదంటే పో' ఖరాఖండిగా చెప్పిందామె.
అంత ఇదిగా చెప్పిన తర్వాత ఇంకేం బేరమాడుతాం. ఆమె అడిగినట్టుగానే డబ్బులిచ్చేసి ఒక కాయ కొని, సంచీలో వేసుకుని బయల్దేరాను. ఇంటికొచ్చేసరికి సగానికి పైగా తడిసిపోయాను. బయట ఒకటే ఈదురు గాలి. ఇంట్లో ఓ మూల కురుస్తోంది. పొద్దున్నుంచీ లోలోపల నాకెందుకో చిరాగ్గా ఉంది. కొంచెం స్నానం చేసి రిఫ్రెష్‌ అయితే బాగుణ్ణనిపించింది. వెంటనే స్టౌ మీద కొన్ని నీళ్ళు కాగబెట్టుకుని, తలంటు పోసుకున్నాను. గోరువెచ్చటి నీరు ఒంటి మీద పడుతుంటే ఒక్కసారిగా గాల్లో తేలిపోతున్న భావన. స్నానం చేస్తున్నంత సేపూ తవ్వకాల్లో బయటపడే శిలాజాల్లా ఏవేవో చిన్ననాటి స్మృతులు.
ఒళ్ళు తుడుచుకుని గోడకి వేలాడుతున్న అద్దంలోకి చూశాను. దుఃఖానికీ, సంతోషానికీ, ఆశకీ, నిరాశకీ మధ్య ఎప్పుడూ ఊగిసలాడుతుండే అదే మధ్యతరగతి ముఖం. ఎక్కువసేపు చూడబుద్ధి కాలేదు. బట్టలేసుకుని కింద పరిచి వున్న చాప మీద పడుకున్నాను. పైన కెపాసిటర్‌ సరిగా పని చేయని సీలింగ్‌ ఫ్యాను.. రేపో మాపో పోయే ముసల్దానిలాగా కిర్రు కిర్రుమంటూ నెమ్మదిగా తిరుగుతోంది. దాని శబ్దం వింటూ కళ్ళు మూసుకున్న నాకు ఎప్పుడు పట్టేసిందో నిద్ర. రెండు గంటలపాటు గాఢమైన నిద్ర. ఆ నిద్దురలో ఓ కల. శోభనని నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళినట్టూ, ప్రెగెన్సీ కన్ఫర్మ్‌ అయినట్టూ, అప్పుడే పది నెలలు నిండిపోయి పండంటి మగబిడ్డ పుట్టినట్టూ, వాడు పుట్టీ పుట్టగానే డబ్బు డబ్బు అని గట్టిగా ఏడుస్తున్నట్టూ, డబ్బు లేకపోతే నన్నెందుకు కన్నారని మమ్మల్ని నిలదీస్తున్నట్టూ ఓ వింత కల. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. స్టూలు మీద పెట్టిన బొప్పాయి కాయ 'నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను. భయపడకు' అని అభయమిస్తున్నట్టుగా కూర్చుని ఉంది.
'హమ్మయ్య' అనుకుని నెమ్మది పడేలోపే.. నాలో ఇంకో ప్రశ్న తలెత్తింది. ఇంతకీ ఈ విషయాన్ని తనకెలా చెప్పడం. అసలే తనకి కొంచెం కోపమెక్కువ. నా మాటలు తననేమైనా నొప్పించాయంటే వెంటనే అలుగుతుంది. మాట్లాడ్డం, తినడం మానేసి బాధపడుతూ కూర్చుంటుంది. తను బాధపడితే నేనస్సలు భరించలేను. అందుకే తొందరపడి ఏదో ఒకటి వాగడం కంటే ఎలా చెప్పాలో ముందే ప్రాక్టీస్‌ చేసుకోవడం మంచిదనిపించింది. లేచి అద్దం ముందు నిలబడి, రిహార్సల్స్‌ చేయడం మొదలుపెట్టాను.
'శోభనా.. మనకు ఇప్పుడే పిల్లలొద్దు. ఇదిగో ఈ బొప్పాయి కాయ తిని...'
ఛ.. చెత్తగా ఉంది. మరీ ఇంత డైరెక్టుగా చెప్తే, లాగి చెంప మీద కొడుతుందేమో. అంతేకదా అప్పుడే పెట్టిన గుడ్డుని లాగేసుకుంటానంటే కోడికైనా కోపమొస్తుంది. తను మనిషి. తనకు రాదా మరి. ఊహూ, ఇలా వొద్దు.
ఇంకోలా ట్రై చేద్దాం.
'శోభనా.. మన సంగతి నీకు తెలిసిందే కదా. నీ తరపు నుంచి గానీ, నా తరపు నుంచి గానీ మనకెవరూ సపోర్ట్‌ లేరు. అదీ కాక ఈ సమయంలో ఇద్దరం బయటకెళ్ళి పనిచేస్తేనే నాలుగు రాళ్ళు వెనకేసుకోగలం, ఫ్యూచర్లో అంతో ఇంతో బాగుపడగలం. అలా మనం బాగుపడ్డ రోజు, పోషించగలిగే శక్తి ఉందని నమ్మిన రోజు, పిల్లల గురించి, మిగతా వాటి గురించి ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇవన్నీ చూసుకోకుండా ఇప్పుడే తొందరపడి కనేసి, పుట్టెడు సమస్యల్లో ఉన్న మనం ఇంకా సమస్యల్లోకి కూరుకుపోయి, పుట్టబోయే వాళ్ళకీ ఆ సమస్యల్ని పంచడం అంత బాగుంటుందంటావా? నువ్వే చెప్పు.'
V్‌ా్మ.. పర్వాలేదు. ఇది బాగుంది. ఈ మాత్రం నచ్చజెప్తే చాలు. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఎమోషన్‌ మోతాదు పెంచి, మరికొంచెం విడమర్చి చెప్పాలి. మొత్తానికి ఎలాగోలా కన్విన్స్‌ చెయ్యాలి.
గడియారం వంక చూశాను. ఎనిమిదవుతోంది. తను రావడానికి ఇంక పది నిమిషాలు మాత్రమే ఉంది. బస్సు వచ్చేలోపు ఎప్పటిలాగే నేను మెయిన్‌రోడ్డు మీదున్న బస్టాప్‌ దాకా వెళ్ళాలి. తనని తీసుకు రావడానికి. మళ్ళీ వెళ్ళలేదంటే ఎందుకు రాలేదని తిడుతుంది. ఇంటికొచ్చీ రాగానే సరిపడినన్ని చివాట్లు పెడుతుంది. ఎందుకొచ్చిన గోల. విషయం చెప్పే వరకూ తన మూడ్‌ పాడు చెయ్యకుండా ఉండడమే బెటర్‌.
తల దువ్వుకుని రోడ్డు మీదికొచ్చాను. వర్షం తగ్గినా, అడపాదడపా చినుకులు రాల్తూనే ఉన్నాయి. ఆకాశం నిండా మబ్బులు దట్టంగా అలుముకుని ఉన్నాయి. వీధిలైట్లు వెలిగే చోట తప్ప దారంతా దాదాపు చీకటిగానే ఉంది. రోడ్డుకి ఒక వైపున్న దిరిసెన చెట్లలో ఎండిన కాయలు గాలికి గలగలలాడుతున్నాయి. బస్‌ స్టాపుకి చేరుకున్నాను. దాని పక్కనే ఉన్న రేకుల షెడ్డు కింద బిచ్చగాడొకడు బొచ్చెని కౌగిలించుకుని, వెచ్చగా పడుకుని ఉన్నాడు. వీడి పనే బాగుంది. ఏ బాదరా బందీల్లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. ఇటువంటి జీవితం నాకెప్పుడొస్తుందో ఏమో. నాకు తెలిసి ఈ జన్మలో రాదనుకుంటా. ఒకసారి సంసారమనే లంపటంలో పడ్డాక అసలు మనశ్శాంతి అనేదే ఉండదు.. అంతా పోరాటమే. అనుకుంటుండగా వీధికి అటువైపున్న బిల్‌ బోర్డు ఒకటి నన్ను ఆకర్షించింది. ఇవాళే పెట్టినట్టున్నారు. దాని మీద అర్ధనగంగా నిలబడి ఉన్న అమ్మాయి, తన చేతిలో ఒక నిరోధ్‌ ప్యాకెట్‌ పట్టుకుని చూపిస్తోంది. కింద 'యూజ్‌ నిరోధ్‌ ఫర్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌' అని రాసుంది. అదెవడో నన్ను వెక్కిరించడానికే పెట్టినట్టనిపించింది. పోనీ పెడితే పెట్టాడు. ఆ పెట్టేవాడు కనీసం నెల క్రితమైనా పెట్టి చచ్చుండకూడదా? ఇప్పుడు పెట్టాడు అంతా చెయ్యి జారిపోయాక. ఏదో హారన్‌ వినిపించే సరికి విసుగ్గా తల పక్కకి తిప్పి చూశాను.
బస్సు వస్తోంది.
నాలో ఒక రకమైన టెన్షన్‌ మొదలైంది.
అది స్టాపులోకొచ్చి ఆగీ ఆగగానే అందులోంచి ఫస్టు శోభనే ఆదరాబాదరాగా కిందికి దిగింది. నేను వెళ్ళి తన బ్యాగూ, గొడుగూ చేతిలోకి తీసుకున్నాను. ఎప్పుడు బస్సు దిగినా ఉత్సాహంగా పలకరిస్తూ నా చెయ్యి పట్టుకుని నడిచే తను, ఈ రోజెందుకో కన్నెత్తైనా చూడకుండా, మౌనంగా నడవడం మొదలెట్టింది. తనతో పాటూ నేనూ తోడుగా నడవసాగాను. తనేదైనా మాట్లాడితే నేను నోరు విప్పుదామనుకుంటే, ఎంతకీ మాట్లాడదాయె. నాకేమో ఒకవైపు వీలైనంత తొందరగా చెప్పేయాలనే ఆతృత పెరిగిపోతోంది. కానీ ఎలా కదిలించాలో తెలియడం లేదు. ఇలా సతమతమవుతూ కొంత దూరం నడిచాక, సరే ఏదయితే అది అయ్యిందిలే అనుకుని, 'శోభనా..' అనబోయాను ధైర్యం చేసి. కానీ అంతలోనే తను 'అబ్బా.. మధ్యాహ్నం లంచ్‌ తర్వాత ఎంత పనైందో తెలుసా? సమయానికి నా కొలీగ్‌ దగ్గర ముందు జాగ్రత్తగా తెచ్చుకున్న ప్యాడ్లు, టాబ్లెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే అంతా గందరగోళం అయ్యేది.' అంది చెయ్యి పట్టుకుంటూ.
'ఏవయ్యింది?' అనడిగాను భృకుటి ముడేస్తూ.
'వారం రోజుల పాటూ కాలేదు కదా. ఇక అవ్వదేమో అనుకున్నాను. పోనీలే ఐపోయింది. ఇంతకు ముందు ఒకరోజు, రెండ్రోజులు అటూ ఇటుగా అయ్యేది కానీ, ఇన్ని రోజుల గ్యాప్‌ ఎప్పుడూ రాలేదు.'
తను దేని గురించి మాట్లాడుతుందో అప్పటికిగానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. అర్థమైన వెంటనే నేను పొద్దున్నుంచీ పడుతున్న ఆందోళనంతా కర్పూరంలా కరిగిపోయి, పెదాల మీదో సన్నటి నవ్వు ప్రత్యక్షమైంది. తను పీరియడ్‌ స్కిప్‌ అయ్యిందని చెప్పినప్పుడు రావాల్సిన నవ్వు, ఎందుకో అసందర్భంగా ఇప్పుడొస్తోంది. బహుశా మిడిల్‌ క్లాస్‌ బతుకుల్లో ఇంతేనేమో. కొన్నిసార్లు పరిస్థితుల్లాగే, భావాలు కూడా తారుమారవుతుంటాయి.
తనకు కనిపించకుండా ఆ చిరునవ్వుని కాస్తా చీకట్లో కలిపేసి, మళ్ళీ వర్షం పడుతుందేమోనని తల పైకెత్తి చూశాను. మేఘాలు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి. వాటి మధ్యలోంచి అక్కడక్కడా నింగి తొంగి చూస్తోంది.
నిర్మానుష్యమైన ఆ వీధిలో మా ఇద్దరి నడక నెమ్మదిగా ముందుకు సాగిపోతోంది.

- వెంకట్‌ ఈశ్వర్‌
82972 58369