Oct 23,2023 17:01

ప్రజాశక్తి-తెనాలి : ఆర్ అండ్ బి రోడ్డు మృత్యుఘంటికలు మోగిస్తున్నా అధికారులు మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నందివెలుగు- గుంటూరు మార్గంలో రోడ్డు ప్రమాద భరితంగా ఉంది. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు, ఇసుక, ఇటుక లారీలు, టిప్పర్లు, ఆటోలు, కార్లు, వివిధ విద్యాసంస్థల వాహనాలకు తోడు ద్విచక్ర వాహనాల తాకిడి అధికం. కొల్లిపర, హనుమాన్ పాలెం, దుగ్గిరాల, మంగళగిరి తెనాలి ప్రాంతాల నుంచి ఈ మార్గంలో గుంటూరుకు వాహనాలు రాకపోకలు విస్తృతం. ఈ మార్గంలో ఎరుకలపూడి అడ్డరోడ్డు నుంచి దాదాపు జాకీర్ హుస్సేన్ నగర్ వరకు రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ముఖ్యంగా కొలకలూరులో పిహెచ్సీ సమీపంలో కల్వర్టు కింద తూము పగిలిపోయింది. ఆ ప్రాంతంలో సొంరంగంలాగా గొయ్యి ఏర్పడింది. ప్రమాదాన్ని శంకించిన స్థానికులు, వాహనచోదకులకు కనిపించే విధంగా ఎండిపోయిన చెట్టు కొమ్మను నిలబెట్టారు. పగటి వేళ రోడ్డు పరిస్థితి ఒకింత ఇబ్బంది లేకున్నా, రాత్రి వేళ ప్రమాదాలకు గురౌతున్నారు. నెల రోజులుగా రోడ్డు ప్రమాదభరితంగా ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం మరమ్మతులైనా చేపట్టని అధికారులు ఘోరప్రమాదం సంభవించక ముందే కనీసం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.