
- కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌లో ఘోర ప్రమాదం
- లారీని డీకొన్న సుమో -13 మంది దుర్మరణం
- 10 మంది సత్యసాయి జిల్లా, ముగ్గురు కర్ణాటక వాసులు
ప్రజాశక్తి-గోరంట్ల రూరల్ :వలస కూలీల ఇంట మృత్యు ఘోష మోగింది. రెక్కాడితే గాని డొక్కాడని వారి జీవితాలు రోడ్డు ప్రమాదం రూపంలో బలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం నుంచి గురువారం వేకువజామున 15 మంది వలస కూలీలతో బయళ్దేరిన సుమో కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢకొీన్నది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో పదిమంది శ్రీసత్యసాయి జిల్లా వాసులు కాగా, ముగ్గురు కర్ణాటక ప్రాంతం వాసులున్నారు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సత్యసాయి జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు చెందిన కూలీలు పనుల నిమిత్తం బెంగళూరుకు వలస వెళ్తుంటారు. దసరా పండుగ సందర్భంగా ఐదు రోజుల క్రితం వారి స్వగ్రామాలకు వచ్చారు. పండుగ అనంతరం తిరిగి పనుల కోసం బెంగళూరుకు పయనమయ్యారు. ఈ క్రమంలో గోరంట్ల మండలం కలిగిరి గ్రామానికి చెందిన సుమో డ్రైవర్ హరిజన నరసింహులు (45) గురువారం వేకువజామున నాలుగు గంటల సమయంలో 11 మంది వలస కూలీలలో గోరంట్ల నుంచి బెంగళూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో మరో నలుగురిని ఎక్కించుకున్నారు. తెల్లవారుజామున పొగమంచు ఉండడంతో చిక్‌బళ్లాపూర్ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢ కొట్టాడు. లారీ కిందకు సుమో వెళ్లిపోవడంతో లారీ, సుమో సీట్ల కింద కూలీలు ఇరుక్కుపోయారు. ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక చిక్‌బళ్లాపూర్ ప్రభుత్వాస్పత్రికి స్థానికులు, పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ ఆరుగురు మరణంచారు. మృతుల్లో గోరంట్ల మండలం వానవోలు గ్రామానికి చెందిన బోయ వెంకటాద్రి (27), ఆయన భార్య బోయ లక్ష్మి (23), కొత్తచెరువు మండలం గోరంట్లపల్లి గ్రామానికి చెందిన పవన్(32), డ్రైవర్ హరిజన నరసింహులు (45), ఓబుళదేవరచెరువు మండలం నవాబుకోట గ్రామానికి వెంకట నారాయణ (51), ఆయన భార్య వెంకట సుబ్బమ్మ (48), చిలమత్తూరు మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన గొల్ల గణేష ్(17), ఓబుళదేవరచెరువు మండలం మలకవారిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప (50), పెనుకొండ మండలం గోనిపెంట గ్రామానికి చెందిన గొల్ల శాంతమ్మ (37), ఆమె కుమారుడు గొల్ల రాజవర్ధన్ (15), కర్ణాటక రాష్ట్రం మరగనిగుంట్ల గ్రామానికి చెందిన మంగళ మూర్తి (42), కర్ణాటక రాష్ట్రం దొడగట్టకు చెందిన అరుణ(38), ఆమె కుమారుడు రుత్విక్ సాయి (7) ఉన్నారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను బట్టి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు, సత్యసాయి జిల్లా పోలీసులకు కర్ణాటక పోలీసులు తెలియజేశారు. దట్టమైన పొగ మంచు ఉండడం వల్ల ముందు ఉన్న లారీని గుర్తించలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కర్ణాటక పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామాలకు తరలించారు. సొంతూరిలో పనులు లేక వలస వెళ్తున్న కూలీలు ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం బంధువులు, గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై సిపిఎం, టిడిపి, జనసేన తదితర పార్టీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మృతి చెందిన ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.