
'దేశంలో పెరుగుతున్న ధరలను చూస్తే... ఏం కొనేట్టు లేదు... తినేట్టు లేదు. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ- ఏది కొనాలన్నా... భయపడాల్సి వస్తోంది. ఇప్పుడు దీని సరసన నీరు కూడా చేరింది. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆహార పదార్థాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. 'ఆనందం అర్ణవమైతే/ అనురాగం అంబరమైతే/ అనురాగపు అంచులు చూస్తాం/ ఆనందపు లోతులు తీస్తాం'' అంటారు మహాకవి శ్రీశ్రీ. ప్రతి మనిషీ అవధుల్లేని ఆనందంతోనే జీవించాలనుకుంటాడు. ఆ ఆనందం కూడా ఇప్పుడు కరువైంది. మనిషి ఎంత ఆనందంగా వున్నాడనేది కనీస జీవన ప్రమాణాలకు కొలమానం. ఐరాస రూపొందించిన 'సంతోష నివేదిక- 2022'లో 146 దేశాలకు గాను, భారత్ 136వ స్థానంలో వుంది. 'పుట్టగనే లేమి తలుపు తట్టిందీ/ పస్తులు లేని రోజే ఉండదు/ పండుగ రోజైనా కడుపే నిండదు/ ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు' అంటాడు సినారె. భారీగా పెరిగిన జీవన వ్యయం... ఆనందాన్ని ఆవిరి చేస్తోందన్న వాస్తవాన్ని ఇది రుజువు చేస్తోంది.
పేదరికం...ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న సమస్య. ఇటీవల పేదరికం విస్తతంగా పెరిగిన దేశం భారత్. ఏళ్లు గడుస్తున్నా... పేదల బతుకు చిత్రం మాత్రం మారలేదు. చాలీచాలని ఆదాయం...హద్దు ఆపు లేకుండా పెరుగుతున్న ధరలతో పట్టణ ప్రజలు తమ జీవన వ్యయాన్ని తగ్గించుకొని జీవితాలను వెళ్లదీస్తున్నారు. పల్లెల్లో పరిస్థితి మరింత అధ్వానంగా వుంది. రోజుకు 2,250 కేలరీల ఆహారం తీసుకోలేని వారిని పేదలుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రకారం చూస్తే... దేశంలో పౌష్టికాహారం అందని పేదలు కోట్లాది మంది ఉన్నట్లు నిర్ధారించవచ్చు. దేశంలో నానాటికి పెరుగుతున్న అధిక ధరల నేపథ్యంలో ప్రజలు కొనుగోళ్లు చేయలేకపోతున్నారు. పట్టణ ప్రజలు గత ఆరు నెలలుగా వస్త్రాలు, ఇంధనం, బయట ఆహారంపై వ్యయాలను తగ్గించుకుంటున్నారని గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ 'యుగోవ్' తన సర్వేలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో పౌష్టికాహారం అనే మాటకే తావు లేదు. దీనికితోడు ఆహార కొరత కారణంగా రానున్న కాలంలో ప్రపంచ దేశాలు తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐరాస హెచ్చరించింది. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, పెరుగుతున్న అసమానతలతో ఇప్పటికే కోట్ల మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు. 2022లో మరిన్ని కరువు కాటకాలు సంభవించే అవకాశం వుందని, 2023లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండొచ్చని గుటెర్రస్ చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఆహార లభ్యతలో ఏర్పడే సమస్యలు వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు దారితీయొచ్చని ఐరాస చెబుతోంది. ఇదే జరిగితే...ప్రజల జీవన ప్రమాణం మరింత దిగజారుతుంది.
'పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నించడం దాతృత్వం కాదు. అది అసలైన న్యాయం. ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగం. అంతేకాదు... ఇది గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే హక్కు' అని నెల్సన్ మండేలా అంటారు. ఈ రకమైన కనీస హక్కులను కాలరాసి, 'పేదల దినోత్సవం' అంటూ ఏడాదికోరోజు హడావుడి చేయడం వల్ల పేదలకు ఒరిగేది లేదు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు ధనవంతుల్ని మరింత సంపన్నులుగా, పేదల్ని నిరుపేదలుగా మారుస్తున్నాయి. 'బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచుతాడ'ని అంటాడు నగముని. దేశంలోని అత్యధిక సంపద అదానీ, అంబానీ వంటి కొద్దిమంది దగ్గర పోగుపడుతోంది. రైతులు కూలీలవుతున్నారు. కూలీలు బతుకుదెరువు దొరక్క వలసలతో ఆగమవుతున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తోన్న నయా ఉదారవాద విధానాలు ఈ అంతరాలను మరింత పెంచుతున్నాయి. అసమానతలను రూపు మాపేందుకు ఆర్థిక విధానాల్లో సమూల మార్పు రావాలి. ప్రపంచమంతా పడగ విప్పిన కార్పొరేట్ల పక్షాన కాకుండా పేదల పక్షాన ఆర్థిక విధానాలు ఉండాలి. ప్రకృతిని కొల్లగొడుతూ, వాతావరణ మార్పులకు కారణమౌతున్నవారిని నిరోధించాలి. అప్పుడు మాత్రమే పేదరికాన్ని, అసమానతలను తరిమికొట్టగలం. ఆనందపుటంచులు చూడగలం. అలాంటి రోజే నిజమైన పేదల 'దినోత్సవం' అవుతుంది.