Jul 19,2023 17:00

ప్రజాశక్తి-కందుకూరు(నెల్లూరు) : రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు, భూ సేకరణపై పోర్ట్, రెవిన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. రామాయపట్నం పోర్టు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో కలిసి పోర్ట్, ఏపీఎంబి, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బుదవారం సమీక్ష చేశారు. ముందుగా పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలను పోర్టు అధికారులు కలెక్టర్ కు వివారించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన ఆవులవారిపాలెం, మొండి పాలెం 2 గ్రామాలలో R&R కార్యక్రమాలు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మానవతా దృక్పథంతో, బాధ్యతతో  పోర్ట్ అధికారులు ఆ గ్రామాలలో అవసరమైన సిసి రోడ్లు, త్రాగునీరు, పాటశాల, అంగన్వాడి, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కంపెనీ ఉన్నత అధికారులతో మాట్లాడి పనులు ఎప్పుడు ప్రారంభించేది, ఎప్పుడు పూర్తి చేసేది ప్రణాళిక తయారు చేసి గురువారం సాయంత్రానికి నివేదిక ఇవ్వాలనీ కలెక్టర్ పోర్ట్ అధికారులను ఆదేశించారు. కర్లపాలెం R&R అంశాలను కూడా సమావేశంలో చర్చించారు. పోర్ట్,రెవెన్యూ అధికారులు స్పందించి వేగంగా  చర్యలు తీసుకోవాలన్నారు. పాటశాలలు ప్రారంభించి 2నెలలు అయినందున పిల్లల చదువులకు ఇబ్బంది అవుతున్నందున త్వరగా స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. పోర్ట్ ఉద్యోగాలలో స్థానికులకు అవకాశం కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలను రూ .13.5 కోట్లతో  చేపడుతున్నామని ప్రతాపరెడ్డి కలెక్టర్ కు వివరించారు. పోర్టు నిర్మాణం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి జరిగి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రామాయపట్నం రోడ్డుకు భూములిచ్చిన రైతులకు పరిహారం చెక్కులను కలెక్టర్, ఎమ్మెల్యే అందజేసారు. కందుకూరి ఎమ్మెల్యే ఎం.మహీధర్ రెడ్డి మాట్లాడుతూ వేగంగా మౌలిక వసతులు కల్పించి నిర్వాసితులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే కర్లపాలెం నిర్వాసితులకు భూ సేకరణ పూర్తి అయ్యిందని, డ్రాయింగ్స్ కూడా పూర్తయ్యాయని అన్నారు. పోర్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని జనవరి నాటికి మొదటి షిప్ ను తీసుకు తీసుకురావడానికి వీలుగా అరబిందో కంపెనీవారు పనులు వేగంగా చేపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమిపూజ చేసి ఒక సంవత్సరకాలం అయిందని, పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, జిల్లా కలెక్టర్ స్వీయ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తామని మహీధర్ రెడ్డి చెప్పారు.

అనంతరం రామాయపట్నంలో జరుగుతున్న పోర్టు పనులను కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. కర్లపాలెం నిర్వాసితుల కోసం సిద్దం చేసిన లే ఔట్ లను పరిశీలించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాద్, సబ్ కలెక్టర్ శోభిక, పోర్ట్ ఎండి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ నాగార్జున ,జనరల్ మేనేజర్ భీముడు, వెంకటేశ్వర రెడ్డి పద్మావతి పలువురు పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.