
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ..వీటికి కాస్త ముందుగా జరిగిన ఢిల్లీ మహానగర పాలక సంస్థ (ఎంసిడి) ఎన్నికలు మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. ఢిల్లీలో ఆమాద్మీని, గుజరాత్‌లో బిజెపిని, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించిన ఓటరు మహాశయులు ఉప సమరంలో రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్లా బిజెపిని తిరస్కరించారు. పదిహేనేళ్ల అవినీతి మరకలతో అభాసుపాలైన బిజెపిని రాజధాని ఓటర్లు ఊడ్చిపడేశారు. గుజరాత్ కంటే ముందే ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఓటర్లు బిజెపిని ఘోరంగా ఓడించారు. అధికార మార్పిడి సాంప్రదాయాన్ని కొనసాగించిన హిమాచల్‌ప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధికత్యను అందించారు. హిమాచల్ అసెంబ్లీ 68 స్థానాలుండగా కాంగ్రెస్ 40 సీట్లలో జయభేరి మోగించింది. బిజెపి 25 స్థానాలతో సరిపెట్టుకుంది.
గుజరాత్‌లో ఊహించినదానికంటే అధికంగా బిజెపి అఖండ విజయం సాధించింది. అక్రమాల కారణంగా మోర్బీ వంతెన కుప్పకూలిపోయి 135 మంది ప్రాణాలు బలిగొన్నా..గుజరాత్ నమూనా అంతా డొల్ల అని తేలిపోయినా.. అక్కడ కూడా బిజెపినే నెగ్గింది. నింగినంటిన ధరల నియంత్రణకు చేసిందేమిటి? నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గమేదీ? రైతుల ఘోష విన్నదెప్పుడు? పోషకాహార సంగతేమిటీ? మహిళలకు భద్రతేదీ? ఇలాంటి ప్రజా సమస్యలేవీ చర్చకు రానివ్వకుండా బడా కార్పొరేట్ సంస్థల కాసులతో, కార్పొరేట్ మీడియా అండతో ప్రధాని మోడీ గుజరాత్‌లో మాయాజాలం సృష్టించిన మాట వాస్తవం. మైనార్టీలను వేధింపులకు గురిచేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌర స్మృతి, నిరసనకారుల నుంచి నష్టపరిహారం రాబట్టే బిల్లు, మత మార్పిడి వ్యతిరేక బిల్లు తెస్తామనే హామీలను మేనిఫెస్టోలో చేర్చిన బిజెపి పూర్తి మతతత్వ ఎజెండాతోనే గుజరాత్ ఎన్నికల్లో నిలిచి నెగ్గింది. గోద్రా అనంతరం అత్యాచారాలు, హత్యలకు తెగబడి శిక్ష అనుభవిస్తున్న సంఫ్‌ు పరివార్ దుండగులకు క్షమాభిక్ష పెట్టింది కూడా ఈ ఎన్నికల నేపథ్యంలోనే.
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 152 చోట్ల గెలుపొందడమే కాకుండా 52.3 శాతం ఓటింగ్ సాధించడం అషామాషీ కాదు. సాంప్రదాయంగా కాంగ్రెస్, బిజెపి మధ్యనే ద్విముఖ పోటీ ఉండే గుజరాత్‌లో ఈ దఫా ఆమాద్మీ పార్టీ రంగ ప్రవేశం చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కూడా బిజెపికి బాగా కలిసొచ్చింది. దీంతో కాంగ్రెస్ 17 స్థానాలకు పరిమితమైంది. ఆమాద్మీ పార్టీ 12.9 శాతం ఓటింగ్‌తో 5 స్థానాలు చేజిక్కించుకోవడంతో పాటు జాతీయ పార్టీ హోదాకు చేరుకోవడం గమనార్హం. దేశం వృద్ధి సాధించాలంటే నోట్లపై లక్ష్మీదేవి, గణేష్ చిత్రాలను ముద్రిస్తే చాలు అంటూ ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిందీ ఈ ఎన్నికల నేపథ్యంలోనే. సంఫ్‌ు పరివార్ సృష్టించిన బలమైన మతపరమైన ఓటు బ్యాంక్‌కు, మోడీ 'గుజరాత్ ఆత్మగౌరవ' నినాదం, ఆప్ చీలిక తోడవ్వడంతో బిజెపిని విజయతీరాలకు చేర్చాయన్నది విశ్లేషకుల మాట. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ మీదుగా సాగకపోవడమే కాంగ్రెస్ నాన్చుడు ధోరణికి నిదర్శనం. మోడీ, అమిత్ షా గుజరాత్‌లోనే తిష్టవేసినంతగా ప్రచారం సాగిస్తుంటే రాహుల్ మాత్రం ఒక్క రోజే అక్కడ ప్రచారం చేపట్టడం విడ్డూరం.
ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఒక లోక్‌సభ స్థానం, ఆరు అసెంబ్లీ స్థానాల ఉప సమరంలో బిజెపి తీవ్ర పరాభవం పాలైంది. రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ బిజెపి ఓటమి పాలైంది. మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఉప ఎన్నికలు జరిగిన యు.పి లోని మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ ఘనవిజయం సాధించింది. రెండు అసెంబ్లీ స్థానాల్లో ఒక చోట బిజెపి, మరోచోట ఆర్‌ఎల్‌డి గెలుపొందాయి. రాంపూర్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటర్లను పోలింగ్‌కు రానివ్వకుండా బిజెపి, దాని అదుపాజ్ఞల్లోని పోలీసు, అధికార యంత్రాంగం కుట్ర పన్నాయి. కేవలం 33 శాతం లోపే పోలింగ్ జరగడం అందుకు పెద్ద నిదర్శనం. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్, ఒడిశాలో బిజెడి, బీహార్‌లో బిజెపి విజయం సాధించాయి.
మోడీ, అమిత్ షాతో సహా పలువురు మంత్రులు సుడిగాలి పర్యటనల్తో చక్కర్లు కొట్టినా ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లలో బిజెపి ఘోర పరాజయం పాలైంది. కనుక మోడీ-షా ద్వయాన్ని ఓడించవచ్చునని మరోసారి రుజువైంది. ఈ ఫలితాల నుండి ప్రతిపక్ష పార్టీలు సరైన గుణపాఠాలు తీయాలి. బిజెపి వ్యతిరేక ఓటును ఏకీకరణ చేసేలా రాష్ట్రాల వారీగా వ్యూహాలు రూపొందించాలి. తద్వారా బిజెపిని ఒంటిరిపాటు చేయడం, ఓడించడం సాధ్యమవుతాయి.