ప్రజాశక్తి - చాపాడు : పోలీసు స్టేషన్ కు వివిధ సమష్యలతో వచ్చే ప్రజలను గౌరవించాలని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ సిబ్బంది కి సూచించారు. బుధవారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ కు వచ్చే వారి పట్ల మంచిగా నడుచుకోవాలన్నారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది పని తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసులకు తగిన సూచనలు, సలహాలు చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాలల్లో, పబ్లిక్ ప్రదేశాలలో డ్రగ్స్, చైల్డ్ మ్యారేజెస్, దిశ యాప్, మహిళలపై జరిగే నేరాలు, ఆన్ లైన్, సైబర్ మోసాలు తదితర విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు రూరల్ సిఐ శ్రీనాధ్ రెడ్డి, ఎస్ఐ మైనుద్దిన్, సిబ్బంది పాల్గొన్నారు.










