Jul 02,2023 12:10

చుక్క కోసం
నేల దాహం
మట్టి పరిమళం
ముక్కు పుటాల తాకే క్షణం

గింజ
చెలికాడైన చుక్క కోసం
విరహ వేదనతో
మొలకెత్తాలనే తహతహ
మది నిండా

కొమ్మల ఊయల్లో
చెట్టు పరవశం
ఆకుల సవ్వడి
మృదు సంగీత ధ్వని

నాగళ్ళు సాలల్ల
సల్లగా తిరుగుతుంటే
లేచిన మట్టిపెళ్ళ
ఒళ్ళు విరుచుకుంది

కులుకుల నడకతో పైరు
వయ్యారం ఒలకబోసే వేళ
మడి కట్ల మెడలో
పచ్చనిహారం తళతళలాడింది

గలగల పారే ఒర్రె
ఒకింత వేదనతో
వాగును చేరే.. సేద తీరే
తన ఉనికికో సార్థకం!

మోదుగు ఆకుల
చింతతొక్కుతో హంసన్నం
కురిసే చినుకుల మధ్య
చల్లారే జిహ్వ చాపల్యం

తొలకరిలో
ఒరాల మీద నడిచే
నాలుగు పాదాల ముద్రలు
ఏడడుగులు చేర్చే
పదనిసల పరువాలు
పదునైన బాసలు
 

- గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201