ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని
గుట్టు చప్పుడు కాని గూట్లో
రెక్కల సడిని ఆపేసి
మౌనం ముసుగేసి కూర్చోవాలి
రెక్కల కింద పసిపిల్లల్ని
పంటి బిగువున ఆకలిని
అదిమి పెట్టుకుని జీవించాలి
గుండె దారంపై జీవనం
భారంగా కదిలిపోతున్నా
ఆకలి రాజ్యంలో ఆంక్షలను
ఎన్నాళ్ళని ఏకాంతంగా భరించాలి
గట్టు తెంపిన యేరు
తీరాలను శాసిస్తూ కదిలినట్లు
సహనాన్ని సాహసంగా మార్చి
ఏ మూలన ఒదిగిపోవాలి
రెక్కల చప్పుడు వినపడగానే
పెడరెక్కలిరిసే ధోరణికి
ఎన్నేళ్ళు కట్టుబడి బతకాలి
కరిగిపోతున్న కాలం చేతిలో
కీలు బొమ్మలమై
ఇంకా ఎన్నాళ్ళు ఊగాలి
చైతన్యంతో చేతులు కలిపి
పరిష్కారంతో సారవాసం చేసి
మట్టిగోడల గోడును
ఇనుప చువ్వల హృదయాలకి
భద్రంగా తగిలించాలి
రెక్కల చప్పుళ్ళ కింద
మూగ గాయాల రోదన
ఏడ్పు రాగమై వినిపించాలి
లోలోపల గడ్డకట్టుకుపోయిన
కన్నీటి మూటను కరిగించాలి
నరెద్దుల రాజారెడ్డి
96660 16636